పునీత్ సమాధి వద్ద కన్నీరు మున్నీరైన సూర్య.. మేమిద్దరం గర్భంలో ఉన్నప్పుడే..

First Published Nov 5, 2021, 4:47 PM IST

అభిమానులని, కుటుంబ సభ్యులని తీవ్ర శోకంలో ముంచుతూ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న అకాల మరణం చేశారు. కలలో కూడా ఊహించని ఈ దుర్ఘటనతో యావత్ సినీలోకం ఉలిక్కి పడింది.

అభిమానులని, కుటుంబ సభ్యులని తీవ్ర శోకంలో ముంచుతూ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న అకాల మరణం చేశారు. కలలో కూడా ఊహించని ఈ దుర్ఘటనతో యావత్ సినీలోకం ఉలిక్కి పడింది. సెలెబ్రిటీలంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇప్పటికి పునీత్ మరణం జీర్ణించుకోలేని విషాదమే. ఆ విషాద ఛాయలు అలాగే ఉన్నాయి. 

పునీత్ ని కడసారి చూపుకు నోచుకోని సెలెబ్రిటీలంతా ఇప్పుడు వెళ్లి సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ తో అనుబంధం ఉన్న తెలుగు, తమిళ హీరోలంతా బెంగళూరు వెళ్ళి అతడి కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు. తాజాగా హీరో సూర్య పునీత్ సమాధి వద్ద నివాళులు అర్పించాడు. జై భీమ్ చిత్ర విడుదల కార్యక్రమాలతో బిజీగా ఉన్న సూర్య పునీత్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు. 

దీనితో నేడు బెంగళూరు వెళ్లి పునీత్ కుటుంబ సభ్యులని పరామర్శించారు. పునీత్ సమాధి వద్ద సూర్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కాసేపు అలాగే నిల్చుని కన్నీటి పర్యంతమయ్యాడు. పునీత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ కు అన్ని చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 

పునీత్ కు నివాళులు అర్పించిన అనంతరం సూర్య మీడియాతో మాట్లాడారు. 'జరిగిన సంఘటన చాలా దారుణమైనది. నేను ఇప్పటికి జరిగిన నిజాన్ని అంగీకరించలేకున్నా. మా రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. మేమిద్దరం గర్భంలో ఉన్నప్పుడే కలిశాం. ఇది నిజం. నేను మా అమ్మ గర్భంలో 4 నెలలతో ఉన్నప్పుడు.. పునీత్ వాళ్ళ అమ్మ గర్భంలో 7 నెలలతో ఉన్నప్పుడు మా ఇద్దరి కలయిక జరిగింది. అది మా ఫస్ట్ మీటింగ్. 

ఈ సంగతిని మా అమ్మ నాతో చెప్పింది. ఆమె కూడా జరిగిన దుర్ఘటనని అంగీకరించలేకుంది. పునీత్ ని ఎక్కడ చూసిన నవ్వుతూనే కనిపిస్తాడు. పునీత్ లైఫ్ మొత్తం ఆయన గురించి నేను మంచి విషయాలే వింటూ వచ్చాను. పునీత్ ఎప్పుడూ మనందరి హృదయాల్లో ఉంటారు. పునీత్ కుటుంబ సభ్యులకు, కుమార్తెలకు భగవంతుడు మరింత ధైర్యాన్ని ప్రసాదించాలి అని సూర్య తెలిపారు. 

పునీత్ సమాధి వద్ద సూర్య కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్యతో పాటు ఎస్ఆర్ ప్రభు, రాజశేఖర్ పాండియన్ కూడా పునీత్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఇక తెలుగు నుంచి ఎన్టీఆర్, చిరంజీవి, బాలయ్య, రానా, వెంకటేష్.. పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అనంతరం రాంచరణ్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ పునీత్ కుటుంబ సభ్యులని పరామర్శించారు. 

Also Read: నేను సేఫ్ గా లేను అంటూ నితిన్ భార్య పోస్ట్.. వీడియో వైరల్

click me!