
రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys)ను ‘మైత్రీ మూవీస్’ తెలుగులో డబ్ చేసి, విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుకోకుండా పీవీఆర్ మల్టీప్లెక్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శనలను గురువారం అర్ధంతరంగా నిలిపివేసింది. దీంతో, మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి నిర్మాతల మండలిని ఆశ్రయించారు. ప్రసుత్తం ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతుండగా నిలిపివేయడంపై మండిపడ్డారు. మలయాళం నిర్మాతతో ఇబ్బంది ఉంటే తెలుగు వెర్షన్ ఎలా ఆపుతారని ప్రశ్నించారు. పీవీఆర్ మల్టీప్లెక్స్ వ్యవహారంపై నిర్మాతల మండలి అత్యవసర సమావేశం కానుంది. అయితే అసలు ఏం జరిగిందంటే?
పీవీఆర్ మల్టీప్లెక్స్ (PVR Multiplex)కి మళయాళ చిత్ర పరిశ్రమ కు మధ్య వివాదం మొదలైంది. అందుకు కారణం డిజిటల్ ప్రొవైడర్లు. డిజిటల్ ప్రొవైడర్లు లలో ముఖ్యంగా UFO,Qube మనవాళ్లు వినియోగిస్తూంటారు . నిర్మాతలు తమ సినిమాలను ఆ డిజిటల్ ప్రొవైడర్లు ఫార్మెట్ లోకి మార్చి ఇస్తూంటారు. అయితే అక్కడే సమస్య మొదలైంది.
భారీ స్థాయిలో కోట్లు ఖర్చు చేసి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు గత కొంత కాలంగా క్యూబ్, యు ఎఫ్ ఓ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ భారీ స్థాయిలో నష్టపోతున్నారట. గతంలో ప్రింట్ సిస్టమ్ మాత్రమే వుండేది. అయితే డిజిటలైజేషన్ లో భాగంగా డిజిటల్ ప్రింగ్ భారీ స్థాయిలో వాడకంలోకి వచ్చేసింది. దీంతో చాలా వరకు థియేటర్లని టిజిటలైజ్ చేసేశారు. అయితే నిర్మాతలకు ఇది పెను భారంగా మారుతూ వస్తోందని, డిజిటల్ ప్రొవైడర్లు ఈ విషయంలో తమని దోపిడీకి గురి చేస్తున్నారని నిర్మాతలు వాపోతున్నారు. గత కొంత కాలంగా దీనిపై చర్చ జరుగుతున్నా సమస్య కొలిక్కి రాకపోవడంతో ఈ వివాదంపై కేరళ నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు.
మళయాళ నిర్మాతలు తమ సొంత ప్రొడక్షన్ కంటెంట్ మాస్టరింగ్ సిస్టమ్ PDC (Producer’s Digital Content)ని ఏర్పాటు చేసుకుని పీవీఆర్ వారిని అవి వాడమని కోరారు. తమ సినిమాలను ఆ ఫార్మెట్ లో ప్రదర్శించమన్నారు. అయితే ఈ కొత్త ఫార్మెట్ ని ఎడాప్ట్ చేసుకోవటానికి పీవీఆర్ కు చాలా ఖర్చు అవుతుంది. దాంతో వాళ్లు మళయాళ సినిమాల ప్రదర్శననే ఆపేసారు. అందులో భాగంగానే ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys)తెలుగు వెర్షన్ ని ఆపేసారని తెలుస్తోంది.
ఇక పీవీపి తీరుపై డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీస్ (Mythri Movies) ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయం కోసం నిర్మాతల మండలిని ఆశ్రయించింది. మలయాళ నిర్మాతతో వివాదం అయితే తెలుగు వెర్షన్ నిలిపివేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏదైన గొడవలు ఉంటే మీరు నేరుగా వారితో తేల్చుకోవాలని, వెంటనే మూవీ ప్రదర్శించాలని కోరిన పీవీఆర్ యాజమాన్యం వినిపించుకోలేదట. దీంతో ఆయన ఈ విషయమై తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారంపై ఆయన ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఫిలిం ఛాంబర్ పీవీఆర్ యాజమాన్యంతో అత్యవసర సమావేశానికి పిలుపినిచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా (గ్రాస్) వసూళ్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా నిలిచిందీ చిత్రం. శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపత్, లాల్ జూనియర్, దీపక్ కీలక పాత్రల్లో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైంది. ఏప్రిల్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.