
సీనియర్ నటుడు నరేష్ విజయ్ కృష్ణ ట్రోల్స్ పై స్పందించారు. తాను ప్రస్తుతం `క్రేజీ కల్యాణం` మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఇందులో నరేష్ మాట్లాడుతూ, సినిమా విశేషాలు, టీమ్ గురించి మాట్లాడారు. ఈ క్రమంలో పిల్లల్ని కనాలని తెలిపారు. ఇప్పుడు పెళ్లి బంధం గురించి ఆయన మాట్లాడుతూ, విడాకులు ఎక్కువ అవుతున్నాయి. పెళ్లి చేసుకోండి చేసుకోకపోండి, లివింగ్‌లో అయినా ఉండండి, కానీ పిల్లల్ని కనండి అని వెల్లడించారు.
ఈ క్రమంలో నరేష్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. కొంత ట్రోల్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ, దీనిపై స్పందించారు. తన ఉద్దేశ్యాన్ని వెల్లడించారు. పెళ్లి బంధం పలుచగా మారిపోతుందని, ఆన్‌లైన్ మ్యారేజ్ యాప్‌ల ద్వారా పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు, గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకొని నెల రోజులకు విడిపోతున్నారు. పెళ్లిళ్లు నిలబడటం లేదు. అందుకే తాను లివింగ్‌లో అయినా ఉండండి, కానీ పిల్లల్ని కనండి అని చెబుతున్నాను. ఎందుకంటే దేశంలో జనాభా తగ్గిపోతుంది. ముఖ్యంగా సౌత్ స్టేట్స్ లో దారుణంగా జనాభా పడిపోతుంది. ఇది భవిష్యత్‌కి ప్రమాదకరం. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ఏకంగా పిల్లల్ని కనాలని చెబుతున్నారు. ఎక్కువ మందిని కనమని చెబుతున్నారు. ఆ మాటనే నేను చెప్పాను అని తెలిపారు. అందులో నా తప్పేం లేదు. ఎలాగైనా పిల్లల్ని కనమని మాత్రమే చెబుతున్నా అని వెల్లడించాడు నరేష్.
ఇక `క్రేజీ కల్యాణం` సినిమా గురించి నరేష్ చెబుతూ, `క్రేజీ కల్యాణం సినిమా నాలుగు స్తంభాలాట లాంటిది నేను, తరుణ్ భాస్కర్, అనుపమ, అఖిల్.. ఈ నలుగురి క్యారెక్టర్స్ నాలుగు ఫిల్లర్స్ లాంటివి. అందులో నా పాత్రకు ఇంకొంత ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. గతంలో హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు వచ్చేవి. ఒక మెయిన్ క్యారెక్టర్ ఆ పాత్ర చుట్టూ మరికొన్ని పాత్రలు ఉంటాయి. నా పాత్ర ఈ సినిమాకు హీరో అంటే..హీరోయిజంకు ఇప్పుడు అర్థం మారిపోయింది. పాటలు, ఫైట్స్, రొమాన్స్ చేస్తేనే హీరో కాదు. కథకు లీడ్ తీసుకుని మెప్పించే పాత్రే హీరో. ఒక ఊరిలో మధ్య తరగతి కుటుంబంలో జరిగే కథ ఇది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరిగే ఎమోషనల్ స్ట్రగుల్ ఈ మూవీలో ప్రధానాంశం. ఈ ఎమోషన్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఈ కథకు నాలుగు ప్రధాన పాత్రల్లో సరైన నటీనటులు కుదిరారు. వాళ్లలో ఎవరు లేకున్నా ఈ సినిమా స్ట్రెంత్ పదిశాతం తగ్గిపోయేది`.
`డైరెక్టర్ బద్రప్పను నేను కె విశ్వనాథ్ గారితో పోలుస్తాను. ఎందుకంటే ఆయన తన సినిమాల్లో నేటివిటీకి దూరంగా వెళ్లకుండా కొత్త దారిలో కథ చెబుతూ పాత్రలకు ఒక కొత్త అర్థాన్నిస్తూ సినిమా రూపొందిస్తారు. ఆ పాత్రలకు ఒక మంచి ముగింపు ఇస్తారు. బద్రప్ప కూడా క్రేజీ కల్యాణం సినిమాను అలాగే డీల్ చేశాడు. క్రేజీ కల్యాణం లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. నా పాత్రలో ఎమోషన్ తో పాటు ఫన్ ఉంటుంది. తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు పాత్ర ప్రతి ఊరిలో ఉంటుంది. అతనికి ఒక మెమొరబుల్ క్యారెక్టర్ ఇది అనుకోవచ్చు. ఊరిలో ఉండే ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయిని అనుపమ పాత్ర ప్రతిబింబిస్తుంది.అలాగే అఖిల్ మంచి రోల్ చేశాడు`.
`ఈ దసరా పండక్కి వచ్చే చిత్రాల్లో మంచి ఫన్, ఎమోషన్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ క్రేజీ కల్యాణం. దసరా పండక్కి ఈ సినిమాను ఫ్యామిలీస్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో రక్తపాతాలు లేవు ఉన్నదంతా ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ మాత్రమే. మా సినిమా టీజర్, ట్రైలర్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సినిమాకు కూడా అలాంటి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నాం. పండుగకు వచ్చే అన్ని సినిమాలు బాగుండాలి. డైరెక్టర్ బద్రప్ప ఈ కథను రెండు గంటల సేపు సీన్ టు సీన్ డీటెయిల్డ్ గా నెరేషన్ ఇచ్చాడు. ఆయన కథ చెబుతున్నప్పుడే అందులోని ఎమోషన్, ఫన్ ను బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో నేను నవరసాలు పండిస్తూ 350 క్యారెక్టర్స్ మధ్య 9 మంది క్యారెక్టర్స్ తో ఒక్కొక్కరితో ఒక్కో ఎమోషన్ తో డైలాగ్స్ చెప్పే దాదాపు 6 నిమిషాల లెంగ్తీ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ చేయడానికి మొదట భయపడ్డాను. ఎక్కడా రిఫరెన్స్ కూడా లేదు. బద్రప్పతో ఈ విషయం చెబితే నవరసాల సీన్ కు మీరే రిఫరెన్స్ అన్నాడు. సింగిల్ టేక్ లో ఆ లెంగ్తీ సీన్ చేశాను. అందుకే ఈ సినిమాలో నా నవరసరాయ టైటిల్ ను ఫస్ట్ టైమ్ వాడుతున్నాం. ఈ సీన్ చేశాక కార్వాన్‌లోకి వెళ్లి ఏడ్చాను. మా ప్రొడ్యూసర్ జగన్ మోహన్ కు సినిమా మీద చాలా ప్యాషన్. అందుకే ఈ రోజు మా సినిమాను ఈ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఆయన ఈ ఇండస్ట్రీలో చాలాకాలం ప్రొడ్యూసర్ గా ఉండిపోతారు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ యూనివర్సల్, ఎవర్ గ్రీన్. ఆ ఎమోషన్ ను మా మూవీలో చూస్తారు` అని తెలిపారు నరేష్.
అనుపమా పరమేశ్వరన్, నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహించగా, బూసమ్ జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 16న దసరా కానుకంగా ఈ చిత్రం విడుదల కానుంది.