విశ్లేషణః
సూసైడ్స్ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రిన్స్.. తన ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడని, అలాగే హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని, వీరి మరణానికి ఫ్యామిలీ సమస్యలే కారణమని చెప్పాడు. వారి మరణాలు తనని ఎంతగానో కలిసివేసినట్టు చెప్పాడు. ఆ పెయిన్ తెలియజేయాలని, ఆడియెన్స్ కి చెప్పాలని, జనాల్లో ఓ అవగాహన కల్పించాలని, ఆత్మహత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలియాలనే ఉద్దేశ్యంతో `కలి` సినిమాని చేసినట్టు ప్రిన్స్ తెలిపారు.
ఆయన చెప్పినట్టుగానే సమస్యలకు సూసైడ్ పరిష్కార కాదని, నిజానికి సూసైడే అసలు సమస్య అని, అసలు ప్రాబ్లమ్స్ అప్పుడే ప్రారంభమవుతాయని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా సూసైడ్ పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మంచి సందేశాన్ని ఆడియెన్స్ కి అందించాలనే ఉద్దేశ్యంతో చేసిన తొలి సినిమా ఇదే అయి ఉంటుంది. మన తెలుగులో మాత్రం ఇలాంటివి రావడం చాలా అరుదు. రాలేదనే చెప్పాలి. ఈ మూవీ ద్వారా ఆ సందేశం ఇవ్వాలనుకునే ప్రిన్స్, దర్శకుడు శివ శేషు ప్రయత్నాన్ని, సినిమా కోసం వాళ్లు పడ్డ కష్టాన్ని అభినందించాల్సిందే.
సినిమా కథ పరంగా మంచి సందేశం అందించే చిత్రమే అయినా, సందేశాన్ని ఇవ్వడం కోసం ఏడో డాక్యుమెంటరీలాగానో, లేక ఆర్ట్ ఫిల్మ్ లాగానో తెరకెక్కించలేదు. కమర్షియల్ అంశాలకు ప్రయారిటీ ఇస్తూనే ఎంగేజింగ్‌గా, సస్పెన్స్, థ్రిల్లర అంశాలను కనెక్ట్ చేస్తూ తెరకెక్కించడం విశేషం. ప్రారంభం నుంచి సస్పెన్స్ ని క్రియేట్ చేశారు దర్శకుడు. శివరామ్ పాత్ర తనని తాను పాతిపెట్టేందుకు గొయ్యి తీయడం, తనే తనని తీసుకొచ్చి గొయ్యిలో పూడ్చడం వంటి సన్నివేశాలతోనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచాడు. దీనికి తగ్గట్టుగానే ప్రారంభం నుంచే బీజీఎం ఆద్యంతం ఎంగేజ్ చేసేలా సాగింది. సస్పెన్స్ సీన్లకి ఈ బీజీఎం తోడు కావడంతో అది రెట్టింపు అయ్యింది. శివరామ్ తాను ఫేస్ చేసిన సమస్యలను ఊహించుకుంటూ అనేక కొత్త పాత్రలను ఎంట్రీ ఇస్తూ, కథని సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. శివ రామ్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఫ్యామిలీ ఏంటి? భార్య ఎందుకు వెళ్లిపోయింది? ఫ్యామిలీ తనని ఎలా మోసం చేయాలనుకుంటున్నారనేది లైటర్ వేలో టచ్ చేస్తూ సాగించిన తీరు బాగుంది.
ఇక నరేష్ అగస్త్యా పాత్ర ఎంట్రీతో సినిమా వేగం పుంజుకుంటుంది. ఆయన క్రియేట్ చేసే సస్పెన్స్, రేకెత్తించే ప్రశ్నలు, అనేక కొత్త అంశాలను బయటకు తీయడం, శివరామ్ ని ఆయన ప్రశ్నించిన తీరు, యుగాలకు సంబంధించి ఆయన వివరించే తీరు, శివరామ్ చేస్తున్న తప్పేంటో చెప్పేందుకు ప్రయత్నించడం,ఈక్రమంలో కాసేపు జరిగే మజిలీ ఆకట్టుకుంది.
నరేష్ పాత్ర ఎలివేషన్లు, స్టయిలీష్ యాక్టింగ్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి. ఆయన పాత్ర ద్వారా అనేక ప్రశ్నలను లేవనెత్తాడు దర్శకుడు. ప్రిన్స్ వాటిని వెతికే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆయనకు లైఫ్‌పై తీపి ఏర్పడటం, ఫ్యామిలీ, పిల్లలు గుర్తుకు రావడం వంటి సీన్లు ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంటాయి. సినిమా ప్రారంభం నుంచే సీరియస్‌గా సాగుతుంది.
కామెడీకి స్కోప్ లేదు. కానీ నరేష్ అగస్త్యా పాత్ర ఎంటర్‌టైన్ చేస్తుంది. ఎంగేజ్ చేస్తుంది. ఆలోచింప చేస్తుంది. చివరగా సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారో బయటకు తీస్తూ, దాని పరిణామాలను చూపిస్తూ భయానికి గురి చేశాడు. ఆందోళనకి గురి చేశాడు. బతకాలనే ఆశని, కోరికలను పుట్టించే సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రిన్స్, నరేష్ అగస్త్యా మధ్య సీన్లు రక్తి కట్టించేలా ఉన్నాయి. అయితే కథ పరంగా చాలా చిన్న పాయింట్, దాన్ని కొంత లాగినట్టు అనిపిస్తుంది.
అదే సమయంలో శివరామ్ పాత్రను చూపించిన తీరు కొంత కన్‌ఫ్యూజ్ చేస్తుంది. సూసైడ్ చేసుకుంటే అనంతరం జరిగే పరిణామాలు, ఫ్యామిలీ పెయిన్‌ని బలంగా చూపించాల్సింది. సూసైడ్ పరిష్కారం కాదని, అదే అసలు సమస్య అనే విషయాన్ని మరింత బలంగా చెబితే, దాన్ని అంతే పెయిన్‌తో, ఎమోషన్స్ తో చెబుతే అదిరిపోయేది. దీంతోపాటు కొంత లాజికల్‌గానూ వర్క్ చేయాల్సి ఉంది. కానీ సినిమాని ఆర్‌ఆర్ నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.