
సుమన్ తెలుగు హీరోల్లో అందగాడిగా పేరుతెచ్చుకున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. ఇంకా చెప్పాలంటే 1980లో ఏకంగా చిరంజీవికే పోటీ ఇచ్చాడు. యాక్షన్ సినిమాలతో మెప్పించాడు. తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. కానీ ఆయన్ని ఓ కేసు వెంటాడింది. దీంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నిర్దోశిగా బయటకు వచ్చినా ఆ ప్రభావం మాత్రం సుమన్ కెరీర్‌పై పడింది. మునుపటి క్రేజ్ లేదు, మునుపటి సక్సెస్ లేదు, సినిమాలు లేవు. దీంతో కొంత కాలం హీరోగా రాణించిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్స్ వైపుకి టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దుమ్ములేపారు. అదిరిపోయే సినిమాలు చేశారు. `అన్నమయ్య`లో వేంకటేశ్వరస్వామిగా, `శివాజీ`లో విలన్‌గా సుమన్ పాత్రలు ఇప్పటికీ గుర్తిండిపోతాయి.
సుమన్ తన కెరీర్‌లో ఓ సినిమా విషయంలో మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఏకంగా ఎనిమిది నెలలు నేలపైన పడుకోవాల్సి వచ్చిందట. ఆ విషయాలను సుమన్ స్వయంగా తెలిపారు. ఎంతో దీక్షతో ఆ మూవీ చేసినట్టు చెప్పారు. ఆ సినిమానే `అన్నమయ్య`. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నాగార్జున హీరోగా నటించగా, సుమన్ వేంకటేశ్వర స్వామిగా కనిపించారు. ఈ మూవీలో నాగార్జున పాత్ర ఎంత గొప్పదో, సుమన్ పాత్ర కూడా అంతే గొప్పది. ఈ సినిమా పేరు చెబితే నాగ్‌తోపాటు సుమన్ కూడా గుర్తుకు వస్తారు. 1997లో విడుదలైన ఈ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అప్పటి వరకు రొమాంటిక్, మాస్, కమర్షియల్ చిత్రాలు చేస్తూ వచ్చిన రాఘవేంద్రరావు తన రూట్ మార్చిన రూపొందించిన చిత్రమిది. ఆయనకు ఛేంజోవర్ మాత్రమే కాదు, అటు మన్మథుడు నాగార్జునకి కూడా పెద్ద ఛేంజోవర్ అని చెప్పొచ్చు. ఇద్దరూ తన కంఫర్ట్ జోన్ దాటి చేసిన చిత్రమిది. అంతే స్థాయిలో ఆదరణ పొందింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అయితే `అన్నమయ్య` సినిమా కోసం తాను ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు సుమన్. ఈ పాత్ర చేసే అవకాశం రావడం గొప్ప వరం అని తెలిపారు. ఆ దేవుడు తనని ఇన్నాళ్లు నానా రకాలుగా పరీక్షించి ఇలాంటి పాత్రని అందించారని, ఈ పాత్ర కోసమే తనని ఇలా తయారు చేశారేమో అని వెల్లడించారు సుమన్. అయితే `అన్నమయ్య` మూవీ కోసం చాలా కష్టపడినట్టు తెలిపారు. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు చెప్పులు వేసుకోలేదట. ఉత్త కాళ్లతో నడిచినట్టు తెలిపారు. అలాగే ఎనిమిది నెలలు నేలపై పడుకున్నాడట. ఉదయం నాలుగు గంటలకు షూటింగ్‌లో పాల్గొన్నాడట. ఉదయాన్ని మేకప్ వేసుకుని షూటింగ్‌కి రెడీ అవ్వాల్సి వచ్చిందట. ఈ సినిమాని ఒక తపస్సులా చేయాల్సి వచ్చిందన్నారు సుమన్. ఆయనే కాదు దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో నాగార్జున, ఇలా టీమ్ అందరు అలానే ఫీల్ అయ్యారని, ఎప్పుడూ ఆ భక్తి మూడ్‌లో ఉండేవారని, అలా చేశాం కాబట్టే సినిమా అంత బాగా వచ్చిందని, అంతటి పెద్ద విజయం సాధించిందని తెలిపారు సుమన్.
ఈ మూవీ విడుదలయ్యాక పెద్ద హిట్ అయ్యిందని, ఆ మరుసటి రోజు అప్పటి రాష్ట్రపతి శంకర్ దాయల్ శర్మ పక్కన కూర్చొని సినిమా చూశామని, ఈ మూవీ తనకు రాష్ట్రపతి పక్కన కూర్చునే అవకాశం కల్పించిందని, ఇదంతా తనకు ఇన్నాళ్ల కష్టం ద్వారా సాధ్యమైందని, వెంకటేశ్వరుడి రూపం, ఆ కళ రావడానికి ఆ దేవుడు తనని రకరకాలుగా పరీక్షించాడని తెలిపారు సుమన్. ఇలాంటి పాత్ర చేసే అవకాశం రావడం మన అదృష్టమని, ఎవరికీ అలా రావు అని చెప్పారు. ఏదైనా దేవుడి బ్లెస్సింగ్స్ తో సాధ్యమవుతుందని, జీవితంలో ఏ విషయంలోనూ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని, కాలాన్ని బట్టి వెళ్తూనే ఉండాలని తెలిపారు సుమన్. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.