ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సినిమా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ జ్యోతిష్యం చెబుతూ వార్తల్లో నిలిచారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు. అంతేకాదు హీరోయిన్ల దోషాలు పోవడం కోసం పూజలు కూడా నిర్వహించారు.
ఈ క్రమంలో నాగచైతన్య,శోభితాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. వాళ్లు కూడా కలిసి ఉండరని కామెంట్ చేయడం సంచలనంగా మారింది. ఈక్రమంలో ఆయన కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. కోర్ట్ ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ ఎపిసోడ్ పూర్తయ్యింది. ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చాడు. మళ్లీ యాక్టివ్‌గా మారాడు వేణుస్వామి. నెమ్మదిగా సోషల్ మీడియా ద్వారా జాతకాల దందా మళ్లీ స్టార్ట్ చేశారు.
ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో, ముఖ్యంగా తెలంగాణలో అల్లు అర్జున్ వివాదం సంచలనంగా మారింది. బన్నీ నటించిన `పుష్ప 2` సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకి కూడా వెళ్లి వచ్చారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం శ్రీతేజని పరామర్శించిన వేణు స్వామి తనవంతుగా రెండు లక్షలు ఆర్థికసాయం అందించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీ జాతకం ప్రకారమే ఇలా జరుగుతుందన్నారు. అల్లు అర్జున్ జాతకం ఇప్పుడు బాగా లేదని తెలిపారు. ఆయన జాతకంలో దోషం ఉందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. అల్లు అర్జున్ జాతకరీత్యా ఇదంతా జరుగుతుంది, ఎవరికైనా జాతకం ప్రకారమే అన్నీ జరుగుతాయి. మార్చి 29 వరకు అల్లు అర్జున్ కి అంత బాగా లేదు, ఆ తర్వాత బాగుంటుందన్నారు.