
ప్రేమను కుటుంబ సభ్యులు అందరూ క్షమించినా ధీరజ్ మాత్రం క్షమించడు. దీంతో చాలా సేపు బతిమిలాడుతుంది. కానీ, ధీరజ్ కరగకపోవడంతో అలిగి వచ్చి బయట చలిలో కూర్చొంటుంది. దీంతో.. ఆమె చలికి ఇబ్బంది పడకూడదని ధీరజ్ మంట ఏర్పాటు చేస్తాడు. శాలువా కప్పి.. ఆ చలిమంట ముందు ప్రేమను కూర్చో పెడతాడు. అతను కూడా అక్కడే కూర్చొంటాడు. ధీరజ్ చూపించిన ప్రేమకు ప్రేమ చాలా సంతోషిస్తుంది. బ్యాగ్రౌండ్ లో పాట కూడా ప్లే అవుతుంది. కానీ.. అదంతా ప్రేమ కల. చలిమంట మాత్రమే వేస్తాడు. ఆమెను పట్టుకోవడం అదంతా ప్రేమ ఊహించుకుంటుంది.
ఇక.. శ్రీవల్లి తన పుట్టింటికి వెళ్తుంది. తనకు అత్తారింట్లో వచ్చే సమస్యలు అన్నింటికీ వాళ్ల తల్లిదండ్రులే కారణం అని.. వాళ్లపై కోపం చూపించడానికి వెళ్తుంది.చల్లటి చలిలో తల్లిదండ్రులను ఒంటి మీద చల్లటి నీళ్లు పోసుకోమని చెబుతుంది. తప్పక వాళ్లు కూడా నీళ్లు పోసుకుంటారు. ‘ నేను చక్రం సరిగానే తిప్పాను అమ్మడు. కానీ ఎలా బెడిసి కొట్టిందో అర్థం కావడం లేదు’ అని భాగ్యం అంటే..‘ బండ సచ్చినోడు నన్ను భయంకరంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.అమూల్య పెళ్లి చూపులు చెడగొట్టేసి, వాడితో అమూల్య పెళ్లికి మనం పావులు కదపకపోతే నా కాపురానికి కొరివి పెడతానని భయపెట్టేస్తున్నాడు’ అని శ్రీవల్లి చెబుతుంది. ‘ ఇదంతా నీవల్లే’ అని భాగ్యం అంటే.. ‘ చేయాల్సిందంతా చేసి మధ్యలో నా మీదకు నెట్టేస్తారేంటి?’ అని శ్రీవల్లి అంటే..‘ నువ్వు ఆ నర్మదకు ఐడియా ఇవ్వడం వల్లే అమూల్య నిజం చెప్పింది.. అసలు విషయం బయటకు వచ్చింది’ అని భాగ్యం అంటుంది. ఇడ్లీ బాబాయ్ కూడా అదే చెబుతాడు. ‘ పురాణాల నుంచి సీరియల్స్ వరకు అప్పుడప్పుడు హీరోలు గెలవడం, అప్పుడప్పుడు ఇలా దెబ్బడిపోవడం సహజం. తిరిగి హీరోలను ఎలా దెబ్బకొట్టాలా అని ఆలోచించాలి కానీ.. ఇలా కన్నవాళ్లను టార్చర్ చేయకూడదు.. పాపం తగులుతుంది’ అని భాగ్యం సలహా ఇస్తుంది. అయినా.. శ్రీవల్లి కోపం చల్లారదు.. చల్లటి నీరు తన పేరెంట్స్ మీద కుమ్మరిస్తుంది.
అయితే.. ‘ ఈ గండం నుంచి బయటపడే ఉపాయం నేను చెబుతాను’ అని భాగ్యం అంటుంది. ‘ ఏం లేదు అమ్మడు.. ప్రస్తుతం మన తక్షణ కర్తవ్యం ఏంటంటే..ఆ బండోడికి అమూల్యకు పెళ్లి చేసేయడమే.. అవును అమ్మడు.. లేకపోతే ఆ బండోడు ఊరుకోడు కదా.. రేపు జరిగే పెళ్లి చూపులను ఏదో ఒకటి చేసి ఆపేద్దాం’ అని సలహా ఇస్తుంది. ఆ సలహా నచ్చక వల్లీ మళ్లీ వాళ్ల మీద నీళ్లు పోసేస్తుంది.‘ ఇప్పటికే ఆ ప్రేమ, నర్మద నా మీద కక్ష కట్టి యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఆ బండోడికీ అమూల్యకు మధ్య ప్రేమ రాయబారిని నేనే అని ప్రేమకు, నర్మదకు తెలిస్తే.. ఇంతక ముందు తప్పులకు క్షమించి వదిలేశారు.కానీ.. ఈ తప్పుకు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు.తేడా వస్తే అక్కడికక్కడే నన్ను నరికేస్తారు’ అని శ్రీవల్లి చెబుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఇడ్లీ అడిగితే.. ‘ అమూల్య పెళ్లి అయ్యేంత వరకు మీరు ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా వెళ్లండి’ అని వల్లి చెబుతుంది.ఎందుకు అని భాగ్యం అంటే...‘ అమూల్య, విశ్వకి పెళ్లి చేస్తే..నా కాపురం కూలిపోతుంది. అందుకని ప్రస్తుతం మనకు ఉన్న ఒక మార్గం బండోడు నుంచి తప్పించుకోవడం. మీరు పారిపోతే వాడు మిమ్మల్ని పట్టుకోలేడు’ అని చెబుతుంది. ‘ మేం అంటే పారిపోతాం.. కానీ నువ్వు ఎదురింట్లోనే ఉంటావ్ కదా ’ అని భాగ్యం అడిగితే... ‘ వాడికి మా ఇంట్లోకి అడుగుపెట్టే ధైర్యం లేదు. ఫోన్ చేసినా ఎత్తను’ అని చెబుతుంది. కూతురు ఇచ్చిన సలహాను భాగ్యం మెచ్చుకుంటుంది.తర్వాత ఇద్దరినీ పారిపోమని చెబుతుంది.వాళ్లు కూడా మూటామూల్లె సర్దుకుంటారు.
మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమ ఇంట్లో సాంబ్రానీ వేస్తూ ఉంటుంది. ధీరజ్ కోపం తగ్గించాలని ఇంట్లో కనిపించిన ప్రతి చోటా సారీ అని రాసి పెడుతుంది.ధీరజ్ వాటిని పడేస్తూ ఉంటాడు.ప్రేమ మాత్రం తన ప్రయత్నాలను ఆపదు.సారీ నోట్స్ పెడుతూనే ఉంటుంది. ధీరజ్ ఏదీ పట్టించుకోకపోవడంతో...వీడు ఎప్పటికి మారతాడో అని తలబాదుకుంటుంది.
ఇక నర్మద కూర్చొని టీ తాగుతుంటే ప్రేమ కూడా వచ్చి పక్కన కూర్చొంటుంది. ఏంటి? విషయం.. ఎందుకు డల్ గా ఉన్నావ్ అంటే..ధీరజ్ కోపం పోలేదని, మాట్లాడట్లేదు అని చెబుతుంది.‘ ఇంట్లో జరిగింది చాలా పెద్ద గొడవ కదా.. మళ్లీ ధీరజ్ నార్మల్ అవ్వడానికి టైమ్ పడుతుంది... నువ్వు బాధ పడకుండా ఓపికగా ఉండాలి’ అని నర్మద సలహా ఇస్తుంది. ‘ నేనే చాలా తప్పుగా ఆలోచించి, ఫూలిష్ గా ప్రవర్తించాను’ అని ప్రేమ బాధపడుతుంది. పెద్దగా పట్టించుకోకు అని నర్మద అంటే.. ‘ అమూల్య తనంతట తాను ప్రేమలో పడింది అంటే నాకు నమ్మాలనిపించడం లేదు. నాకు ఈ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి’ అని ప్రేమ.. నర్మదతో అంటే..ఆ మాటలను దూరం నుంచి వల్లి వినేస్తుంది.అనుమానం ఏంటి? అని నర్మద అడిగితే.. ‘ అమూల్యకు అంతక ముందు మా అన్న విశ్వ అంటే అస్సలు నచ్చేది కాదు..వాడితో కనీసం మాట్లాడేది కూడా కాదు..అలాంటి అమూల్య అంత ఈజీగా ప్రేమలో పడదు.కచ్చితంగా ఎవరో అమూల్య మనసు మార్చే ఉంటారు అక్క. ఎవరో ఒకరు అమూల్యను ఇన్ ఫ్లూయన్స్ చేసి ప్రేమలో పడేలా చేశారు’ అని ప్రేమ చెబుతుంది. ‘ వీళ్లు నన్ను బతకనిచ్చేలా లేరు.. ఈ చిన్న గుండెను ఆగిపోయేలా చేయడమే పనిగా పెట్టుకున్నారు’ అని వల్లి తనలో తానే అనుకుంటూ ఉంది. ‘ విశ్వక్ ని ప్రేమించమని.. అమూల్య మనసు ఎవరు మార్చి ఉంటారు? అసలు అంత అవసరం ఎవరికి ఉంది?’ అని నర్మద అంటే.. ‘ అటు తిరిగి ఇటు తిరిగి నా ప్రాణాల మీదకు వచ్చేస్తోంది. వీళ్లకు డౌట్ రాకుండా అసలు..ఈ విషయం ఆలోచించకుండ చేయాలి’ అని అనుకుంటుంది. వెంటనే వచ్చి వీళ్ల మధ్యలో దూరి.. వాళ్ల మైండ్ మార్చడానికి ప్రయత్నిస్తుంది. ‘ ప్రేమ ఎవరికీ చెప్పి పుట్టదు.. యూత్ అన్నాక ప్రేమలో పడటం ఈరోజుల్లో చాలా కామన్ వాళ్లిద్దరు కూడా అలానే ప్రేమించుకొని ఉంటారు’ అని వల్లి అంటుంది. ‘ అందరి విషయం వేరు.. అమూల్య వేరు.. తనని మనం రోజూ చూస్తున్నాం.. ఎవరో ఒకరు అమూల్య మనసు మార్చకపోతే.. ఆ ఇంట్లో గొడవలు ఉన్నాయి అని తెలిసి కూడా విశ్వక్ ని అమూల్య ప్రేమించదు’ అని నర్మద చాలా గట్టిగా చెబుతుంది.
‘ ఈ రెండు కుటుంబాల మధ్య పాతికేళ్ల గొడవలు ఉన్నాయి అని ప్రేమ, ధీరజ్ లకు తెలీదా.. అయినా వాళ్లిద్దరూ ప్రేమించుకోలేదా? పెళ్లి చేసుకోలేదా? పైగా.. ప్రేమ, ధీరజ్ లకు అస్సలు పడేది కాదు.. మరి వీళ్లే ప్రేమలో పడగా లేనిది.. వీళ్లు పడటంలో ఆశ్చర్యం ఏముంది? అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది.. అమూల్యను ప్రేమ ఊభిలో నుంచి బయటకు తీసుకువచ్చి.. ఆమె సంతోషంగా ఉండేలా చేయడం.. ఒకవైపు అమూల్యకు పెళ్లి చూపులు పెట్టుకొని ఇల్లంతా భోసి పోయింది.. పెళ్లి జరుగుతుందన్న సంతోషం ఒక్కరి ముఖం లో కూడా లేదు’ అని శ్రీవల్లి చెబుతుంది.
‘ బల్లి అక్కాయ్.. నువ్వు టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతుంటే ఎందుకో డౌట్ అనిపిస్తుంది’ అని ప్రేమ అంటే... అయితే.. తాను ఈ కుటుంబ సంతోషం కోసమే ఆలోచిస్తాను అని వల్లి చెబుతుంది. అయినా కూడా ప్రేమ, నర్మద నమ్మరు. అనుమానంగా వల్లినే చూస్తూ ఉంటారు. వాళ్లకు ఏదో ఒకటి చెప్పి.. ఇంట్లోకి లాక్కెళుతుంది.ప్రేమ, నర్మదలకు తన మీద అనుమానం రాకుండా చేశానని.. తర్వాత ఇంట్లో వాళ్లను కూడా సంతోషంగా చేస్తే.. అమూల్య ప్రేమను తానే రాయబారిని అనే విషయం ఎవరికీ తెలీదు అని అనుకుంటుంది. అంతే... ఇక ఇంట్లో హడావిడీ చేయడం మొదలుపెడుతుంది. ఇంట్లో అందరినీ పిలిచి హాల్ లో కూర్చోపెడుతుంది. పనిలో పనిగా ప్రేమ.. ధీరజ్ ని గిచ్చుతుంది. ఇంట్లో అందరూ ఆటపాటలు ఆడుకుందాం అని వల్లి చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది..