
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీవిష్ణు. భిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈసారి సామజవరగమన అంటూ ఆడియన్స్ ని పలకరించారు.
కథ:
బాలు(శ్రీవిష్ణు) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. సినిమా థియేటర్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. బాలుకు అతిపెద్ద బాధ్యత ఒకటి ఉంటుంది. తన తండ్రైన ఉమామహేశ్వరరావు(నరేష్) చేత డిగ్రీ పూర్తి చేయించాలి. ఈ వయసులో ఆయన డిగ్రీ చదివి ఉద్దరించేదేం లేదు. అయితే కోటీశ్వరుడైన బాలు తాత ఒక ఫిట్టింగ్ పెట్టిపోతాడు. తన కొడుకు ఉమామహేశ్వరావు డిగ్రీ పాసైతేనే తన ఆస్తి దక్కుతుందని వీలునామా రాస్తారు. గత ముప్పై ఏళ్లుగా ఉమామహేశ్వరావు డిగ్రీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తాత ఆస్తి కోసం తండ్రిని చదివించే బాధ్యత బాలు తీసుకుంటాడు. మరి బాలు ప్రయత్నం సఫలీకృతం అయ్యిందా? ఉమామహేశ్వరరావు డిగ్రీ పాసయ్యాడా? కోట్ల ఆస్తికి వారసుడు అయ్యాడా? అనేది మిగతా కథ..
విశ్లేషణ:
ఇది రొటీన్ కథే... కాకపోతే కొడుకులను తండ్రులు చదివిస్తారు. సామజవరగమన మూవీలో తండ్రిని కొడుకు చదివిస్తాడు. బాధ్యత లేని తండ్రిని చదివించే మిడిల్ క్లాస్ కుర్రాడి పాట్లు కామిక్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. దర్శకుడు రామ్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. సమకాలీన అంశాల ఆధారంగా రాసిన కొన్ని పంచ్ డైలాగ్స్ గొప్పగా పేలాయి. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. దర్శకుడు క్లీన్ కామెడీతో కథను నడిపారు. హాస్యం కోసం డబుల్ మీనింగ్ అడల్ట్ జోక్స్ జోలిపోలేదు. ఫ్యామిలీతో హ్యాపీగా సినిమా చూడొచ్చు.
క్లాస్ రూమ్ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్స్, కథను ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. కామెడీ డైలాగ్స్, సన్నివేశాలు పూర్తి స్థాయిలో తెరపై వర్క్ అవుట్ అయ్యాయి. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కేవలం కామెడీనే కాకుండా అక్కడక్కడా ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. సాంకేతిక విషయాలకు వస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కి పాస్ మార్క్స్ పడ్డాయి.
శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్ మేనరిజంతో మెప్పించారు. బ్రోచేవారెవరురా తర్వాత ఆ స్థాయిలో ఆయన నవ్వించారు. ఇక నరేష్ ఈ చిత్రానికి సెకండ్ హీరో అని చెప్పొచ్చు. అటు కామెడీ ఎటు ఎమోషన్స్ గొప్పగా పండించారు. ఎలాంటి పాత్రైనా తనకు తిరుగులేదని నరేష్ మరోసారి రుజువు చేసుకున్నారు. హీరోయిన్ రెబా మోనికా కథలో ప్రాధాన్యత గల పూర్తి నిడివి గల పాత్ర దక్కించుకుంది. గ్లామర్, రొమాన్స్, కామెడీతో ఆకట్టుకుంది.
కుల శేఖర్ గా వెన్నెల కిషోర్ సినిమాకు ప్లస్ అయ్యాడు. అయితే సామజవరగమన మూవీలో లోపాలు లేకపోలేదు. కథలోనే చిన్న లాజిక్ మిస్ అయ్యింది. కోట్ల ఆస్తి వస్తుంటే డిగ్రీ నిజాయితీగా పూర్తి చేయాలని ఒక వ్యక్తి ఏళ్ల తరబడి ప్రయత్నం చేశాడంటే నమ్మడం కష్టమే. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా హ్యూమన్ సైకాలజీకి విరుద్ధంగా ఉంటుంది. ఇక అక్కడక్కడా సినిమా కొంత సాగతీతకు గురైంది. సన్నివేశాలు రిపీట్ అయిన భావన కలుగుతుంది.
ప్లస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
కామెడీ
లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
లాజిక్ లేని కథ
అక్కడక్కడా సాగతీత సన్నివేశాలు
ఫైనల్ థాట్:
సామజవరగమన పర్ఫెక్ట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్. కామెడీ చిత్రాలు ఇష్టపడేవారికి బెస్ట్ ఛాయిస్. ఆద్యంతం నవ్వులు పూయించే చిత్రం. క్లీన్ కామెడీతో చక్కగా తెరకెక్కించారు. ప్రధాన పాత్రల నటన, కామెడీ సన్నివేశాలు, పంచ్ డైలాగ్స్ అలరిస్తాయి. లాజిక్ లేని కథ, అక్కడక్కడా సాగతీత సన్నివేశాలు మినహాయిస్తే చాలా వరకు సినిమా మెప్పిస్తుంది.
రేటింగ్: 3/5
టైటిల్: సామజవరగమన
నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, వీకే నరేశ్, శ్రీకాంత్, వెన్నెల కిశోర్, సుదర్శన్ తదితరులు
నిర్మాణ సంస్థ:హాస్య మూవీస్
నిర్మాత: రాజేశ్ దండా
సమర్పణ: అనిల్ సుంకర్
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ:రామ్ రెడ్డి
ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్
విడుదల తేది: జూన్ 29, 2023