
మీనా పూల దుకాణం దగ్గర తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటుంది. బాలు అలా చేయడం కరెక్ట్ కాదని ఒకరు అంటే.. వెళ్లొద్దు అన్నా కూడా వెళితే ఎవరైనా ఇలానే చేస్తారని బాలుకి సపోర్ట్ గా మరొకరు మాట్లాడతారు. కేవలం తన తమ్ముడి కోసం ఆలోచించి వెళ్లాను అని మీనా చెబుతుంది. ఈ లోగా మీనాకి వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది. బాలుతో కలిసిపోయాను అని మీనా అబద్ధం చెబుతుంది. కానీ.. ఇప్పుడే అల్లుడిగారిని కలిసొస్తున్నాను అని ఆమె చెప్పడంతో మీనా షాక్ అవుతుంది. ‘ ఆయన్ని మీరు ఎందుకు కలిశారు?’ అని మీనా అడుగుతుంది. ‘ మా వాళ్లే కదా ఇలా జరిగింది.. అల్లుడి గారెకి క్షమాపణలు చెబుదామని వెళ్లాం’ అని ఆమె చెప్పగా.. ‘ తిట్టి పంపించేశారా?’ అని మీనా అడుగుతుంది. ‘ కాదని, శివ చేసే చెడు సావాసాల గురించి చెప్పి బాధపడ్డారని, అది మన శివగాడు అర్థం చేసుకోవడం లేదు’ అని మీనా తల్లి చెబుతుంది. ‘ మధ్యలో నేను నలిగిపోతున్నాను’ అని మీనా బాధపడుతుంది. ఇక. తన తల్లి.. బాలుతో మాట్లాడటానికి వెళ్లిందని.. అయినా ఎలాంటి లాభం లేదని..మీనా ఫీలౌతుంది. అయితే.. మీ భర్తకు ఇష్టమైన వంట చేసి పెట్టమని.. ఫ్రెండ్స్ సలహా ఇస్తారు. మీనా సరే అని అంటుంది.
ఇక.. బాలు పనిమీద బయటకు వెళతారు. ఎవరో క్యాబ్ బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్తాడు. ఆ కారు ఓ మహిళ ఎక్కుతుంది. ఆమె హాస్పిటల్ కి వెళ్లాలి అని చెబుతుంది. కానీ... కారు ఎక్కిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటుంది. ఆమె అలా ఏడుస్తుండటంతో.. చూస్తూ ఉండలేక బాలు ఏమైందని అడుగుతాడు. ‘ మా అన్నయ్య చావు బతుకుల్లో ఉన్నాడు. కానీ.. మా అన్నయ్యకీ మా ఆయనకు పడదు. ఇద్దరి మధ్యా మనస్పర్థలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడటానికి వెళ్లనివ్వడం లేదు’ అని ఆమె చెబుతుంది. ఆమె చెప్పిన మాటలకు బాలు బాగా కనెక్ట్ అవుతాడు. మీనా ది కూడా ఇదే పరిస్థితి కదా అని ఆలోచనలో పడతాడు.
ఇక రోహిణీ.. ఫర్నీచర్ షాప్ లో బిజీగా ఉంటుంది.అప్పుడే అక్కడికి ఇద్దరు టీచర్స్ వచ్చి.. తమ స్కూల్ గురించి చెబుతూ ఉంటారు. తన కొడుకు చింటూ కోసం వివరాలు అడుగుతూ ఉంటుంది. మధ్యలో వచ్చినా కూడా స్కూల్ లో జాయిన్ చేసుకుంటారా అని రోహిణీ అడుగుతుంది. ఇంతకీ ఎవరు జాయిన్ అవుతారు మేడమ్ అని ఆ స్కూల్ టీచర్ అడగగా.. మా అబ్బాయి కోసమే అని చెబుతుంది. ఆ మాట కాస్త మనోజ్ చెవిన పడుతుంది. వచ్చి.. ‘ మీ అబ్బాయి కోసమా? ఏం మాట్లాడుతున్నావ్ రోహిణీ? ఏ అబ్బాయి కోసం అడుగుతున్నావ్?’ అని అడుగుతాడు. ‘ అబ్బాయి అంటే.. మా పార్లర్ లో పనిచేసే ఆవిడ కొడుకు’ అని కవర్ చేస్తుంది. మనోజ్ వెంటనే నమ్మేస్తాడు. ఇక.. ఆ టీచర్స్ కి మనోజ్ ని పరిచయం చేస్తుంది. ఆ టీచర్స్ కాసేపు మాట్లాడి.. మనోజ్ ని పొగిడి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
‘ నీకు ఈ మధ్య పిల్లలు కలలోకి వస్తున్నారు అన్నావ్ కదా.. చుట్టూ పరిస్థితులు కూడా పిల్లల గురించే జరుగుతున్నాయి.. మా ఫ్రెండ్ ఒకరికి జోతిష్యం తెలిసిన స్వామిజీ తెలుసంట. ఒకసారి వెళ్లి కలుద్దామా?’ అని మనోజ్ అడుగుతాడు. ‘ఎందుకు?’ అని రోహిణీ అంటే.. ‘మనకు పిల్లలు ఎప్పుడు పుడతారో తెలుసుకుందాం అని’ మనోజ్ అంటాడు. ‘ పిల్లల కోసం కలవాల్సింది డాక్టర్ ని.. స్వామిజీలను కాదు’ అని రోహిణీ సీరియస్ అవుతుంది. మనోజ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. రోహిణీ వినిపించుకోదు. తర్వాత.. ఇద్దరూ కలిసి గోవా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు.
తర్వాత బాలు ఆలోచిస్తూ ఉంటే.. రాజేష్ వస్తాడు. ఏమైంది అని అడిగితే.. తన కారులో ఎక్కిన మహిళ గురించి.. ఆమె భర్తకు చెప్పకుండా హాస్పిటల్ కి వాళ్ల అన్నను చూడటానికి వెళ్లిన విషయం మొత్తం చెబుతాడు.ఆమె అన్న మాటలు తనకు గట్టిగా తగిలాయని.. తప్పు చేసినట్లు అనిపించిందని... బాలు చెబుతాడు. ఇక.. రాజేష్ కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. శివ కోసం.. మీనాని బాధ పెట్టడం కరెక్ట్ కాదని.. చెబుతాడు. ‘ నీకంటే ముందు.. మీనాకి కి మీ అన్నయ్య మనోజ్ తో పెళ్లి కుదిరింది. మీ అన్న పీటల మీదే వదిలేసి వెళ్లిపోయాడు.. తర్వాత నిన్ను చేసుకొని అదే ఇంటికి వచ్చింది. మనోజ్ మీద కోపంతో అతనితో మాట్లాడొద్దని నీకు ఎప్పుడైనా చెప్పిందా? మీనా బంగారం, డబ్బు తేలేదని మీ అమ్మ ఆడిపోసుకుంటూనే ఉంటుంది. మరి.. మీ అమ్మతో మాట్లాడొద్దని మీనా నీకు చెప్పిందా?’ అని రాజేష్ అడుగుతాడు. ‘ లేదు.. మీనా అలా చెప్పదు’ అని బాలు నమ్మకంగా చెబుతాడు. ‘ చెప్పదు.. ఎందుకంటే.. మీనాకి సహనం ఎక్కువ. చివరకు మీనా నగలు మనోజ్, మీ అమ్మ కాజేసినా కూడా ఏం మాట్లాడకుండా ఉంది అంటే.. అది తన మంచితనం. ఇవన్నీ మనసులో పెట్టుకొని వాళ్లకు దూరంగా ఉండాలని అస్సలు చెప్పలేదే. అంతెందుకురా.. మౌనిక, సంజూని నీతో మాట్లాడొద్దని ఆపేశాడు అనుకో... మౌనిక నీతో మాట్లాడకుండా ఉన్నా నీకు పర్వాలేదా.. అలా చెల్లికి దూరంగా నువ్వు సంతోషంగా ఉండగలవా?’ అని రాజేష్ అడుగుతాడు. ‘ నేను నా చెల్లితో మాట్లాడకుండా ఉండలేను’ అని బాలు చెబితే.. మీనా కూడా అంతేకదా.. అని అర్థమయ్యేలా చెబుతాడు. రాజేష్ మాటలకు బాలుకి కళ్లు తెరుచుకుంటాయి. మీనాని బాధపెట్టానని బాలు ఫీల్ అవుతాడు.
ఇక బాలు కోసం.. మీనా గుమగుమలాడేలా చికెన్ వండుతుంది. ఆ వాసనకు శ్రుతి, ప్రభావతి అక్కడికి వచ్చి.. దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వాసన అదిరిపోయిందని.. వెంటనే టేస్టు చూపించమని శ్రుతి వెళ్లి అడుగుతుంది. కాదు అనకుండా మీనా పెడుతుంది. వెనకే ప్రభావతి కూడా వెళ్తుంది. ప్రభావతి మాటలకు మీనా తిక్కతిక్కగా సమాధానాలు చెబుతుంది. నిజానికి కూర రుచి చూడటానికే వెళ్తుంది.. కానీ అడిగితే వద్దు అని అంటుంది. మీనాని ప్రభావతి ఏదో ఒకటి అనాలని చూస్తే.. శ్రుతి అడ్డుపుల్ల వేసి కౌంటర్లు వేస్తుంది. అదే సమయానికి మనోజ్ వచ్చి చికెన్ కూరా అని లొట్టలేస్తూ ఉంటాడు. ‘ సరిపోయింది.. నేను మా ఆయన కోసం వండితే.. ఈయన వచ్చి మింగేసేలా ఉన్నాడు’ అని మీనా లోలోపలే ఫీలౌతుంది. మనోజ్ వెంటనే ‘ అమ్మా.. నువ్వు చేశావా?’ అని అడుగుతాడు. ‘ ఆంటీ..వంట చేయడం ఎప్పుడైనా చూశావా? ఆంటీ తింటుంది.. వండదు’ అని శ్రుతి అంటుంది. ‘ వీళ్ల పెళ్లికి ముందు నేనే వండాను కదా’ అని ప్రభావతి అంటుంది. ఇక.. పనిలో పనిగా.. శ్రుతి.. మనోజ్, ప్రభావతి ల మీద సెటైర్లు వేస్తుంది. శ్రుతి పక్కకు వెళ్లిన తర్వాత...ఆమె మీద రోహిణీ సెటైర్లు వేస్తే.. మీనా ఊరుకోదు. శ్రుతి చిన్న పిల్ల అంటూ వెనకేసుకువస్తుంది. ఇక.. మనోజ్ వెంటనే తినేద్దాం అని అంటే.. రోహిణీ ఫ్రెష్ అయ్యి వద్దాం అని అంటుంది. కానీ మనోజ్ వినడు. ముందు తినేసి.. తర్వాత ఫ్రెష్ అవుదాం అని అంటాడు. రోహిణీ.. బలవంతంగా తీసుకువెళ్లిపోతుంది. ఇక.. అప్పుడే రవి వచ్చి.. ఆ కూర రుచి చూసి అద్భుతంగా ఉందని పొగుడుతాడు. అతని పొగడ్తలకు పక్కనుండి ప్రభావతి సెటైర్లు వేస్తుంది.
తర్వాత ఇంట్లో అందరూ.. చికెన్ తినాలని ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చొంటారు. ఆ చికెన్ లోకి దోశలు కూడా వేస్తుంది. అప్పుడే సత్యం వచ్చి మీనాని పొగుడుతాడు. రుచి బాగుందని.. ఇంట్లో అందరూ అంటే.. ప్రభావతి మాత్రం వంకలు పెడుతుంది. కమింగప్ లో.. రోహిణీ హాస్పిటల్ కి వెళ్తుంది. అది కాస్తా మీనా కంట పడుతుంది. సుమతి వెళ్లి ఆరా తీస్తే.. రెండోసారి బిడ్డ కోసం ప్లానింగ్ అనే విషయం తెలుస్తుంది. ఇదే విషయం మీనా వెళ్లి..బాలుకి చెబుతుంది.