నటుడు, కమెడియన్ రోబో శంకర్ 46 ఏళ్ల వయసులో చెన్నైలో కన్నుమూశారు. రోబో శంకర్ మరణవార్త విని అభిమానులు, సినీ ప్రముఖులు శోక సంద్రంలో మునిగిపోయారు. పిన్న వయసులోనే రోబో శంకర్ మృతికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, కమెడియన్‌గా గుర్తింపు పొందిన రోబో శంకర్ ఇక లేరు. చెన్నైలో గురువారం ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 46 సంవత్సరాలు.ఈ వారం ప్రారంభంలో రోబో శంకర్ అస్వస్థతకు గురయ్యారని, ఒక్కసారిగా మూర్చిపోయారని సమాచారం. అనంతరం ఆయనను చెన్నైలోని OMRలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
25
ఆరోగ్యం బాగా క్షీణించిన తర్వాత ఆసుపత్రికి
GEM హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఎస్. అశోకన్ ప్రకారం, “శంకర్ గారిని అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయనకు తీవ్రమైన గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లీడ్, కాంప్లెక్స్ అబ్డామినల్ కండీషన్ కారణంగా మల్టీ ఆర్గన్ డిస్‌ఫంక్షన్ వచ్చింది. మా మల్టీడిసిప్లినరీ టీమ్ అన్ని విధాలైన వైద్య సహాయం చేసినప్పటికీ, ఆయన పరిస్థితి వేగంగా దిగజారిపోయింది” అని వివరించారు.
35
బుల్లితెరపై నటన ప్రారంభించిన రోబో శంకర్
రోబో శంకర్ గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో కన్నుమూశారని వైద్యులు ధృవీకరించారు. రోబో శంకర్ కి భార్య, కుమార్తె ఉన్నారు. రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ కూడా నటిగా రాణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన అంత్యక్రియలు శుక్రవారం చెన్నైలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ ప్రముఖులు, సహనటులు, అభిమానులు హాజరై చివరి వీడ్కోలు చెప్పనున్నారు.రోబో శంకర్ తన కెరీర్‌ను చిన్న తెరపై ప్రారంభించి, అనంతరం విజయవంతంగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తన ప్రత్యేకమైన కామిక్ టైమింగ్ తో, హాస్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.
అజిత్ నటించిన విశ్వాసం, విజయ్ నటించిన పులి, సూర్య నటించిన సింగం 3, విక్రమ్ నటించిన కోబ్రా వంటి అనేక చిత్రాలలో ఆయన మెరిశారు. అదనంగా, ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమార, మారి, వెలైనూ వందుట్టా వెల్లైకారన్ వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
55
కొంప ముంచింది ఆ అలవాటేనా
ఒక ఇంటర్వ్యూలో ఆయన తన మద్యం సేవించే అలవాటు గురించి కూడా చెప్పుకొచ్చారు. అది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని అంగీకరించారు.అధికంగా మద్యం సేవించడం వల్లే రోబో శంకర్ పిన్న వయసులోనే తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారని అభిమానులు భావిస్తున్నారు. రోబో శంకర్ ఎంతో ప్రతిభగల నటుడు అని అభిమానులు కొనియాడుతున్నారు. తమిళనాడులో సినీ రాజకీయ ప్రముఖులు రోబో శంకర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రోబో శంకర్ ఆకస్మిక మరణం తమిళ సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటు. ఆయన వినోదాత్మక నటన ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది.