`శ్రీరంగ నీతులు` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published Apr 11, 2024, 10:14 AM IST

కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో హీరోగా అలరిస్తున్నారు సుహాస్‌. ఇప్పుడు ఆయన `శ్రీరంగ నీతులు` అనే చిత్రంతో వచ్చాడు. ఈ మూవీ నేడు గురువారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

యంగ్‌ హీరో సుహాస్‌ ఇటీవల వరుస విజయాలతో అలరిస్తున్నాడు. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పిస్తున్నాడు. హీరోగా ఒక్కోమెట్టు ఎక్కుతున్నాడు. `రైటర్‌ పద్మభూషణ్‌`, `అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌`తో విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు `శ్రీరంగ నీతులు` అంటూ వస్తున్నారు. ఇందులో కార్తిక్‌రత్నం, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. రుహానీ శర్మ హీరోయిన్‌గా చేసింది. శ్రీనివాస్‌ అవసరాల గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ప్రవీణ్‌ కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ గురువారం(ఏప్రిల్‌ 11న) విడుదల అయ్యింది. మరి సినిమా ఎలా ఉంది?, సుహాస్‌కి మరో హిట్‌ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
ఇటీవల వచ్చిన `కేరాఫ్‌ కంచెరపాలెం`, `గామి`, `మనమంతా` వంటి చిత్రాల స్టయిల్‌లో సాగే కథ ఇది. ప్రధానంగా మూడు కథల చుట్టూ తిరుగుతుంది. ఆంథాలజీ మూవీ అని చెప్పొచ్చు. శివ(సుహాస్‌) టీవీ కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. ఎమ్మెల్యేతో ఫోటో దిగి ఫ్లెక్సీ కట్టించుకుని దాన్ని ఊరు గ్రౌండ్‌లో పెట్టి తన రేంజ్‌ని చూపించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ప్లెక్సీ కోసం తన ఫ్రెండ్‌(రాగ్‌ మయూర్‌)తో కలిసి నానా తంటాలు పడతాడు. తీరాకట్టాక ఎవరో దాన్ని దొంగిలిస్తారు.   అది ఎవరు చేశారని వెతుకుతుంటాడు. మరో ప్లెక్సీ కట్టి పరువు నిలబెట్టుకోవాలనుకుంటాడు. అందుకోసం ఏం చేశాడు, తన అపోజిట్‌ గ్యాంగ్‌ రెచ్చగొడితే రెచ్చిపోయి చేసిన పనులకు ఏం జరిగింది?

మరోవైపు వరుణ్‌(విరాజ్‌ అశ్విన్‌), ఐశ్వర్య(రుహానీ శర్మ) ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ అంతలోనే ఐశ్వర్య పేరెంట్స్ ఆమెకి ఓ సంబంధాన్ని చూస్తారు. అమ్మాయి అబ్బాయి వాళ్లకి నచ్చుతుంది. పెళ్లికి సంబంధించిన చర్చలు ముందుకు సాగుతుంటాయి. పెళ్లి ఏర్పాట్ల వరకు వెళ్లే పరిస్థితి వస్తుంది. దీంతో తన ప్రియుడిని వదులుకోలేక, ఇంట్లో తమ ప్రేమ విషయం చెప్పలేక డైలమాలో ఉంటుంది. మరో సమస్యతో బాధపడుతుంది. మరి ఆ సమస్య ఏంటి? ప్రియుడిని వదిలేసిందా? పెద్దలకు ప్రేమ విషయం చెప్పిందా? చివరికి ఏమైంది?
 

ఇంకోవైపు కార్తిక్‌(కార్తీక్ రత్నం) కెరీర్‌ అనుకున్న విధంగా లేకపోవడంతో తాగుడుకి, గంజాయికి అలవాటు అవుతాడు. ఇంట్లో గంజాయి మొక్కలు కూడా పెంచుకుంటాడు. ఆ విషయం పోలీసులకు తెలిసి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే, పారిపోతాడు. ఫ్రెండ్‌ హాస్టల్‌లో ఉంటాడు. అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు నాన్న(దేవిప్రసాద్‌) వస్తే మధ్యలో పోలీసులకు దొరికిపోతారు. తాము ఇన్నోసెంట్‌ అని చెప్పి బయటకు వస్తారు. కార్తీక్‌ని ఓ లాడ్జ్ లో ఉంచుతాడు నాన్న. అతన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ తాను బెంగుళూరికి వెళ్లాలని ప్లాన్‌ చేస్తాడు కార్తీక్‌. మరోసారి పోలీసులు వీరిని గుర్తిస్తారు. కార్తీక్‌ పారిపోగా, తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కొడుకు వస్తాడని, మారుతాడని తండ్రి పోలీస్‌ స్టేషన్‌లోనే వెయిట్‌ చేస్తుంటాడు. మరి కొడుకు వచ్చాడా? అతను మారాడా? ఈ మూడు కథల్లో చివరికి కన్‌ క్లూజన్‌ ఏంటి? దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనేది మిగిలిన కథ.  
 

విశ్లేషణః
 చిన్న కాన్సెప్ట్ తో సినిమాలు చేసి మెప్పిస్తున్నారు నేటితరం యువ దర్శకులు. సినిమాను ఫన్నీగా తీసుకెళ్తూ చివరికి చిన్న సందేశాన్ని అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. `శ్రీరంగ నీతులు` సినిమా ఉద్దేశ్యం కూడా అదే. మూడు జీవితాలను ప్రతిబింబిస్తూ, ఆయా వ్యక్తులు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, వారికి ఏం మిస్‌ అవుతుంది? ఎందుకు అలా చేస్తున్నారు? చివరికి ఎలా మారుతున్నారనేది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. జనరేషన్స్ ని టార్గెట్‌ చేస్తూ తెరకెక్కించారు. ఇప్పటి జనరేషన్‌ యువత ఎలా ఉంటుందనేది చెప్పారు. పిల్లలకు సరైన గైడెన్స్ లేకపోవడం, మంచి చెడు చెప్పేవాళ్లు లేకపోవడం, వారికి భరోసా ఇచ్చే వాళ్లు, ధైర్యం చెప్పి ముందుకు నడిపించే వాళ్లు లేకపోవడంతో, పేరెంట్స్ సరిగా కేర్‌ తీసుకోకపోవడంతో యువత ఎలాంటి రాంగ్‌ వేలోకి వెళ్తున్నారనేది ఈ మూవీ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. 
 

అయితే సినిమాలో సందేశం తాలుకూ క్లారిటీ మిస్‌ అయ్యింది. ఎంచుకున్న కథ బాగుంది. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో కన్‌ఫ్యూజ్‌ అయ్యాడు దర్శకుడు ప్రవీణ్‌ కుమార్‌. సినిమాని చాలా వరకు ఫన్నీగా తీసుకెళ్లాడు. మధ్య మధ్యలో ఫన్నీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సుహాస్‌ పాత్ర, వారి ఫ్రెండ్స్ చేసే చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఫ్లెక్సీ కోసం వాళ్లు పడే ఆరాటం, పోరాటం నవ్వులు పూయించేలా ఉంటుంది. ఊర్లల్లో యువతకి ప్లెక్సీల పిచ్చి ఎక్కువగానే ఉంటుంది. సిటీలో అది మరీ ఎక్కువగా ఉంటుంది. కాలనీల్లో తామేంటో చూపించుకునేందుకు తెగ హడావుడి చేస్తుంటారు. ప్లెక్సీల్లో రాజకీయ నాయకుడితో ఫోటోలు దిగి హంగామా చేస్తుంటారనే విషయాన్ని కళ్లకి కట్టినట్టు చూపించారు. మరోవైపు విరాజ్‌, రుహానీ శర్మ పాత్రల ద్వారా ఈ తరం లవర్స్ స్ట్రగుల్స్ ని చూపించాడు. పెళ్లిళ్ల విషయంలో కులాలకు ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో తమ ప్రేమని ఇంట్లో చెప్పలేక, ప్రేమికులను వదులుకోలేక మధ్యలో వాళ్లు పడే వేదనని ఆవిష్కరించారు. అదే సమయంలో ఇప్పటి తరం ప్రేమికులు ఎంత అడ్వాన్స్ గా ఉన్నారనేది చూపించారు. కార్తీక్‌ రత్నం కథలో టాలెంట్‌ ఉండి, సరైన కెరీర్‌ లేక, సమాజంపై కోపంతో తప్పుడు దారిలో వెళ్లడమనే అంశాలను చూపించాడు దర్శకుడు. 
 

జనరల్‌గా ఇలాంటి కథల్లో ఈ మూడు స్టోరీస్‌కి ఎక్కడో ఓ చోట ముడి పెట్టి, వాహ్‌ అనే ట్విస్ట్ తో ముగింపు పలుకుతారు. కానీ ఈ చిత్రంలో మాత్రం మూడూ.. ముడు వేర్వేరు కథలుగానే చూపించారు. ఆయా మూడు కథల్లో డిఫరెంట్‌ బ్యాక్‌ డ్రాప్‌ లోని యువత పోకడలను తెరపై ఆవిష్కరించారు. అంత వరకు బాగానే ఉంది. కానీ ఎందుకు ఆయా పాత్రలు అలా ప్రవర్తిస్తున్నాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. కార్తీక్‌ రత్నం ఎందుకు తాగుబోతుగా మారాడు, దానికి బలమైన కారణం ఏంటనేది చెప్పలేదు. అది మిస్టరీగానే ఉంటుంది. మరోవైపు విరాజ్‌, రుహానీ పాత్రలు ప్రేమలోని డెప్త్ ని చూపించలేదు. వాళ్లు దేని కోసం బాధపడుతున్నారనేది క్లారిటీ మెయింటేన్‌ చేయలేదు. కాసేపు పీరియడ్ భయం అంటుంది, మరి కాసేపు పెళ్లి సమస్య అంటుంది. ఈ డైలామా ఆమె పాత్రలోనూ ఉంటుంది, అదే కన్ఫ్యూజన్‌ ఆడియెన్స్ కి కలుగుతుంది. అలాగే సుహాస్‌.. ఎందుకు ప్లెక్సీల కోసం అంతగా ఆరాటపడుతున్నాడనేది ఎస్టాబ్లిష్‌ చేయలేదు. అర్థం, పర్థం లేకుండా ప్లెక్సీ కోసం ఆరాటపడటమనేది కన్విన్సింగ్‌గా అనిపించదు. దానికి సరైనా కారణాలు చెప్పలేదు. ఈ పాత్రలకు సంబంధించిన కన్‌క్లూజన్‌లోనూ క్లారిటీ లేదు. పోలీస్‌, కౌన్సిలింగ్‌ ఇచ్చే పాత్రలతో ఆయా డైలాగులు చెప్పించి వదిలేశారు. దీంతో క్లైమాక్స్ తేలిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. 
 

నటీనటులుః
శివ పాత్రలో ఒదిగిపోయాడు సుహాస్‌. బేసిక్‌గా ఇలాంటి పాత్రలకు అతను కొట్టిన పిండిలా తయారయ్యాడు. దీంతో ఈజీగా చేసేశాడు. అతని పాత్ర, అతని కథ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. తను కూడా అంతే బాగా చేశాడు. తన ఫ్రెండ్‌గా రాగ్‌ మయూర్‌కి మంచి పాత్రనే పడింది. బాగా చేశాడు. కార్తీక్ రత్నం తాగుబోతుగా జీవించాడు. ఆయన నాన్న పాత్రలో దేవి ప్రసాద్ కనిపించి మెప్పించాడు. ఇక విరాజ్‌ అశ్విన్‌, రుహానీశర్మలు తమ పాత్రలకు బాగా సూట్‌ కావడమే కాదు, అంతే బాగా చేసి మెప్పించారు. కిరణ్‌, ఇతర పాత్రదారులు సైతం ఓకే అనిపించారు. 

టెక్నీకల్‌గాః 
సినిమాకి మ్యూజిక్‌ బాగుంది. హర్షవర్థన్‌ రామేశ్వర్‌, అజయ్‌ అరసాడ ఆకట్టుకునే మ్యూజిక్‌తోపాటు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకుంది. సీన్లని ఎలివేట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించింది. టీజో టామీ కెమెరా వర్క్ కి వంక పెట్టాల్సిన పనిలేదు. ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉంది. ఎడిటింగ్‌ పరంగా చేయడానికి ఏం లేదు. సినిమా నిడివి కూడా తక్కువే. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు ప్రవీణ్‌ కుమార్‌ ఎంచుకున్న కథ బాగుంది. ఫన్నీగా దాన్ని తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఆ ఫన్‌ వర్కౌట్‌ కాలేదు. మరోవైపు హైలీ ఇంటలీజెంట్‌గా కథని చెప్పాలనుకున్నాడు. అక్కడే దొరికిపోయాడు. ఆడియెన్స్ కి అర్థమయ్యేలా చెప్పడంలో ఫెయిల్‌ అయ్యాడు.  
 

ఫైనల్‌గాః `శ్రీరంగ నీతులు` సందేశంలో క్లారిటీ లేదు. 

రేటింగ్‌ః 2/5

నటీనటులుః సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, కిరణ్‌, రాగ్‌ మయూర్‌, దేవి ప్రసాద్ తదితరులు.

దర్శకుడు ప్రవీణ్‌ కుమార్‌ 
కెమెరాః టీజో టామీ
మ్యూజిక్‌ః హర్షవర్థన్‌ రామేశ్వర్‌, అజయ్‌ అరసాడ
నిర్మాణంః రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ 
నిర్మాతః వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి 

click me!