Sirivennela Death: టాలీవుడ్‌లో విషాదాలు.. నాలుగు రోజులు ముగ్గురు ప్రముఖులు మరణం..

First Published Nov 30, 2021, 8:17 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు మృత్యువాత పడ్డారు. నాలుగు రోజుల క్రితం దర్శకుడు, నటుడు కె.ఎస్‌.నాగేశ్వరరావు, రెండు రోజుల క్రితం కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌, నేడు(మంగళవారం) పాటల రచయిత సిరివెన్నెల కన్నుమూశారు. టాలీవుడ్‌ని తీవ్ర విషాదంలో ముంచెత్తారు. 
 

నాలుగు రోజుల క్రితం ఈ నెల 27న(శనివారం) ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.నాగేశ్వరరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. `పోలీస్‌`, `సాంబయ్య`, `శ్రీశైలం`, `వైజయంతి` వంటి అనేక సూపర్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. మరోవైపు నటుడిగానూ మెప్పించారు. 

ఆదివారం సాయంత్రం కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కరోనా నెగటివ్‌ వచ్చాక కూడా శివశంకర్‌ మాస్టర్‌ మరణించడం విచారకరం. ప్రముఖ పాపులర్‌ కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్న శివశంకర్‌ మాస్టర్‌ మరణం టాలీవుడ్‌ని కలచివేసింది. ఆయన మృతి పట్ల తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. 

తాజాగా మంగళవారం సాయంత్రం పాటల దిగ్గజం నెలకొరింది. లంగ్స్ క్యాన్సర్‌తో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. టాలీవుడ్‌ని, సినిమా పాటని చీకట్లోకి నెట్టేసి వెళ్లిపోయారు. సిరివెన్నెల మరణం ఇప్పుడు యావత్‌ సాహిత్య లోకాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. అద్భుతమైన పాటలతో అలరించిన సిరివెన్నెల మరణం టాలీవుడ్‌కి తీరని లోటని చెప్పొచ్చు. 

సిరివెన్నెల మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. శ్రీశ్రీ రచన సిరివెన్నెలలో కనిపిస్తుందన్నారు. ఆయన మరణం మనకు తీరని లోటన్నారు. మోహన్‌బాబు, బాలకృష్ణ, పవన్‌, ఎన్టీఆర్‌, మహేష్‌, రామ్‌చరణ్‌తోపాటు దర్శకులు, నిర్మాతలు తమ సంతాపాన్ని తెలియజేశారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి 1986లో `సిరివెన్నెల` చిత్రంతో పాటల రచయితగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలి చిత్రంనే ఇంటిపేరుగా మార్చుకున్నారు. అభ్యూదయ పాటలతోనూ ఆకట్టుకున్నారు. కమర్షియల్‌ సాంగ్‌ల్లోనూ ఆలోచింప చేసే సాహిత్యాన్ని జోడించి సరికొత్త హంగులు అద్దారు. కొత్త ట్రెండ్‌ని సృష్టించారు. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఆయన మూడు వేలకుపైగా పాటలు రాశారు. `పద్మశ్రీ` పురస్కారం అందుకున్నారు. 11 నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. 

వీరితోపాటు నిర్మాత మహేష్‌ కోనేరు, పీఆర్‌వో-నిర్మాత బి.ఏ.రాజు, నటుడు నాగయ్య, పొట్టి వీరయ్య, నటుడు, యాంకర్‌ టీఎన్‌ఆర్‌, సినీ విమర్శకుడు కత్తిమహేష్‌, దర్శకుడు సాయి బాలాజీ, నటి జయంతి వంటి తెలుగు సినీ ప్రముఖులు ఈ ఏడాది వరుసగా కన్నుమూసిన విషయం తెలిసిందే. 

click me!