
ఓర్మాక్స్ మీడియా తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించి ఇండియా టాప్ 10 హీరోల లిస్ట్ ని విడుదల చేసింది. ఇందులో నెంబర్ వన్ మారలేదు, కానీ మిగిలిన స్థానాల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. విజయ్ డౌన్ అయ్యారు. బన్నీ డౌన్ అయ్యాడు. తారక్ పడిపోయాడు. కానీ ధురంధర్ 2 హీరో రణ్‌వీర్ సింగ్‌దూసుకొచ్చారు. అజిత్ లిస్ట్ లోనే లేరు. చరణ్, మహేష్ బాబు సేఫ్‌గానే ఉన్నారని చెప్పొచ్చు. మరి ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియా టాప్ 10 హీరోల లిస్ట్ చూస్తే.
ఓర్మాక్స్ మీడియా ప్రకారం నెంబర్ వన్ స్థానంలో మార్పు లేదు. ఎప్పటిలాగానే ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. తిరుగులేని తన ఇమేజ్‌ని చాటి చెప్పారు. తన సినిమాలు, ఫాలోయింగ్, క్రేజ్, మార్కెట్ పరంగా నిత్యం ఏదో రూపంలో ప్రభాస్‌పై చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.
రెండో స్థానంలోకి షారూఖ్ ఖాన్ వచ్చారు. గతంలో ఆయన మూడు, నాల్గో స్థానాల్లో ఉండేవారు. కానీ ఈసారి సడెన్‌గా పుంజుకున్నారు. విజయ్‌కి, అల్లు అర్జున్‌కి షాకిస్తూ రెండో స్థానంలోకి వచ్చారు. షారూఖ్ ప్రస్తుతం `కింగ్` అనే చిత్రంలో నటిస్తున్నారు.
మూడో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. గత నెల(మార్చి)లో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. `రాకా` అప్‌డేట్ల కారణంగా టాప్ 2లోకి దూసుకొచ్చిన ఆయన ఇప్పుడు టాప్ 3కి పడిపోయారు.
నాల్గో స్థానంలో విజయ్ ఉన్నారు. తమిళనాడు ఎన్నికలు జరిగాయి. విజయ్‌కి సంబంధించిన చర్చ నడుస్తూనే ఉంది. అయినా ఆయన స్థానం పడిపోవడం గమనార్హం. అయితే హీరోగా ఆయన క్రేజ్ తగ్గిపోయిందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని చెప్పొచ్చు. కాకపోతే మే నెలలో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
ఐదో స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. మహేష్ తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఆయన స్థానంలో పెద్దగా మార్పు లేదు. మార్చిలోనూ ఆయన ఇదే స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం మహేష్ `వారణాసి` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆరో స్థానంలోకి `ధురంధర్ 2` హీరో దూసుకొచ్చారు. రణ్‌వీర్ సింగ్ 6వ స్థానాన్ని దక్కించుకున్నారు. చాలా వరకు ఈ టాప్ 10 లిస్ట్ లోనే ఆయన ఉండేవారు కాదు. కానీ `ధురంధర్` ఎఫెక్ట్ తో ఆయన టాప్ 10లోకి వచ్చారు. మార్చిలో 8వ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఆరో స్థానానికి ఎగబాకడం విశేషం. పెరిగిన ఆయన ఇమేజ్, క్రేజ్‌కిది నిదర్శనం.
ఏడో స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. గత నెలతో పోల్చితే ఓ స్థానం పడిపోయారు. మార్చిలో 6వ స్థానంలో ఉండగా, ఏప్రిల్‌లో ఏడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ఆయన హీరోగా నటించిన పెద్ది సినిమాకి సంబంధించిన చర్చ నడుస్తున్నా కూడా చరణ్ ఒక స్థానాన్ని పడిపోవడం గమనార్హం.
ఎనిమిదో స్థానంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో మూవీ చేస్తున్నారు. దీనితో ఎక్కువగా చర్చల్లోకి వచ్చారు. ఆయన డ్రెస్‌స్టయిల్ కూడా వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో సల్మాన్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. అయితే మార్చితో పోల్చితే సల్మాన్ కూడా ఒక స్థానం పడిపోయారు.
తొమ్మిదో స్థానంలో మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిలిచారు. పదో స్థానంలోకి ఎన్టీఆర్ పడిపోయారు. మార్చిలో 9వ స్థానంలో ఉండగా, ఇప్పుడు మరో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇదే అందరికి ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఆయన `డ్రాగన్` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, అది ఆద్యంతం కట్టిపడేస్తోంది.