చిరంజీవి దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరో. 90లలోనే ఆయన కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారు. అమితాబ్ కంటే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరో అంటూ అప్పట్లో ప్రముఖ మీడియా ఓ కథనం ప్రచురించింది. ఇక చిరంజీవి వేసిన రహదారిలో మెగా హీరోలు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా తన తమ్ముళ్లను చిరంజీవి కన్నబిడ్డల మాదిరి చూసుకుంటారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అమిత ఇష్టం.
నాగబాబును హీరోగా నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నం చేశారు. అది సఫలం కాలేదు. దాంతో నిర్మాతను చేశాడు. కానీ నాగబాబుకు కాలం కలిసి రాలేదు. చిరంజీవి హీరోగా నాగబాబు నిర్మించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఇక రామ్ చరణ్ హీరోగా నాగబాబు తెరకెక్కించిన ఆరెంజ్ భారీ డిజాస్టర్. మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం విడుదలైన ఆరెంజ్ కనీస వసూళ్లు రాబట్టలేదు. ఆస్ట్రేలియాలో అధిక భాగం చిత్రీకరించారు. ఆరెంజ్ ఫెయిల్యూర్ తో నాగబాబు రోడ్డున పడాల్సి వచ్చింది. మరోవైపు గీతా ఆర్ట్స్ చిరంజీవితో బ్లాక్ బస్టర్స్ నిర్మించి బడా నిర్మాణ సంస్థగా ఎదిగింది.