VAS vs Makutam Box Office: ఒకే రోజు విడుదలైన సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్', విశాల్ 'మకుటం' సినిమాల బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాల మూడు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ చూస్తే, సూర్య దెబ్బకి విశాల్ అడ్రస్ లేకుండాపోయాడు.
సూర్య, మమితా బైజు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 'సర్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. ఇదే రోజు విశాల్ నటించిన `మకుటం`(మగుడం) మూవీ కూడా విడుదలైంది. కానీ దీనికి నెగటివ్ టాక్ వచ్చింది.
25
సూర్య గత చిత్రాల్లోని యాక్షన్, మాస్ అంశాలకు భిన్నంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మంచి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడేస్తుంది. మమితా బైజు నటన కూడా యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది. దీని ఫలితంగా, సినిమా విడుదలైన మూడు రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లను దాటినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. సూర్య కెరీర్‌లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.
35
విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్లు
ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో రూ.15.35 కోట్లు, రెండో రోజు రూ.22.25 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మూడో రోజు మొత్తం 4,876 షోలతో రూ.20.55 కోట్లు రాబట్టింది. అంతకుముందు రోజుతో పోలిస్తే వసూళ్లు 7.6 శాతం తగ్గినా, వరుసగా రెండో రోజు కూడా రూ.20 కోట్లకు పైగా వసూలు చేయడం సినిమా స్ట్రాంగ్ హోల్డ్‌ను చూపిస్తోంది. మూడు రోజులు ముగిసేసరికి ఇండియాలో మొత్తం వసూళ్లు రూ.67.22 కోట్లు కాగా, ఓవర్సీస్‌లో రూ.43 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.110.22 కోట్లకు చేరాయని సాక్నిల్క్ డేటా చెబుతోంది. ముఖ్యంగా మూడో రోజు తమిళనాడులో రూ.9.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో రూ.9.50 కోట్లు, కర్ణాటకలో రూ.2.90 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ కారణంగా రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు పోటీగా ఆగస్టు 14న విడుదలైన విశాల్ 'మకుటం' సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తేలిపోయింది. 'ఈట్టి', 'ఐంగరన్' చిత్రాల దర్శకుడు రవి అరసు మొదట ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా పనిచేశారు. కథ, స్క్రీన్‌ప్లే పనుల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత నటుడు విశాల్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
55
మకుటం కలెక్షన్లు
విడుదలైనప్పటి నుంచి 'మకుటం' సినిమాకు ఎక్కువగా నెగటివ్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సాక్నిల్క్ డేటా ప్రకారం, ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.10 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఒకవైపు 'విశ్వనాథ్ అండ్ సన్స్' రోజూ రూ.20 కోట్లకు పైగా వసూలు చేస్తూ రూ.110 కోట్ల క్లబ్‌లో చేరితే, మరోవైపు `మకుటం` బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా వెళ్తుండటం గమనార్హం.