
ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి అన్నీ చిన్న సినిమాలే వస్తున్నాయి. ఓ మోస్తారు నుంచి, తక్కువ బడ్జెట్ మూవీస్ విడుదలవుతున్నాయి. ఇప్పుడు మార్చి మొదటి(మార్చి 6) వారంలో కూడా అలాంటి చిత్రాలే వస్తున్నాయి. అయితే ఇందులో విశేషమేంటంటే గత వారం శ్రీవిష్ణు సందడి చేశాడు. ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఆయన నటించిన మరో సినిమా విడుదల కానుంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన మూవీ, శివాజీ హీరోగా చేసిన చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఆ సినిమాలేంటో చూద్దాం.
శ్రీవిష్ణు కామెడీ సినిమాలకు కేరాఫ్. ఆయన గత వారం `విష్ణు విన్యాసం` అనే సినిమాలో నటించాడు. దీనికి మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. ఆయన `మృత్యుంజయ్` అనే చిత్రంలో నటించాడు. శ్రీవిష్ణుకి జోడీగా రెబా జాన్ హీరోయిన్‌గా నటించింది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి శ్రీ హుస్సేన్ కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్స్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. కాలభైరవ సంగీతం అందించారు. ఇది మార్చి 6న విడుదల కానుంది.
మార్చి 6న రాబోతున్న మరో మూవీ `సరస్వతి`. వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా మారి రూపొందించిన చిత్రమిది. తనే నిర్మిస్తూ మెయిన్ లీడ్‌గానూ నటించింది. ఇందులో ప్రకాష్ రాజ్, ప్రియమణి, గెటప్ శ్రీను వంటి వారు నటించారు. చిన్నారి మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే కోర్ట్ రూమ్ డ్రామా ఇది. విడుదలైన టీజర్, ట్రైలర్ ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ఇటీవల బాలయ్య కూడా ట్రైలర్ విడుదల చేసి అభినందించారు. దీంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.
ఈ శుక్రవారం(మార్చి 6)న రాబోతున్న మరో సినిమా `సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని`. `టాటా బిర్లా మధ్యలో లైలా` తర్వాత శివాజీ, లయ కలిసి నటించిన చిత్రమిది. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు.
పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో రూపొందిన లేటెస్ట్ మూవీ `మెన్షన్ హౌజ్ మల్లేష్`. శ్రీనాథ్ మాగంటి హీరోగా, గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల హీరోయిన్లుగా రూపొందింది. బాల సతీష్ దర్శకత్వం వహించారు. అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్న హీరో పెళ్లి చేసుకుని సంసార జీవితానికి సిద్ధమవడం, ఈ క్రమంలో చోటు చేసుకున్న ఫన్నీ సంఘటనల సమాహారమే ఈ మూవీ. ఇది మార్చి 6న విడుదల కాబోతుంది.
`సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం `కాక్రోచ్`. ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. కొందరు క్రిమినల్స్, ప్రాస్టిట్యూటర్ మధ్య సాగిన ప్రేమ కథ నేపథ్యంలో సాగే చిత్రమిది.