Guppedantha Manasu: జగతిని మందలిస్తున్న ధరణి.. అవమాన భారంతో వసుధార!

First Published Jun 2, 2023, 10:30 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు గురు శిష్యుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో పరధ్యానంగా ఉన్న వసు దగ్గరికి వస్తాడు చక్రపాణి. ఏమిటమ్మా ఈ పరధ్యానం అంటూ బాధగా అడుగుతాడు. వసు ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. వర్షం పడుతుండటంతో రిషి తో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మళ్లీ చక్రపాణి వచ్చి ఏంటమ్మా ఇది? నువ్వు ఇలా ఉంటే నాకు చాలా భయంగా ఉంది.
 

నీ మొహం లో చిరునవ్వు చూసి చాలా రోజులైంది అంటాడు. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను నాన్న. ఇకమీదట నువ్వు నా మొహం లో చిరునవ్వుని చూడలేవు. నేను చేసినది మంచి కోసమే అయినా అటు రిషి సర్ కి ఇటు అమ్మకి దూరమయ్యాను. మహేంద్ర సార్ ని ఎంతో బాధ పెట్టాను అని బాధపడుతుంది వసు. లేదమ్మా రిషి సార్ ఎప్పుడో ఒకప్పుడు నిజం తెలుసుకుంటారు నిన్ను క్షమిస్తారు ఆ నమ్మకం నాకుంది అంటాడు చక్రపాణి.

 లేదు నాన్న ఆయన వెళ్తూ వెళ్తూ జగతి మేడం తో మిమ్మల్ని అమ్మ అని పిలవలేదని కొరత మీకు ఉండకూడదు అని ఆవిడని అమ్మ అని పిలిచి వెళ్లిపోయారు అప్పుడే అర్థమైంది ఆయన ఇంక మమ్మల్ని జీవితంలో క్షమించరని అని అంటుంది వసు. ఇందులో పక్కింటి అమ్మాయి లెటర్ ఏదో  వచ్చిందని తీసుకువస్తుంది. అది చూసిన వసు అపాయింట్మెంట్ లెటర్ నాన్న అంటుంది. అవునమ్మా నేనే అప్లికేషన్ పెట్టాను.
 

పంతులమ్మ అవ్వాలి అన్నది నీకల. ఏవో సమస్యలు వచ్చాయని నీ కలని దూరం చేసుకోకు. నువ్వు ఇలాగే ఉంటే ఏమైపోతావో అని భయంగా ఉంది కాలేజీకి వెళ్తే కాస్త మనసు కుదుటపడుతుంది అంటాడు చక్రపాణి. నేను వెళ్ళను నాన్న నేను ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్లలేను అంటుంది వసు. అలా అనకమ్మ.. ఎంతకాలమని ఇలా ముభావంగా ఉంటావు. ఇలా చూసి ఎప్పుడో ఒకరోజు నేను కూడా మీ అమ్మ లాగా నీకు దూరమైపోతానేమో అని భయంగా ఉంది.
 

నీకోసం కాదు నాకోసం అంటూ కూతురిని బ్రతిమిలాడి ఉద్యోగానికి వెళ్ళటానికి ఒప్పిస్తాడు చక్రపాణి. లెటర్ తెచ్చిన అమ్మాయి వసుధారకి కంగ్రాట్స్ చెప్పి ఇంతకీ ఏ కాలేజీలో అక్క జాబ్ అని అడుగుతుంది. విస్ సైన్స్ కాలేజ్ అంటుంది  వసు. అదేంటి అక్క పోయి పోయి అక్కడ జాయిన్ అవుతున్నావు అక్కడ స్టూడెంట్స్ అంత మంచి వాళ్ళు కాదు జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి.
 

మరోవైపు కొడుకు ఫోటో చూస్తూ దిగులు పడుతూ ఉంటుంది జగతి. ఏంటి చిన్న అత్తయ్య ఎంతకాలం అని ఇలా బాధని భరిస్తారు. మిమ్మల్ని ఇలా చూడటం నావల్ల కావడం లేదు అంటుంది ధరణి. నాకోసం బాధపడొద్దు నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. ఇద్దరూ తండ్రి కొడుకుల్ని విడదీసిన పాపం నాది అంటుంది జగతి. ఇప్పటికైనా నిజం చెప్పొచ్చు కదా అత్తయ్య.. మీ దాపరికాలే పరిస్థితిని ఇంతవరకు తీసుకువచ్చాయి అంటూ మందలిస్తుంది ధరణి.
 

 ఏమని చెప్పమంటావు ధరణి ఒకవేళ నేను నిజం చెప్పినా తట్టుకునే శక్తి అవతలి వాళ్ళకి ఉండొద్దా..ఒక అన్న తమ్ముడు ని చంపడానికి సిద్ధమయ్యాడని చెప్పనా.. అలా చెప్తే మీ మామయ్య, చిన్న మామయ్య తట్టుకోగలరా. అయినా ఇప్పుడు నిజం చెప్పి ఉపయోగం లేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు నా కొడుకు చెప్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది జగతి. మరోవైపు కొత్త కాలేజీలో అడుగుపెడుతుంది వసు.
 

 క్లాసులోకి వెళ్లి తనని తాను పరిచయం చేసుకొని క్లాస్ చెప్పటానికి ప్రిపేర్ అవుతుంది. ఇంతలో ఒక లెక్చరర్ వచ్చి ఈ క్లాస్ నాది నేను ఫిజిక్స్ లెక్చరర్ ని. అయినా పీరియడ్ ఎవరిదో తెలియకుండా క్లాస్ చెప్పడానికి వచ్చేసారా అంటూ అవమానించే లాగా మాట్లాడుతాడు లెక్చరర్. ప్రిన్సిపాల్ గారే నన్ను పంపించారు అని చెప్తుంది వసు. ఆయన కరెక్ట్ గానే చెప్పి ఉంటారు మీరే ఎక్కడో పొరపడ్డారు అంటాడు లెక్చరర్. ఆ మాటలకి  స్టూడెంట్స్ అందరూ నవ్వుతారు.
 

 సిగ్గు పడిపోతుంది వసు. నేరుగా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి మీరు చేసింది ఏమీ బాగోలేదు. వేరే వాళ్ళ క్లాస్ కి నన్ను పంపిస్తారా అంటూ నిలదీస్తుంది. మీరు ఎక్కడో పొరపడ్డారు నేను పంపించింది మీ క్లాస్ కే అంటాడు ప్రిన్సిపల్. అక్కడ ఆ లెక్చరర్ గారు కూడా అలాగే అన్నారు ఇక్కడ మీరు కూడా అలాగే అంటున్నారు అంటూ చికాకు పడుతూ మాట్లాడుతుంది వసు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!