Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు

Published : Sep 03, 2026, 01:02 PM IST

గుజరాతీ బ్లాక్‌బస్టర్ లాలో కృష్ణ సదా సహాయతే తెలుగు రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రకు విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం వరకు ఈ పాత్రలో రాంచరణ్ నటించబోతున్నట్లు ప్రచారం సాగింది.

PREV
15
గుజరాతీ సినిమా భారీ విజయం

గత ఏడాది గుజరాతీ చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని నమోదు చేసిన భక్తి ప్రధాన చిత్రం లాలో కృష్ణ సదా సహాయతే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్ద స్టార్ నటీనటులు లేకుండా, పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలుత బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా ప్రయాణం ప్రారంభించింది. అయితే ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా భారీ విజయంగా మారి, రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా గుజరాతీ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

25
రామ్ చరణ్ కాదు విజయ్ దేవరకొండ?

ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ తెలుగు వెర్షన్‌లో శ్రీకృష్ణుడి పాత్రను రామ్ చరణ్ పోషించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం, రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదని, ఆ పాత్ర కోసం విజయ్ దేవరకొండను ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో విజయ్ దేవరకొండ శ్రీకృష్ణుడి పాత్రలో ఎలా కనిపించబోతారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

35
రీమేక్ హక్కులు దిల్ రాజు చేతిలో..

లాలో కృష్ణ సదా సహాయతే తెలుగు రీమేక్ ఇప్పటికే ప్రణాళికలో ఉంది. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల సొంతం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఖరారులో ఆప్టిమిస్టిక్స్‌కు చెందిన విపుల్ డి షా సహకరించినట్లు కూడా సమాచారం. అయితే విజయ్ దేవరకొండ నటిస్తున్నారనే విషయంతో పాటు చిత్రానికి సంబంధించిన నటీనటులు, దర్శకుడు, చిత్రీకరణ ప్రారంభ తేదీ వంటి వివరాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

45
లాలో కథ ఇదే

లాలో కృష్ణ సదా సహాయతే కథ ఒక ఆటోరిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఒంటరిగా ఉన్న ఒక భవనంలో దొంగతనం చేయడానికి వెళ్లిన అతడి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. ఆ భవనంలో చిక్కుకుపోయిన అతడికి బయటకు వెళ్లేందుకు మార్గం కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో అతడికి ఒక రహస్యమైన వ్యక్తి సహాయం చేస్తాడు. కథ ముందుకు సాగేకొద్దీ ఆ వ్యక్తి ఎవరో బయటపడుతుంది. చివరకు అతడు శ్రీకృష్ణుడేనని తెలుస్తుంది.

55
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు

అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ గుజరాతీ చిత్రంలో కరణ్ జోషి ప్రధాన పాత్ర పోషించగా, శ్రీకృష్ణుడి పాత్రలో శ్రుహద్ గోస్వామి నటించారు. ఇప్పుడు ఇదే కథ తెలుగులోకి రాబోతుండటంతో భారీ ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తారనే తాజా ప్రచారం మరింత చర్చకు దారితీసింది. అయితే ఈ కాంబినేషన్‌పై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు విజయ్ దేవరకొండ పేరు ప్రస్తుతానికి ప్రచారం స్థాయిలోనే ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories