
టాలీవుడ్ చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ను రెండు కళ్లుగా అభివర్ణిస్తారు. 1950లలో హీరోలుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ఇద్దరు దిగ్గజాలు దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలారు. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మేంద్ర స్వామి లాంటి పాత్రలతో పాటు.. ముఖ్యమంత్రిగా పేదలకు, మహిళలకు ఎంతో మేలు చేసి.. ప్రేక్షకుల మధ్య దేవుడిగా పూజింపబడ్డాడు.
అటు ఏఎన్నార్ కూడా అద్భుతమైన సినిమాలతో లక్షల మంది అభిమానం సంపాదించుకున్నాడు. కానీ వీరిద్దరితో పాటు ఇండస్ట్రీలో దేవుడిగా పేరుతెచ్చుకున్న మరో హీరో కూడా ఉన్నారు. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. అందుకు కారణం ఏంటంటే?
ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన తరువాత.. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు స్టార్ హీరోలు పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అయితే ఇమేజ్, ఫాలోయింగ్ పరంగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు సమానంగా ఎదిగిన హీరో మాత్రం కృష్ణ ఒక్కడే. ఆయన చేసిన ప్రయోగాలు, విజయాలు కృష్ణకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. టెక్నాలజీ అస్సలు లేని రోజుల్లోనే.. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా టాలీవుడ్ లో కృష్ణకు పేరు వచ్చింది ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా సూపర్ స్టార్ నిలిచారు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో కొత్త విషయాలు నేర్పించారు. కొత్త కొత్త టెక్నాలజీలను పరిచయం చేశాడు. టాలీవుడ్ లో తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ మూవీ, తొలి సోషియో ఫాంటసీ మూవీ, తొలి కలర్ చిత్రం, తొలి సినిమాస్కోప్ చిత్రాలు పరిచయం చేసిన ఘనత కూడా ఆయన ఖాతాలోనే ఉన్నాయి.
అంతే కాదు కృష్ణ తొలి సారిగా డైరెక్షన్ చేస్తూ.. ద్విపాత్రాభినయం చేసిన సినిమాగా ‘సింహాసనం’ రికార్డు సాధించింది ఈసినిమా తొలి భారీ బడ్జెట్ మూవీగా గుర్తింపు పొందింది. ‘సింహాసనం’ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు.. 4 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు వచ్చే జనాలను కంట్రోల్ చేయలేక.. విజయవాడలో 144 సెక్షన్ కూడా అమలు చేశారు.
ఎన్టీఆర్ ఏఎన్నార్ లను ప్రజలు దేవుడిలా కొలిస్తే.. ఇండస్ట్రీలో నిర్మాతలు మాత్రం కృష్ణను దేవుడిలా భావించేవారు. కృష్ణ సినిమా వల్ల నిర్మాతకు నష్టం వస్తే, ఆ నిర్మాతను పిలిపించి రెమ్యునరేషన్ ను ఇచ్చేసేవారట. అంతే కాదు అదే నిర్మాతకు డేట్లు ఇచ్చి.. మళ్లీ సినిమా ప్రారంభించమని ప్రోత్సహించేవారు.
కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవని నిర్మాతలు అంటే.. ముందుగా సినిమా మొదలు పెట్టమని హామీ ఇచ్చి.. డైరెక్టర్, సబ్జెక్ట్ ఎంపిక నుంచి డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడటం, ఫైనాన్సియర్లకు విడుదలకు ముందే డబ్బులు చెల్లించడం వరకు అన్ని బాధ్యతలు కృష్ణే చూసేవారట. దాని వల్ల వచ్చే నష్టాన్ని కూడా కృష్ణ స్వయంగా భరించారు. ఈ విషయాలను సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సినిమాల విషయంలో ప్రయోగాలు చేయడంతో.. కృష్ణ చేసిన ప్రయోగాత్మక కథలను నిర్మించేందుకు అప్పటి నిర్మాతలు వెనుకడుగు వేసేవారు. దాంతో ఎవరికి నష్టం కలిగించడం ఇష్టం లేక.. కృష్ణ స్వయంగా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్‌లో తన సినిమాలను తానే నిర్మిస్తూ.. లాభ నష్టాలను స్వయంగా భరించారు. ఈ ప్రక్రియలో నష్టపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని మురళీ మోహన్ వెల్లడించారు.
అందుకే కృష్ణను నిర్మాతల హీరోగా పిలుస్తుంటారు. చాలామంది నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినా.. పట్టించుకునేవారు కాదు. మళ్లీ వారికే సినిమాలకు డేట్లు కూడా ఇచ్చేవారట. అందేకే తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన దేవుడు అంటే కృష్ణనే అని మురళీ మోహన్ ఓ సందర్భంలో అన్నారు.
‘తేనె మనసులు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కృష్ణ, తన సుదీర్ఘ కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో నటించారు. ఒకే ఏడాదిలో 18 సినిమాలు విడుదల చేసిన అరుదైన రికార్డు ఆయన సొంతం. తెలుగు సినీ పరిశ్రమలో మరే హీరో ఈ రికార్డును బ్రేక్ చేయలేరు. ఇక పదికి పైగా చిత్రాలకు కృష్ణ దర్శకత్వం వహించారు. 2016లో విడుదలైన ‘శ్రీశ్రీ’ ఆయన చివరి సినిమా.2022 నవంబర్ 15న గుండెపోటుతో కృష్ణ హైదరాబాద్‌లో కన్నుమూశారు.