మెగా ఫ్యామిలీ టాలీవుడ్ లో మహావృక్షంగా పాతుకుపోయింది. దీనికి బీజం వేసింది చిరంజీవి. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. దశాబ్దాలపాటు నెంబర్ వన్ హీరోగా శాసించాడు. ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ స్టార్స్ అయ్యారు. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు.
చిరంజీవి అంటే ఆ కుటుంబంలో అందరికీ గౌరవం. పవన్ కళ్యాణ్ సైతం అన్నయ్య పట్ల గౌరవం, ప్రేమ కలిగి ఉన్నాడు. సందర్భం దొరికితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి కలుస్తారు. పండగలు, వేడుకల్లో కలిసి పాల్గొంటారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ చాలా అన్యోన్యంగా ఉంటారు.
అయితే ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నటనకు గుడ్ బై చెప్పిన చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశారు. పీఆర్పీ కోసం పవన్ కళ్యాణ్ సైతం తీవ్రంగా కష్టపడ్డారు. ఆ పార్టీలో యువజన విభాగానికి ఆయన అధ్యక్షత వహించాడు.
ఎన్నికల్లో పీఆర్పీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత చిరంజీవి ఒత్తిడికి గురయ్యాడు. విమర్శల నేపథ్యంలో నెలల వ్యవధిలో చిరంజీవి పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. చిరంజీవి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఓపెన్ గా తప్పుబట్టారు. మీడియా ముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేశాడు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటని చిరంజీవిని అడగ్గా... పవన్ కళ్యాణ్ ది చిన్నపిల్లల మనస్తత్వం. అతని కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చిరంజీవి సున్నితంగా ఖండించారు. ఈ పరిణామాల తర్వాత కొన్నాళ్ళు చిరంజీవి-పవన్ కళ్యాణ్ కలవలేదు. కాలక్రమేణా మెగా బ్రదర్స్ ఒక్కటయ్యారు. 2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు.