సంధ్య థియేటర్ వివాదం: అల్లు అర్జున్ సమస్యల నుండి బయటపడేనా?

First Published | Dec 26, 2024, 11:58 AM IST

సంధ్య థియేటర్ ఉదంతం టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అన్నట్లుగా తయారైంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన గుబులు రేపింది. అల్లు అర్జున్ పై విమర్శల దాడి కొనసాగుతుంది . కాగా నేడు పరిశ్రమ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో వివాదానికి తెరపడనుందా అనే చర్చ మొదలైంది.

వివాదం ఏమిటీ?


డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రీమియర్స్ ప్రదర్శన నేపథ్యంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు హీరోయిన్ రష్మిక మందానతో పాటు వెళ్లారు. అల్లు అర్జున్ రాకతో భారీగా అభిమానులు సంధ్య థియేటర్ కి చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. బాలుడికి చికిత్స జరుగుతుంది. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ పేరు ఏ 11గా చేర్చారు. డిసెంబర్ 12న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేసింది 

సీఎం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు 

అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి చేశారు. కొందరు చిత్ర ప్రముఖులు సైతం పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేశారు. బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ ని చిత్ర ప్రముఖులు కలిసి సంఘీభావం తెలిపారు. 

ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసెంబ్లీ వేదికగా టాలీవుడ్ ప్రముఖులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు, టికెట్స్ ధరల పెంపుకు అనుమతులు ఇచ్చేది లేదని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన టాలీవుడ్ వర్గాల్లో గుబులు రేపింది. 


మరోసారి విచారణకు అల్లు అర్జున్ 

రేవతి మృతి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఏ11 గా అల్లు అర్జున్ ని పేరు చేర్చారు. ఇటీవల తెలంగాణ పోలీసులు మరోసారి అల్లు అర్జున్ ని విచారణకు పిలిచారు. BNS 35(3) సెక్షన్ క్రింద నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా మూడు గంటల పాటు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి సీఐ, సీపీఏ విచారించారు. కీలక అంశాలపై స్పష్టత కోరారు. లాయర్ తో పాటు విచారణలో పాల్గొన్న అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకు మౌనం వహించాడని సమాచారం. 

అల్లు అర్జున్ పై మాటల దాడి 

అల్లు అర్జున్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాటల దాడి చేస్తున్నారు. అల్లు అర్జున్ ఆంధ్రుడు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే.. తెలంగాణలో అల్లు అర్జున్ సినిమాలు ఆడనీయం అంటూ హుకుం జారీ చేశారు. ఈ వివాదం ఏకంగా ప్రత్యేక తెలంగాణ చిత్ర పరిశ్రమ అనే వాదన తెరపైకి తెచ్చింది. ఆంధ్ర దర్శక నిర్మాతలు, నటులు హైదరాబాద్ వీడి పోవాలి. మీ వలన స్థానికులకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. మీరు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. 

వివాదానికి తెర పడేనా?


అల్లు అర్జున్ కేంద్రంగా మొదలైన వివాదం మొత్తం పరిశ్రమకు పాకింది. టాలీవుడ్ ప్రయోజనాలు దెబ్బ తినేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉన్నాయి. తెలుగు సినిమాకు నైజాం అతిపెద్ద మార్కెట్స్ లో ఒకటిగా ఉంది. పుష్ప 2 నైజాం హక్కులు ఏకంగా రూ. 100 కోట్లకు అమ్మారు. ఆ స్థాయిలో నైజాం నుండి బిజినెస్ జరుగుతుంది. దాంతో చిత్ర ప్రముఖులు దిగొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి టికెట్స్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. 

ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌ దిల్‌ రాజు సారథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో నేడు ఇండస్ట్రీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ మీటింగులో హీరోలు నాగార్జున, వెంకటేష్‌, నితిన్‌, వరుణ్‌ తేజ్‌, కిరణ్‌ అబ్బవరం, శివబాలాజీ పాల్గొన్నారు. అలాగే దర్శకులు.. త్రివిక్రమ్‌, హరీష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, బాబీ, బలగం వేణు, వంశీ, బోయపాటి శ్రీను,  రాఘవేంద్రరావు ఉన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేష్‌బాబు, సునీల్‌ నారంగ్‌, నాగవంశీ, రవి శంకర్‌, దామోదర ప్రసాద్‌, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, సుప్రియ, నవీన్‌ ఎర్నేని సైతం పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం ప్రతినిధులుగా నుంచి సీఎం, భట్టి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, డీజీపీ, ప్రిన్సపల్‌ సెక్రెటరీ రవి గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఈ భేటీలో ప్రభుత్వం-టాలీవుడ్ మధ్య సహకారం, పరస్పర ప్రయోజనాలపై ప్రధానంగా చర్చ సాగనుంది. ఇక అల్లు అర్జున్ వ్యవహారం కూడా సద్దుమణిగే సూచనలు ఉన్నాయి. ఇగో వార్ కారణంగానే అల్లు అర్జున్ కేసును తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుందనే వాదన ఉంది. మరోవైపు చిరంజీవితో పాటు మెగా హీరోలు ఎవరూ ఈ భేటీలో పాల్గొనలేదు. 

Latest Videos

click me!