Super Star Krishna
సూపర్ స్టార్ కృష్ణ అంటే టాలీవుడ్ లో సాహసాలకు మారుపేరు. ప్రతి సినిమాకి ముందు తన నిర్మాతల బాగోగులు చేసుకునే ఏకైక హీరో కృష్ణ అని చెప్పొచ్చు. ప్రతి హీరోకి కెరీర్ లో ఇబ్బందికర పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది. సూపర్ స్టార్ కృష్ణకి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది.
Super Star Krishna
కృష్ణ నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం అల్లూరి సీతారామరాజు చాలా నాటకీయ పరిణామాల మధ్య తెరకెక్కింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ముందుగా ఈ చిత్రంలో శోభన్ బాబుని హీరోగా అనుకున్నారు. కానీ ఆ తర్వాత కృష్ణ చేతుల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ స్వయంగా కృష్ణని పిలిచి ఈ చిత్రంలో నటించవద్దని హెచ్చరించినా ఆయన ఆగలేదు. ఈ మూవీ వల్ల ఎన్టీఆర్, కృష్ణ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. మొత్తంగా అల్లూరి సీతారామరాజు విడుదలై అఖండ విజయం సాధించింది.
Super Star Krishna
అప్పటి ప్రముఖ నిర్మాత, విజయవాహిని స్టూడియోస్ అధినేత చక్రపాణి.. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం గురించి తెలుసుకున్నారు. కృష్ణని అడిగి ప్రింట్ తెప్పించుకుని చూశారట. ఆయన సినిమా మొత్తాన్ని ఒకేసారి చూడలేదు. రోజుకు 5 రీళ్ల చొప్పున చూసేవారట. సినిమా మొత్తం చూశాక స్టూడియోకి వచ్చి నాకు ఒకసారి కనిపించు అని అడిగారట. దీనితో కృష్ణ చక్రపాణి వద్దకి వెళ్లారు. ఇప్పుడు నువ్వు ఎన్ని సినిమాల్లో నటిస్తున్నావు అని అడిగారట. ఏడెనిమిది చిత్రాల్లో నటిస్తున్నాను అని కృష్ణ చెప్పారు.
వెంటనే చక్రపాణి రియాక్ట్ అవుతూ.. నీతో సినిమా చేసే నిర్మాతల పని అయిపోయినట్లే అని అన్నారు. కృష్ణ నటించే సినిమాల జాతకం ముందే చెప్పేశారు. అదేంటి అలా అంటున్నారు.. అల్లూరి సీతారామరాజు మీకు నచ్చలేదా అని కృష్ణ అడగడంతో.. నచ్చడం ఏంటి మూవీ బ్రహ్మాండంగా ఉంది. అంతటి గొప్ప చిత్రంలో ఆడియన్స్ నిన్ను చూశాక.. నువ్వు ఎలాంటి చిత్రం చేసినా వాళ్ళకి అంతగా నచ్చదు. కాబట్టి తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారట.
Super Star Krishna
అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణ నటించిన 14 చిత్రాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. ఆయన ఎలాంటి చిత్రం చేసినా వర్కౌట్ కావడం లేదు. చివరికి ఏఎన్నార్ ఆల్ టైం క్లాసిక్ దేవదాసు చిత్రాన్ని కృష్ణ రీమేక్ చేసి నటించారు. అది కూడా ఫ్లాప్ అయింది. వరుసగా 14 సినిమాలు డిజాస్టర్ కావడం అంటే మామూలు విషయం కాదు. మరొక హీరో అయి ఉంటే కెరీర్ క్లోజ్ అయ్యేది. కానీ కృష్ణ నిలబడగలిగారు. పాడి పంటలు చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. అక్కడి నుంచి కృష్ణకి మళ్ళీ తిరుగులేకుండా పోయింది.