1988లో విడుదలైన బీవీ హో తో యైసి.. చిత్రంతో వెండితెరకు పరిచయమైన సల్మాన్ ఖాన్, 1989లో విడుదలైన మైనే ప్యార్ కియాతో మూవీతో హీరోగా మారారు. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మైనే ప్యార్ కియా చిత్రం అప్పట్లో ఓ సంచలనం. డెబ్యూ మూవీతోనే సల్మాన్ రికార్డ్స్ తిరగరాశారు. భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించగా సూరజ్ బర్తాజ్యా దర్శకత్వం వహించారు. సల్మాన్, భాగ్యశ్రీలతో పాటు దర్శకుడు సూరజ్ కి కూడా మొదటి చిత్రం. ముగ్గురు కొత్తవారి కాంబినేషన్ వచ్చిన చిత్రం మైనే ప్యార్ కియా.
29 డిసెంబర్ 1989లో విడుదలైన మైనే ప్యార్ కియా అఖండ విజయం అందుకుంది. ఇక తెలుగులో ఈ మూవీ ప్రేమ పావురాలు టైటిల్ తో డబ్ చేశారు. తెలుగులో కూడా అదే స్థాయి విజయాన్ని నమోదు చేసింది. తెలిసిన ముఖం ఒక్కటి లేకపోయినా టాలీవుడ్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.