విశాల్ అంటే యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల ఆయన నటించిన సినిమాలన్నీ యాక్షన్ ప్రధానంగా సాగుతూ మిశ్రమ స్పందనని రాబట్టుకుంటున్నాయి. తాజాగా ఆయన మరోసారి యాక్షన్ సినిమాతో వచ్చాడు. ఇందులో మరో హీరో ఆర్యతో కలిసి ఆయన ఈ సినిమా చేశారు. `ఇంకొక్కడు`, `నోటా` చిత్రాలతో మెప్పించిన ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా దీపావళి కానుకగా నేడు నవంబర్ 4(గురువారం)న విడుదలయ్యింది. తమిళంతోపాటు తెలుగులోనూ సినిమా విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అన్నది చూడాలి.
కథః
పారి(ప్రకాష్‌రాజ్) రిటైర్డ్ సీబీఐ ఆఫీసర్. తన కుమారుడు రాజీవ్(ఆర్య)ని, అలాగే స్నేహితుడు సూర్య(విశాల్)లను పోలీస్ అధికారులను చేయాలనుకుంటాడు. కానీ సూర్య తండ్రి(తంబి రామయ్య)కి అది ఇష్టం ఉండదు. కానీ తన ప్రయత్నాలు సీరియస్‌గా చేస్తాడు. అయితే ఇంతలో పారి చనిపోతాడు. దీంతో రాజీవ్, సూర్య దారులు వేరవుతాయి. ఇద్దరు విడిపోతారు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ కలుస్తారు. కాకపోతే శత్రువులుగా కలవాల్సి వస్తుంది. ఈ గ్యాప్‌లో వీరి జీవితాలు ఎన్ని మలుపులు తిరగాయి. స్నేహితులుగా ఉన్న వీరు ఎందుకు శత్రువులయ్యారు, వీరికి మమతా మోహన్‌దాస్ పాత్రకి ఉన్న సంబంధం ఏంటనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`తుప్పరివాలన్`, `విలన్`, `ఇరుంబు తిరై`, `యాక్షన్`, `చక్ర` వంటి బ్యాక్ టూ బ్యాక్ యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు `ఎనిమీ`తోనూ మరోసారి యాక్షన్ చిత్రంతో వచ్చాడు విశాల్. ఇందులో ఆర్య మరో హీరో కావడంతో సినిమాపై అంచనాలున్నాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడం విఫలమయ్యింది `ఎనిమీ`. `నోటా` వంటి ఫెయిల్యూర్ అందుకున్న ఆనంద్ శంకర్ సైతం ఈ సినిమాతో మెప్పించడంతో సక్సెస్ కాలేదనే చెప్పాలి. తమిళంలో యాక్షన్ ఇమేజ్ ఉన్న విశాల్, ఆర్యల ఇమేజ్ ప్రధానంగా ఈ కథని రాసుకున్నట్టు తెలుస్తుంది. యాక్షన్‌కి, ఎమోషన్స్ ని జోడించి సక్సెస్ కొట్టాలనుకున్నాడు దర్శకుడు ఆనంద్.
అయితే అవసరం లేని యాక్షన్, కనెక్ట్ కాని ఎమోషన్స్ తో ఈ సినిమా నడిపించడంలో తడబడ్డాడు ఆనంద్ శంకర్. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్‌ని మొదటే చూపించడంతో సినిమాలో ఎలాంటి ట్విస్టులు లేకుండా సో సోగా సాగేలా కారణమైంది. విశాల్,ఆర్యలకు శత్రుత్వం ఏర్పడటానికి కారణాలు ఫర్వాలేదనిపిస్తాయి. అయితే ఆయ సన్నివేశాలను మరింత గ్రిప్పింగ్‌గా చూపించే అవకాశం ఉన్నా లైట్ తీసుకున్నాడు దర్శకుడు. ఎంత సేపు ప్రధాన పాత్రల బాండింగ్, శృత్రుత్వంపైనే ప్రధానంగా సాగుతుంది. దీంతో ఆయా సన్నివేశాలు బోరింగ్‌గా సాగుతాయి. ఫస్టాఫ్‌లో అవసరం లేని సన్నివేశాలు, ఇరికించిన పాటలు ఇబ్బంది పెడుతుంటాయి.
లవ్ స్టోరీకి స్కోప్ లేకపోవడంతో విశాల్ సరసన హీరోయిన్ మృణాలిని కేవలం గ్లామర్ కోసం పెట్టుకున్నట్టుగానే ఉంది. పైగా ఆమె ఎంట్రీ సినిమా ఫ్లోటింగ్‌కి బ్రేకుల్లా ఉంటుంది. విశాల్, ఆర్యల మధ్య ఎలుకా పిల్లిలాంటి గేమ్ విసుగు తెప్పిస్తుంది. ఇంటలిజెన్సీ నేపథ్యంలో సాగే చిత్రాలు ఇటీవల చాలా వస్తున్న నేపథ్యం, అందులోనూ విశాల్ అలాంటి సినిమాలు చేయడం వల్ల ఆయా సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తుంటాయి. కొత్తదనం ఏం లేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఉన్న కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను మాత్రం ఫర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్ లో ముగింపు అర్థంతరంగా ఉంటుంది. దీంతో సినిమా చూసిన ఆడియెన్స్ కి తెలియని అసంతృప్తి కలిగిస్తుంది.
నటీనటుల పర్‌ఫెర్మెన్స్ః
విశాల్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. పైగా ఇటీవల ఆయన వరుసగా ఇలాంటి సినిమాలే చేస్తున్నాడు. దీంతో ఇందులో సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడు. ఆర్య కూడా కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలో మెప్పించాడు. తనదైన యాక్షన్ స్టయిల్‌ని చూపించాడు. అటు విశాల్, ఇటు ఆర్య తమ పాత్రల్లో జీవించారు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రధానంగా ఆర్య నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్లలో మమతా మోహన్ దాస్ చాలా రోజుల తర్వాత స్క్రీన్‌పై కనిపించింది. అనీషా పాత్రలో మంచి నటనతో మెప్పించింది. స్టయిలీష్‌గా, గ్లామరస్‌గా కనువిందు చేసింది. ఇక మృణాలిని సేన్‌ది అంత ముఖ్యమైన పాత్ర కాదు. మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగాః
థమన్ అందించిన పాటల్లో ఒకటి కూడా వినదగ్గదిగా లేదు. అయితే శామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ఆర్‌డీ రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ప్రతి ఫ్రేమ్ బాగా రిచ్‌గా అనిపించింది. ఎడిటింగ్ మరింత ఫోకస్ చేయాల్సింది. దర్శకుడు ఆనంద్ శంకర్ ఫైనల్‌గా ఓ రొటీన్ యాక్షన్ సినిమాని తెరకెక్కించారని చెప్పొచ్చు. లాజిక్ లేని సన్నివేశాలు ఆడియెన్స్ ని తికమకపెడుతుంటాయి. కథ ఎమోషన్స్, కథని నడిపే విధానంపై దర్శకుడు మరికాస్త దృష్టి పెట్టాల్సింది.
ఫైనల్‌గాః ఇదొక రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగింది.ఇద్దరుస్టార్ హీరోలను వాడుకుని సరైన కథని చెప్పడంలో విఫలం అయ్యాడని చెప్పాలి.
రేటింగ్-2