ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ ని ఏలుతున్న సమయంలో చాలా మంది గొప్ప నటులు ఉండేవారు. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్ ప్రభంజనంలో వాళ్ళకి అంతగా గుర్తింపు ఉండేది కాదు. సావిత్రి, ఎస్వీ రంగారావు లాంటి వాళ్ళు మాత్రం వీళ్ళకి తమ ఉనికి చాటుకున్నారు. మిగిన వాళ్ళు ఎన్టీఆర్, ఏఎన్నార్ క్రేజ్ ముందు నిలబడలేదు.
అప్పట్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆరే. పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ కి తిరుగులేదు. ఇంకెవరైనా అలాంటి పాత్రలు చేస్తే వెంటనే ఎన్టీఆర్ తో పోలిక పెట్టేవారు. ఎన్టీఆర్ లా మెప్పించడం కష్టం అనేవారు. ఇక కుటుంబ కథా చిత్రాలు, కాస్త చిలిపితనం ఉన్న పాత్రలు, ట్రాజిడీ అంటే గుర్తుకు వచ్చేది ఏఎన్నార్. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా అటు పౌరాణిక చిత్రాలతో, ఇటు కుటుంబ కథా చిత్రాలకు తన ప్రతిభ చాటుకున్న హీరో ఒకరు ఉన్నారు. ఆయనే హరనాథ్.
ఎన్టీఆర్ దర్శకత్వంలో 1961లో తెరకెక్కిన శ్రీ సీతారామ కళ్యాణం చిత్రంలో హరనాథ్ శ్రీరాముడిగా నటించారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో నటించారు. అంత గొప్ప అవకాశాలు అందుకుంటున్న హరనాథ్ కెరీర్ అర్థాంతరంగా ముగిసింది. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలకు హరనాథ్ మంచి ఛాయిస్ అంటూ అప్పట్లో దర్శకులు, నిర్మాతలు ప్రశంసించారు. కానీ ఆయన కెరీర్ అనూహ్యంగా ముగిసిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కి పోటీ గా వస్తున్నారని హరనాథ్ ని కావాలనే తొక్కేసినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి.
కానీ అది వాస్తవం కాదు. హరనాథ్ కెరీర్ ముగియడానికి ఆయన స్వయంకృతాపరాధమే. హరనాథ్ కాస్త ఫేమస్ కాగానే విలాసాలకు, వ్యసనాలకు బానిస అయ్యారు. వ్యసనాలకు అధికంగా బానిస కావడం వల్ల కెరీర్ ని నిర్లక్ష్యం చేశారు. దీనితో ఆయనకి ప్రధాన పాత్రలు దూరం అవుతూ వచ్చాయి. దీనితో చిన్న చిన్న పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది. హరనాథ్ 1936లో పిఠాపురం సమీపంలోని రాపర్తి అనే గ్రామంలో జన్మించారు. నటనపై ఆసక్తితో చెన్నై వెళ్లి అవకాశాలు అందుకున్నారు. 1989లో 53 ఏళ్ళ చిన్న వయసులోనే హరనాథ్ మరణించారు.