Sirivennela Seetharama Sastry:తెలవారదేమో స్వామీ...అలా ఆధునిక అన్నమయ్య అయ్యారు సిరివెన్నెల

First Published Dec 1, 2021, 8:01 AM IST

కలం గమనం ఆగిపోయింది. తెలుగు సాహిత్యం తోడును కోల్పోయింది. సిరి వెన్నెల మరణంతో సినీ లోకంలో చీకటి అలుముకుంది. సీతారామశాస్త్రి హఠాన్మరణం అభిమానులను, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచివేసింది. మూడున్నర దశాబ్దాలు తిరుగులేని పాటల రచయితగా కళామతల్లికి పదాలతో సేవ చేసిన ఆయన మరణం తీరని విషాదం. 


రెండు తరాల పాటల రచయితలకు సిరివెన్నెల (Sirivennela Seetharama Sastry) స్ఫూర్తి దాత. వేటూరి, ఆత్రేయ, ఆరుద్ర, సి. నారాయణరెడ్డి వంటి దిగ్గజ సాహితీవేత్తల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న భాషా మేధావి. సందర్భానికి తగ్గట్టుగా తన పదాలతో మాయ చేసిన సిరివెన్నెల రాసిన ఓ పాట.. అన్నమయ్య పాటగా ప్రచారమైంది. 
 

కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శృతి లయలు మూవీ కోసం సిరివెన్నెల ఓ సాంగ్ రాశారు. ఈ పాటను మంగళంపల్లి బాలమురళి ఆలపిస్తారని, విశ్వనాధ్ సిరివెన్నెలకు ముందే చెప్పారు. శాస్త్రీయ సంగీతకారుడైన మంగళంపల్లి కోసం సిరివెన్నెల అద్భుతమైన సాహిత్యంతో 'తెలవారదేమో స్వామీ..' అనే పాట రాశారు. 
 

ఈ పాట అనుకోకుండా మంగళంపల్లికి బదులు మరో లెజెండరీ సింగర్ యేసుదాసు పాడారు. ఆ పాట సాహిత్యం నచ్చిన యేసుదాసు, లిరిక్స్ తనతో పాటు తీసుకెళ్లారట. యేసుదాసు తన పాట కచ్చేరీలలో ఈ పాటను తరచుగా ఆలపించేవారు. ఈ పాటను అన్నమయ్య సంకీర్తనగా ఆయన భావించారట. అన్నమయ్య రాసిన వేల సంకీర్తనలలో అది తనకు తెలియని ఓ పాటగా పొరపాటుబడ్డారట. తర్వాత అది సిరివెన్నెల రాసిన పాట అని తెలుకొని ముగ్దులు అయ్యారట. 

శృతి లయలు చిత్రానికి ఏకంగా 8 నంది అవార్డ్స్ దక్కాయి. తెలవారదేమో స్వామి సాంగ్ విషయంలో ఇక్కడ కూడా ఓ పొరపాటు చోటు చేసుకుంది. నంది అవార్డు జ్యూరీ సభ్యులు ఈ సాంగ్ అన్నమయ్య రాశారని అనుకున్నారట. మూవీ యూనిట్ పొరపాటున అవార్డ్స్ ఎంపికకు పంపివుంటారు, అనుకోని ఆ సాంగ్ పరిగణలోకి తీసుకోలేదట. చివరి అది ఒరిజినల్ గా సిరివెన్నెల రాసిన సాంగ్ అని తెలుసుకొని అవార్డుకు ఎంపిక చేశారట.

ఇక ఈటీవీ యాజమాన్యం సైతం ఈ సాంగ్ విషయంలో పొరపాటు చేసింది. ఈటీవీ ప్రారంభంలో సరాగాలు పేరుతో ఓ పాటల కార్యక్రమం ఉదయం ప్రసారం అయ్యేది. సరాగాలు ప్రోగ్రాం లో తరచుగా తెలవారదేమో... సాంగ్ ప్రసారం చేసేవారు. ఆ పాట క్రెడిట్స్ లో రచయిత అన్నమయ్య అని వేసేవారట. ఈటీవీ సరాగాలు నిర్వాహకులు కూడా అది అన్నమయ్య రాసిన సాంగ్ అని పొరపడ్డారు. తర్వాత వారికి నిజం తెలిశాక, అన్నయ్యకు బదులు సిరివెన్నెల పేరు పొందుపరిచారు. 


అలా సిరివెన్నెల రాసిన పాట శ్రీవారి భక్తుడు, కారణజన్ముడైన అన్నమయ్య పాటను తలపించింది అంటే మాములు విషయం కాదు. ఇది  సిరివెన్నెలకు  భాషపై ఉన్న పట్టు, సాహిత్యంలో ఉన్న అవగాహన, సందర్భాన్ని పాటలో వెల్లడించే తీరుకు నిదర్శనం. 
Also read సిరివెన్నెలకు అవార్డులు తెచ్చిపెట్టిన పాటలివే.. ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌.. వింటే మైమరచిపోవాల్సిందే

Also read Sirivennela: ఎడమ భుజం కోల్పోయాః కె.విశ్వనాథ్‌.. తనకు దిశా నిర్ధేశం చేశారంటూ రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు

click me!