`ది ట్రయల్‌` మూవీ రివ్యూః ఫస్ట్ ఇంటరాగేషన్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?

First Published Nov 23, 2023, 9:30 PM IST

ఫస్ట్ టైమ్‌ పూర్తి ఇంటరాగేషన్‌తో `ది ట్రయల్‌` అనే సినిమా రూపొందింది. అంతా అప్‌ కమింగ్‌ టీమ్‌ చేసిన ఈ మూవీ శుక్రవారం విడుదలవుతుంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

మర్డర్‌ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ కామన్‌గా ఉంటుంది. అయితే అది కథలో భాగంగా కొంత వరకే కనిపిస్తుంది. ఎక్కువగా ట్విస్ట్ లతో, నేరస్థుడిని పట్టుకోవడంపైనే సాగుతుంటాయి. కానీ ఓ నేరానికి సంబంధించిన పోలీస్‌ ఇంటరాగేషన్‌ ప్రధానంగా సినిమాలు వచ్చింది చాలా అరుదు. అలాంటి కథాంశంతో తెరకెక్కిన మూవీ `ది ట్రయల్‌`. స్పందన పల్లి, యుగ్ రామ్‌, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్‌ గన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది(నవంబర్‌ 24న). మరి ఈ సరికొత్త కాన్సెప్ట్ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? అనేది రివ్యూలో(The Trail Review) తెలుసుకుందాం. 
 

కథః 
రూప(స్పందన పల్లి) సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ), అజయ్‌(యుగ్‌ రామ్‌) సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌. వీరిద్దరికి పెళ్లంటే పెద్దగా ఇష్టం లేదు. అయినా పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకుంటారు. అంతంత మాత్రంగానే ఈ ఇద్దరి వైవాహిక జీవితం సాగుతుంటుంది. తమ మ్యారేజ్‌ డే రోజుని చాలా స్పెషల్‌గా గడపాలనుకుంటారు. అందుకు సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసుకుంటారు, అందుకు ఇద్దరే ఓ అపార్ట్ మెంట్‌పై పార్టీ ప్లాన్ చేసుకుంటారు. ఇంతలోనే పెద్ద షాక్‌. ఆ పార్టీలో అజయ్‌ బిల్డింగ్‌ మీద నుంచి కింద పడి చనిపోతాడు. దీంతో అతన్ని రూపనే చంపిందని అజయ్‌ ఫ్యామిలీ మెంబర్స్ అంతా నమ్ముతారు. ఆమెపై కేసు పెడతారు. అందుకు అజయ్‌ రాసుకున్న డైరీ ఆధారంగా చూపిస్తారు. మరి అజయ్‌ ఆ డైరీలో ఏం రాశాడు? నిజంగానే రూప అతన్ని చంపిందా? లేక అజయ్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? అజయ్‌ని రూప టార్చర్‌ చేసిందా? రూపని అజయ్‌ టార్చర్‌ చేశాడా? పోలీస్‌ ఇంటరాగేషన్‌లో ఏం తేలింది? ఈ క్రమంలో సినిమా ఎన్ని మలుపులు తిరిగిందనేది (The Trail Review) మిగిలిన సినిమా.

Latest Videos


విశ్లేషణః
కేసుకి సంబంధించి పూర్తి ఇంటరాగేషన్‌ నేపథ్యంలో సినిమాలు చాలా అరుదు. అడవి శేష్‌ `ఎవరు` కొంత వరకు ఆ స్టయిల్‌లో సాగుతుంది. కానీ పూర్తి స్థాయిలో తెలుగులో రాలేదు. ఆ విషయంలో `ది ట్రయల్‌` ఓ ప్రయోగాత్మక మూవీ అని చెప్పాలి. భర్త మరణానికి సంబంధించి భార్యని అనుమానిస్తూ ఈ పోలీస్‌ ఇంటరాగేషన్‌ సాగుతుంది. సినిమా మొత్తం ఆ ఇంటరాగేషన్‌ రూమ్‌లోనే సాగుతుంది. సినిమా మొత్తాన్ని ఆ ఇంటరాగేషన్‌ చుట్టూనే చెప్పమనేది పెద్ద సాహసమనే చెప్పాలి. కేవలం ప్రశ్నలు, ఆన్సర్లతో కథని చెప్పడం, సంఘటన కోణాలను ఆవిష్కరించడమనేది క్లిష్టమైన స్క్రీన్‌ ప్లేకి నిదర్శనం. `ది ట్రయల్‌` మూవీ కూడా అలాంటి క్లిష్టమైన స్క్రీన్‌ ప్లేతోనే సాగుతుంది. జనరల్‌గా ఇలాంటి ఇన్వెస్టిగేషన్‌లో.. మరణించిన వ్యక్తి కోణంలో ఒకటి, హత్య చేసిన వ్యక్తి కోణంలో మరోటి చూడొచ్చు. కానీ ఇందులో అనేక (The Trail Review) మలుపులుంటాయి. ఒకే సంఘటన ఎన్ని రకాలుగా జరగొచ్చో, అందులో ఎన్ని మైన్యూర్‌ థింగ్స్ ఉంటాయో ఈ చిత్రంలో ఆవిష్కరించాడు దర్శకుడు రామ్‌ గన్ని. ఇంటరాగేషన్‌ని చాలా ఉత్కంఠ భరితంగా, అనేక ట్విస్ట్ లతో తీసుకెళ్లారు. ఒక్కో ప్రశ్నతో ఒక్కో యాంగిల్‌ని ఆవిష్కరిస్తూ మైండ్‌ గేమ్‌ ఆడుకున్నాడని చెప్పొచ్చు. ఒకదాని తర్వాత మరో ట్విస్ట్ ని రివీల్‌ చేస్తూ ఆడియెన్స్ కి థ్రిల్ మీద థ్రిల్‌ ఇచ్చాడు. వరుస సర్‌ ప్రైజ్‌లు ఇచ్చారు. ఒక క్రైమ్‌ని ఎన్ని యాంగిల్స్ లో చూడొచ్చనేది ఇందులో చూపించాడు. 

ఇదొక మంచి సమాచారం అందించే సినిమాగా నిలుస్తుంది. ఇంటరాగేషన్‌ ఎలా సాగుతుందని, ఆధారాలు ఎంతటి ప్రభావాన్ని చూపుతాయి, ఆధారాలు ఎలా తారు మారు చేయోచ్చు, ఎలా సృష్టించవచ్చు అనేదానికి ఈ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్‌ అవుతుంది. క్రైమ్‌ వంటి వాటికి ఆడియెన్స్ కి నాలెడ్జ్ ఇచ్చే చిత్రమవుతుంది. అదే సమయంలో దీన్ని రాంగ్‌ వేలో వాడుకునే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఇదొక డేరింగ్‌ మూవీ అనే చెప్పాలి. అయితే సినిమా స్లో నెరేషన్‌ అనేది కాస్త ఇబ్బంది పెట్టే అంశం. ఇంటరాగేషన్‌ స్లోగా సాగడం, గ్యాప్‌లు ఇవ్వడం, సినిమాలో సీన్లు చూపించినవే పదే పదే చూపించడం కొంత ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి. కానీ ప్రతి సారి ఓ కొత్త యాంగిల్‌ని ఆవిష్కరించడం ఇందులో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. అజయ్‌ మరణానికి కారణం ఇదే అని ఆడియెన్స్ (The Trail Review) భావించగా, మరో యాంగిల్‌ లో చూపిస్తూ షాక్‌ ఇస్తుంటుంది. ఇది కొంత వరకు ఓకే, కానీ శృతి మించినట్టుగా, ఓవర్‌ డోస్‌ అనిపిస్తుంది. ఆడియెన్స్ కన్‌ఫ్యూజ్‌ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అదే సమయంలో చాలా ఫోకస్‌ గా చూస్తే తప్ప ఈ సినిమా అర్థం కాదు. సాధారణ ఆడియెన్స్ ని తికమక పెట్టేలా ఉంటుంది. ఆ విషయంలో మరింత కేర్‌ తీసుకుంటే బాగుండేది. కానీ ఓవరాల్‌గా ఓ కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చే మూవీ అవుతుంది. నిడివి పెద్ద ప్లస్‌. 

నటీనటులుః
సినిమాలో రూపగా స్పందన పల్లి చాలా బాగా చేసింది. మైన్యూర్‌ ఎక్స్ ప్రెషన్స్ కూడా బాగా పలికించింది. అదే సమయంలో చాలా సెటిల్డ్ గా కనిపించింది. ఆమె పాత్ర చుట్టూతే సినిమా సాగడం విశేషం. అదే సమయంలో నటిగా ఆమె ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది. అజయ్‌ పాత్రలో యుగ్‌ రామ్‌ చాలా ఇన్నోసెంట్‌గా, కన్నింగ్‌గా  మెప్పించాడు. పోలీస్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ పాత్రలో వంశీ కోటు సైతం బాగా చేశాడు. ఇంటరాగేషన్‌ని రక్తికట్టించడంలో ఆయన నటన బాగుంది. మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రయారిటీ లేదు. జస్ట్ అలా కనిపిస్తారంతే.

టెక్నీకల్‌గాః
టెక్నికల్‌గా సినిమా బాగుంది. సినిమాకి బీజీఎం పెద్ద ప్లస్‌. చాలా చోట్ల సైలెన్స్ మాట్లాడుతుంది. డీసెంట్‌ ఆర్ఆర్‌ సైతం ఉత్కంఠకి గురి చేస్తుంది. శరవణ వాసుదేవన్‌ తన ఆర్‌ఆర్‌తో అదరగొట్టాడని చెప్పొచ్చు. ఇంకాస్త డెప్త్ గా బీజీఎం ఇస్తే బాగుండేది. శ్రీ సాయి కుమార్ దారా కెమెరా వర్క్ బాగుంది. డీసెంట్‌గా ఉంది. లుక్‌ రిచ్‌గా అనిపిస్తుంది. దర్శకుడు రామ్‌ (The Trail Review) గన్ని ప్రయోగాత్మకంగా ఈ మూవీని చేశాడు. ముందు ఆయన సాహసానికి మెచ్చుకోవాల్సిందే. అయితే దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో కొంత వరకు సక్సెస్‌ అయ్యాడు. ఎక్కువ ట్విస్ట్ లు పెట్టి కొంత తికమక చేసినట్టుగా అనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది.  ప్రొడ్యూసర్స్ స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ ల నిర్మాణ విలువలు పర్వాలేదు. 

ఫైనల్‌గాః `ది ట్రయల్‌` ఓ ప్రయోగాత్మక మూవీ. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌, మైండ్‌ గేమ్‌ లాంటి స్టోరీస్ ని ఇష్టపడే వారిని మెప్పించే చిత్రమవుతుంది.
రేటింగ్‌ః 2.5
 
నటీనటులు - స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు, తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ - శ్రీ సాయికుమార్ దారా 
ఎడిటర్ - శ్రీకాంత్ పట్నాయక్. ఆర్
సంగీతం - శరవణ వాసుదేవన్
బ్యానర్స్ - ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్
కో ప్రొడ్యూసర్ - సుదర్శన్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ - స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం - రామ్ గన్ని
నిడివిః గంటన్నర.

click me!