మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఖైదీ, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, స్వయం కృషి ఇలా కొన్ని ప్రత్యేక చిత్రాల గురించి వింటుంటాం. చిరంజీవి స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతూనే అప్పుడప్పుడూ తన కెరీర్ లో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. స్వయం కృషి, రుద్రవీణ లాంటి చిత్రాలు ప్రశంసలు తీసుకువచ్చాయి. అయితే చిరంజీవి కెరీర్ ఒక మూవీ మంచి చిత్రంగా నిలవాల్సింది కాస్త కొన్ని తప్పిదాల వల్ల డిజాస్టర్ అనే ముద్ర వేయించుకుంది.
ఆ చిత్రం మరేదో కాదు అంజి. మల్లెమాల ప్రొడక్షన్ లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అంజి చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా నమ్రత నటించారు. ఈ చిత్రం విషయంలో కోడి రామ కృష్ణ టేకింగ్ బ్రిలియంట్ గా ఉంటుంది. శివలింగం చుట్టూ ఒక ఫిక్షనల్ కథని అల్లి విజువల్ ఎఫెక్ట్స్ తో మాయ చేయాలని కోడి రామ కృష్ణ ప్రయత్నించారు.
కానీ ఈ చిత్రానికి అసలు డ్యామేజ్ మొత్తం ప్రొడక్షన్ లోనే జరిగింది. బడ్జెట్ కారణాలతో ఆరేళ్ళు ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూనే వచ్చింది. చివరికి 2004లో సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఆరేళ్ళు వాయిదా పడ్డ చిత్రం అంటూ నెగిటివ్ ఒపీనియన్ తోనే థియేటర్స్ లోకి వచ్చింది. ఈ నెగిటివ్ ఒపీనియన్ కి తోడు.. రెగ్యులర్ గా చిరంజీవి సినిమాల్లో కనిపించే మాస్ లేదు. దీనితో ఆడియన్స్ డిజాస్టర్ అనే ముద్ర వేశారు.
థియేటర్స్ లో అంజి చిత్రానికి నష్టాలు వచ్చాయి. కానీ ఈ చిత్రం ఎంత అద్భుతమైనదో అని ఆ తర్వాత కానీ తెలియలేదు. టీవీలో ప్రదర్శించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ సినిమాని రిపీట్ గా చూడడం ప్రారంభించారు. విజువల్ ఎఫెక్ట్స్, ఈ చిత్రంలో ఉన్న కొత్తదనం అందరిని ఆశ్చర్యపరిచాయి. ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్ర నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోలేదని.. ఒక ప్రణాళికతో సినిమాని త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చాలా మంది అంటుంటారు.
పుండు మీద కారం అన్నట్లుగా అంజి చిత్రం రిలీజ్ అయినప్పుడే బాలయ్య లక్ష్మీ నరసింహా చిత్రం ప్రభాస్ వర్షం మూవీ రిలీజ్ అయ్యాయి. లక్ష్మి నరసింహ హిట్ అయింది. ప్రభాస్ వర్షం అయితే అటు లక్ష్మి నరసింహ, ఇటు అంజి చిత్రాలని డామినేట్ చేసే విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే అంజి చిత్రానికి తర్వాతి కాలంలో మంచి గుర్తింపు దక్కింది. టాలీవుడ్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డు సాధించిన తొలి చిత్రం అంజి. అదే విధంగా సినిమాటోగ్రఫీ, బెస్ట్ మేకప్ విభాగాల్లో రెండు నంది అవార్డుని సొంతం చేసుకుంది. అంజి చిత్రానికి మరో ఘనత కూడా ఉంది. ఈ చిత్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. త్రీడి డిజిటల్ గ్రాఫిక్స్ విధానాన్ని అనుసరించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా అంజి చిత్రానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. సిజి వర్క్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్న ఈ టైంలో అంజి చిత్రం విడుదలై ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో.