ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్‌ అసహనం.. ఆ కోపానికి కారణమేంటి?

First Published May 28, 2023, 4:36 PM IST

ఎన్టీఆర్‌ ఇంతటి కోపంగా, అసహనంగా ఉండటానికి కారణం అక్కడ జరిగిన అభిమానుల తాకిడి మాత్రమే కాదు, అంతకు మించి వేరే ఉందని తెలుస్తుంది.

సీనియర్‌ ఎన్టీఆర్‌ శతజయంతి సందర్బంగా ట్యాంక్‌బండ్‌ వద్ద ఎన్టీఆర్‌ ఘాట్‌కి నందమూరి ఫ్యామిలీ ఈ రోజు(మే28) ఆదివారం ఉదయం సందర్శించి నివాళ్లు అర్పించారు. ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకే బాలకృష్ణ, వారి ఫ్యామిలీ ఎన్టీఆర్‌ ఘాట్‌ని సందర్శించి తండ్రి తారక రాముడికి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ తాత సమాధిని సందర్శించారు. ఎప్పుడూ తన అన్న, హీరో కళ్యాణ్‌ రామ్‌తో కలిసి వచ్చే ఎన్టీఆర్‌.. ఈ సారి ఒంటరిగానే వచ్చాడు. కళ్యాణ్‌ రామ్‌ సిటీలో లేకపోవడం వల్ల ఒంటరిగా వచ్చినట్టు తెలుస్తుంది. తారక్‌ రావడంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. 

ఎన్టీఆర్‌ కారు దిగిన సమాధి వద్దకు వచ్చే క్రమంలో భారీగా తోపులాట జరిగింది. దీంతో తారక్‌ చాలా ఇబ్బంది పడ్డారు. అసహనానికి గురయ్యారు. అభిమానులు తోపులాటతో ఎన్టీఆర్‌ నడవలేకపోయారు. అభిమానులతో పాటు ఆయన కూడా ఊగిపోయారు. అది చూడ్డానికి మనకే ఇబ్బందిగా ఉంటే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో కోపాన్ని పంటికింద అదుముకుని సమాధి వద్ద నమస్కరిస్తూ తాత సీనియర్‌ ఎన్టీఆర్‌కి నివాళ్లు అర్పించారు. 
 

ఈ క్రమంలో పుష్ప గుచ్చం అక్కడ ఉంచేందుకు ఆయన అనుచరులు ఆ పుష్పగుచ్చాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించినా ఎన్టీఆర్‌ దాన్ని చేతితో నెట్టేసి పూల రేకుల్ని తీసుకుని నమస్కరించారు. అనంతరం మరోసారి ఆ పుష్పగుచ్చం ఇవ్వగా దాన్ని పట్టించుకోకుండా ఎన్టీఆర్‌ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ముఖంలో అసహనంతోపాటు కోపం, అసంతృప్తి వంటివి స్పష్టంగా కనిపించాయి. మరోవైపు వెనకాల నుంచి అభిమానులు జై ఎన్టీఆర్‌ అంటూ, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.
 

ఎన్టీఆర్‌ ఇంతటి కోపంగా, అసహనంగా ఉండటానికి కారణం అక్కడ జరిగిన అభిమానుల తాకిడి మాత్రమే కాదు, అంతకు మించి వేరే ఉందని తెలుస్తుంది. ఇటీవల కాలంలో తనని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టడమే అందుకు కారణమని తెలుస్తుంది. తారక్‌కి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, ఆయనతో వారి ఫ్యామిలీ అంటి ముంటనట్టుగా ఉంటున్నారనే ఆరోపణలు, గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్‌ని చిన్నప్పట్నుంచి దూరం పెట్టింది నందమూరి ఫ్యామిలీ. కానీ తారక్‌ హీరో అయ్యాక, మిగిలిన నందమూరి హీరోల కంటే బాగా యాక్ట్ చేసి తనకంటూ ఓ గుర్తింపు, స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకున్నాక.. ఆయన్ని నందమూరి ఫ్యామిలీ చేరదీసింది. 
 

హరికృష్ణ కూడా తారక్‌ని మరింతగా ఎలివేట్‌ చేస్తూ వచ్చారు. హరికృష్ణ మరణాంతరం బాలకృష్ణ కొన్ని రోజులు సపోర్ట్ గా ఉన్నారు. సినిమా ఫంక్షన్లకి బాలయ్య హాజరయ్యారు. దీంతో మళ్లీ అంతా కలిసిపోయారనే భావన కలిగింది. కానీ ఆ తర్వాత రాను రాను ఆ దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. మొన్న జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు తారక్‌ని ఆహ్వానించినా ఆయన హాజరు కాలేదు. సరిగ్గా తన పుట్టిన రోజే ఈ ఈవెంట్‌ పెట్టడంతో తారక్‌ని ఇరకాటంలో పెట్టినట్టయ్యింది. ఆయన తన ఫ్యామిలీ కమిట్స్ మెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని, ఈ వేడుకకు హాజరు కాలేనని వెల్లడించారు. 
 

అయితే ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, నందమూరి ఫ్యామిలీ, సినిమా ప్రముఖులు హాజరయ్యారు. పవన్‌, ప్రభాస్‌, బన్నీ వంటి పెద్ద స్టార్లని కూడా ఆహ్వానించారు. అందులో భాగంగానే తారక్‌కి కూడా ఆహ్వానం అందించింది. బాలకృష్ణ సమక్షంలో ఈ వేడుక జరిగింది. చంద్రబాబు వెనకుండి ఈ ఈవెంట్‌ని నిర్వహించారని అన్నారు. అయితే వారి ముందు తనకు సరైన ప్రాధాన్యత దక్కదనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ దీన్ని స్కిప్‌ చేసినట్టు సమాచారం. దీనికితోడు బాలయ్య.. ఇతర హీరోలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ కనిపించాడు. ఈ క్రమంలో బాలయ్యకి, తారక్‌ కి మధ్య గ్యాప్‌ ఏర్పడిందని, అది మరింతగా పెరుగుతుందని అంటున్నారు. ఈ కారణాలతో తారక్‌ దూరంగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 

ఎన్టీఆర్‌.. గతంలో(2009) ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదని, తన ప్రయారిటీ సినిమాలే అని చెబుతూ వచ్చారు తారక్‌. 2009 ఎన్నికల ప్రచారంలో తారక్‌ సభలకు విశేష స్పందన లభించింది. ఆయనకోసం జనం పోటెత్తుతూ వచ్చారు.  అదే సమయంలో తారక్‌ సీఎం అనే నినాదాలు అప్పట్నుంచే ప్రారంభమయ్యాయి. ఇది నచ్చని చంద్రబాబు ఆ తర్వాత తారక్‌ని పక్కన పెట్టారని అంటున్నారు. తన కొడుకు లోకేష్‌ని తీసుకురావడం కోసం, టీడీపీలో లోకేష్‌ని కీలకంగా మార్చేందుకు తారక్‌ని పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. జూ.ఎన్టీఆర్‌లో దీని తాలుకూ అసహనం చాలా కాలంగా ఉండిపోయింది. 
 

ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్‌లో మరో అసహనం ఉంది. అదే `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా కారణం ఏర్పడ్డది. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తోపాటు రామ్‌చరణ్‌ నటించారు. ఇందులో చరణ్‌ పాత్రని హీరోగా, ఎన్టీఆర్‌ పాత్రని సెకండ్‌ హీరోగానే నార్త్ ఆడియెన్స్ చూశారు. చాలా చోట్ల బహిరంగంగానే ఈ కామెంట్లు వచ్చాయి. దీనిపై చాలా ట్రోల్స్ ని తారక్‌ ఫేస్‌ చేశాడు. పైగా ఇదే అదునుగా తన ఇమేజ్‌ని పెంచుకున్నాడు రామ్‌చరణ్‌. గ్లోబల్‌ స్టార్‌గా తనని గట్టిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. తారక్‌ సైలెంట్‌ కావడంతో చెర్రీ దీన్ని గట్టిగా వాడుకునే ప్రోగ్రామ్‌ పెట్టుకున్నాడు. ఈ విషయంలో సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. దీంతో దీనికి సంబంధించిన అసహనం కూడా ఎన్టీఆర్‌లో చాలా రోజులుగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. ఇవన్నీ ప్రస్తుతం తారక్‌లో రిఫ్లెక్ట్ అవుతున్నాయని అంటున్నారు. అయితే ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ హీరోకి, అద్భుతమైన నటుడికి ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం బాధాకరమనే చెప్పాలి. 
 

వీటిని అన్నీ సెలైంట్‌గా భరిస్తూ తానేంటో చూపించేందుకు, తాను గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాల పరంగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఫ్యామిలీ నుంచి, పార్టీ నుంచి కాదు, సినిమాల నుంచి నరుక్కుంటూ రావాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తుంది. అందుకే ఎన్టీఆర్‌ వరుసగా భారీ పాన్‌ ఇండియా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో `ఎన్టీఆర్‌30` చిత్రంలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా, హిందీలో హృతిక్‌ రోషన్‌తో `వార్‌2` సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌. భారీ పాన్‌ ఇండియా లైనప్‌తో ఆయన ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. 
 

click me!