సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి, పెద్ద హిట్టు కొట్టాలని నిర్మాతలు ఆశిస్తారు. కానీ కొన్నిసార్లు, పెద్ద స్టార్లు ఉన్నా, కోట్లు ఖర్చుపెట్టినా, ప్రేక్షకులకు నచ్చకపోతే సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవుతాయి. బాలీవుడ్‌లో ఇలాంటి ఓ భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమై డిజాస్టర్ మూవీగా చెడ్డపేరు తెచ్చుకుంది.
ఆ సినిమా పేరే 'ది లేడీ కిల్లర్'. సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, థియేటర్లలో మొత్తం మీద కేవలం రూ.60 వేలు మాత్రమే వసూలు చేసిందని సమాచారం. 2023లో విడుదలైన 'ది లేడీ కిల్లర్' చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహించారు. అర్జున్ కపూర్, భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను టి-సిరీస్ సంస్థ నిర్మించింది. పెద్ద నిర్మాణ సంస్థ, ప్రముఖ నటీనటులు, భారీ బడ్జెట్.. ఇలా సినిమాపై మొదట్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ, సినిమా విడుదలయ్యాక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.