
సినిమా హీరోయిన్ల విషయంలో చాలా విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక హీరోతో హీరోయిన్ గా రొమాన్స్ చేసి, ఆ తర్వాత సిస్టర్‌గా నటించిన సందర్భాలుంటాయి. అంతేకాదు మదర్‌గానూ చేస్తారు. చూడ్డానికి ఇది వింతంగా అనిపించినా, ఇలాంటివే చాలా జరుగుతుంటాయి. ఇంకా చిత్రమేంటంటే కూతురుగా నటించి, ఆ తర్వాత ప్రియురాలుగా రొమాన్స్ చేయడం. ఇలాంటివి కూడా జరిగాయి. ఎన్టీఆర్, శ్రీదేవి విషయంలో ఇది మనం చూశాం. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలోనూ జరిగింది.
రజనీకి కూతురుగా చేసి, ఆ తర్వాత వరుసగా రొమాన్స్ చేసింది ఒక హీరోయిన్. ఆ తర్వాత ఆయనతో వరుసగా మూడు సూపర్ హిట్ మూవీస్ చేసింది. అంతేకాదు కాదు, ఆయన ఫ్లాప్‌లో ఉన్నప్పుడు హిట్ కూడా ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మీనా. తెలుగుదనం ఉట్టిపడేలా, నిండుదనంతో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది మీనా. తెలుగులో ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. ఎప్పుడూ గ్లామర్ వైపు ఫోకస్ చేయలేదు. సౌందర్యలాగే తాను కూడా చీరకట్టుకి ప్రయారిటీ ఇచ్చేది. అంతే బాగా ఆకట్టుకునేది. అలా తెలుగు ఆడియెన్స్ మదిలో తెలుగు ఆడపడుచులా గుర్తుండిపోయింది మీనా. ఇప్పటికీ ఆమె అంటే తెలుగు ఆడియెన్స్ లో అదే గౌరవం ఉంటుంది.
మీనా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. తెలుగు, తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. చాలా మంది సూపర్ స్టార్స్ కి కూతురుగా చేసింది. అలా రజనీకాంత్‌తోనూ నటించింది. ఆయన హీరోగా చేసిన `అన్బుల్లా రజనీకాంత్` చిత్రంతో సూపర్ స్టార్‌కి కూతురుగా నటించింది మీనా. ఇది చిల్డన్స్ డ్రామాగా వచ్చింది. కే నటరాజ్ దర్శకుడు. ఇది ఆడలేదు. ఈ సినిమా వచ్చిన తొమ్మిదేళ్లకి రజనీకాంత్ హీరోగా `యజమాన్` అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది మీనా. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రజనీతో మీనా రొమాన్స్ చేయడం విశేషం. ఈ ఇద్దరు జంటగా నటించిన తొలి చిత్రమిది. అంతకు ముందు కూతురు చేసి, ఇందులో హీరోయిన్‌గా రొమాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితిని చూసి మీనా ఆశ్చర్యపోయిందట. ఏంటి ఇది, ఇలా జరగడమేంటి? తాను దీన్ని ఎలా తీసుకోవాలో అర్థమయ్యేది కాదట. చాలా సిగ్గు పడిందట మీనా. అలా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిందట.
అయితే రజనీకాంత్‌తో నటించినప్పుడు, తాను చేసిన మూవీ కంటే ముందు చిత్రాలు పెద్దగా ఆడలేదని, ఆ తర్వాత తాను హీరోయిన్‌గా చేసిన మూవీతో హిట్ వచ్చేదట. ఇలా రజనీతోనే కాదు, మిగిలిన హీరోల విషయంలోనూ జరిగేదట. దీంతో తనని లక్కీ హీరోయిన్‌గా భావించేవారట. నిర్మాతలు కూడా ముందు పెద్దగా బడ్జెట్ లేదు, హీరోగారి పరిస్థితి బాగా లేదని చెప్పేవారట. సినిమా ఆడితే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తామనేవారట. తన మూవీతో హిట్ కొట్టేవారు, ఆ తర్వాత ఆ విషయాలన్నీ మర్చిపోయేవారని తెలిపింది మీనా. ఈ విషయాలను జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న `జయమ్ము నిశ్చయమ్మురా` టాక్ షోలో వెల్లడించింది మీనా. ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.
రజనీకాంత్, మీనా కాంబినేషన్‌కి కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. హిట్ పెయిర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్, మీనా కాంబినేషన్‌లో `యజమాన్`తోపాటు `వీర`, `ముత్తు` చిత్రాలు వచ్చాయి. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఆ తర్వాత `కథానాయకుడు`లో జగపతిబాబుకి జోడీగా చేసింది. ఇందులో రజనీకాంత్.. జగపతిబాబుకి ఫ్రెండ్. ఈ సినిమా ఆడలేదు. ఆ తర్వాత `అన్నాత్తే`లోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది మీనా. ఈ మూవీ కూడా ఆడలేదు. కానీ ఆమె రజనీతో జోడీ కట్టిన సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి.