
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో నా కూతురి జోలికి వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా.. ఈ బిడ్డ జోలికి వచ్చినా అదే రిపీట్ అవుతుంది అంటుంది దీప. వణికిపోతారు పారు, జ్యోత్స్న. బిడ్డను నీ చేతిలో పెడతానని మా అత్తకు మాటిచ్చాను. ఈ బిడ్డ ప్రపంచాన్ని చూస్తుందని మా బావకు మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఎవ్వరైనా నా బిడ్డకు హాని చేయాలని ఆలోచించినా వారిపై పిడుగులా మీద పడతాను అంటుంది దీప.
పారు, జ్యోత్స్నలకు చెమటలు పడతాయి. ఈ కాఫీ తాగండి వణుకు కొంచెం తగ్గుతుంది అని పారు చేతిలో కాఫీ పెట్టి వెళ్లిపోతుంది దీప. దీని మాటలు పిడుగు మీద పడ్డట్లే ఉన్నాయే అని భయపడిపోతుంది పారు. ఇప్పుడు ప్రమాదం దీప కడుపులో బిడ్డకు రాలేదు. నాకు వచ్చింది. దీంట్లో నుంచి బయటపడాలంటే నువ్వు ఒక పని చేయాలి. వెళ్లి నీ మనుమడిని పిలువు అంటుంది జ్యోత్స్న. వాడు మన మాట వింటాడా? అంటుంది పారు. నేను సెట్ చేస్తాను కదా నువ్వు వెళ్లి పిలుచుకురా అని చెప్తుంది జ్యోత్స్న.
కాశీ దగ్గరికి వెళ్లి మీ అక్క పిలుస్తోంది లోపలికి రా అని చెప్తుంది పారు. దీప అక్క ఎందుకు పిలుస్తోంది నన్ను అంటాడు కాశీ. దీప కాదు. జ్యోత్స్న అక్క పిలుస్తోంది రా అని బలవంతంగా తీసుకెళ్తుంది పారు. రా తమ్ముడు కూర్చో.. ఎండలో ఎంతసేపని నిలబడతావు అంటుంది జ్యోత్స్న. సడెన్ గా మాట మారిందే. నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడినా నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను అంటాడు కాశీ.
నాకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. సీఈఓగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. అవి చూసే వాళ్లకు తప్పుగా కనిపించవచ్చు. కానీ వాటి గురించి సమాధానం చెప్పుకునే ధైర్యం నాకుంది అంటుంది జ్యోత్స్న. మరి నన్ను ఎందుకు పిలిచావు అంటాడు కాశీ. నీకోసమే అంటుంది జ్యోత్స్న. నీ రెజ్యుమ్ పంపించు. మంచి జాబ్ ఉంటే చూస్తాను. అంత చదువుకొని పీఏ జాబ్ చేయడమేంటి.. కొద్ది రోజులు పోతే నిన్ను డ్రైవర్ ని కూడా చేస్తారు అని కాశీ మనసులో విషం నాటుతుంది జ్యోత్స్న. చిన్నగా జ్యో ట్రాప్ లో పడతాడు కాశీ.
వీడు మనకు ఉపయోగపడుతాడు అంటావా అంటుంది పారు. వాడు నా తమ్ముడు. నేను వాడ్ని కలుపుకోవాలి అనుకుంటున్నాను. అందుకే హెల్ప్ చేస్తా అన్నాను అంటుంది జ్యోత్స్న. నేను కోరుకున్న మార్పు ఇదేనే. మీరిద్దరూ ఎప్పుడూ ఇలా కలిసే ఉండాలి అని సంతోషంగా చెప్తుంది పారు.
నా అవసరాల కోసం మనుషుల్ని వాడుకుంటాను తప్ప నాకు ఎవ్వరిపై ప్రేమ లేదు గ్రానీ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కాశీ.. జ్యోత్స్నతో మాట్లాడి వెళ్తుంటే దీప చూస్తుంది. కాశీ, జ్యోత్స్న దగ్గరకు వెళ్లడం ఏంటి? వెనకాల ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటుంది.
మరోవైపు జ్యూస్ తాగమని సుమిత్రను రిక్వెస్ట్ చేస్తుంటాడు దశరథ. చిన్నపిల్లల మారాం చేస్తుంటుంది సుమిత్ర. ఇంతలో దీప అక్కడకు వస్తుంది. సుమిత్రకు ఇవ్వాల్టి నుంచి కాఫీ, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ బంద్ అని చెప్తాడు దశరథ. నేనేమైనా పేషెంట్ నా? వాటిని నేను ఎందుకు తినకుండా ఉండాలి అంటుంది సుమిత్ర. జ్యూస్ తాగమంటే తాగవు. ఉదయం లేవలేకపోయావు అంటే ఎంత నీరసం వచ్చి ఉంటుంది అంటాడు దశరథ.
ఉదయం లేవలేదా.. అని కంగారు పడుతుంది దీప. నేను ఊరికే పడుకున్నాను దీప. నువ్వు టెన్షన్ పడకు అంటుంది సుమిత్ర. ఒకసారి హాస్పిటల్ కి వెళ్లొచ్చు కదా అమ్మ అంటుంది దీప. నాకు ఏ జబ్బు లేదు. నా కూతురిపై ప్రేమ ఉంది. దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే బెంగ ఉంది అంతే అంటుంది సుమిత్ర. మీ ప్రేమను పొందలేకపోయిన నేను ఎంత దురదృష్టవంతురాలినో అనుకుంటుంది దీప. నా బిడ్డకు అయినా మీ ప్రేమ దక్కేలా చేస్తాను అని మనసులో అనుకుంటుంది.
మరోవైపు కాశీని చూస్తూ పారు, జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. వీడు మన మాట వింటాడా? అని అంటుంది పారు . నేను కాశీ ఈగోను టచ్ చేశాను కాబట్టి వాడు కచ్చితంగా మన మాట వింటాడు. ఎంత మంచి మనిషికైనా ఈగో హర్ట్ అయితే వాడు ఏం చేస్తాడో ఎవ్వరికి తెలియదు. అని వాలి, సుగ్రీవుల కథ చెప్తుంది జ్యోత్స.
ఇంతలో శ్రీధర్, కార్తీక్ వస్తారు. శ్రీధర్.. జ్యోత్స్న, పారులకు హాయ్ చెప్తాడు. వాళ్లతో మాటలేంటి అంటాడు కార్తీక్. తప్పులు బయటపెట్టేదాకా నార్మల్ గా పలకరించాలి కదా అంటాడు శ్రీధర్. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారే అంటుంది పారు.
జ్యోత్స్న తప్పులు బయటపెట్టాలి అని అనుకుంటున్నారు. కానీ మనకు నిజం తెలుసనే విషయం వాళ్లకు తెలియదు కదా అంటుంది జ్యోత్స్న. మేము వెళ్తాం అని కార్తీక్ తో చెప్తాడు శ్రీధర్. నేను ఒక ఫోన్ మాట్లాడుకోవాలి కారు డ్రైవ్ చెయ్ కాశీ అంటాడు శ్రీధర్. జ్యోత్స్న చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటాడు కాశీ.
జ్యో వైపు ఓ లుక్ ఇస్తాడు కార్తీక్. దాని అర్థం ఏంటే అంటుంది పారు. త్వరలో నీ పని అయిపోతుందని అర్థం అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు ఏం చేస్తావే అంటుంది పారు. యుద్ధంలో శత్రువును ఓడించే శక్తి లేనప్పుడు.. యుద్ధం మనవరకు రాకుండా ముందే నాశనం చేయాలి అంటుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.