74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. చిరంజీవితో పాటు అందరూ త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు. బ్లడ్ బ్యాంక్ లో ఈరోజు ‘మెగా బ్లడ్ డోనేషన్ డ్రైవ్’ను కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నిన్నటితో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 ఏండ్లు గడిచి, 74వ యేటా అడుగుపెట్టింది. ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాలలో ఒకటిగా మన రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యవస్థాపక తండ్రులను స్మరించుకుంటూ.. సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. మన మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పవర్ స్టార్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలు, జన సైనికుల మధ్య పవన్ కళ్యాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గౌరవ వందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు.
జెండా వందనం సమర్పించిన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడే పార్టీ నేతలు, శ్రేణులను ఉద్దేశించి ప్రసంగం ఇచ్చారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ‘వారాహి’పూజా కార్యక్రమంలో భాగంగా రెండ్రోజుల కింద పవన్ కళ్యాణ్ జగిత్యాలలోని కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చిన విషయం తెలిసిందే.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంది. తన తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో పరేడ్ ను టీవీలో ఫ్యామిలీతో కలిసి చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ టీ సిటీ ఛానెల్ కోసం రకుల్ ఇండియా గేట్ వద్ద పోజులిచ్చింది.
అదేవిధంగా జాతీయ జెండాను గాల్లోకి ఎగరవేస్తూ దేశ భక్తిని చాటుకున్నారు రకుల్. ఈ సందర్భంగా స్టార్ బ్యూటీ మాట్లాడుతూ.. ఏదైనా దేశభక్తి కార్యక్రమం ఉన్నప్పుడు, నేను చాలా గర్వంగా భావిస్తాను. నేను నిజానికి ఆర్మీ నేపథ్యం నుండి వచ్చిన హార్డ్‌కోర్ పేట్రియాటిక్ వ్యక్తిని అంటూ చెప్పుకొచ్చింది.