
గాన గంధర్వుడు ఎస్పీ బాలు తన అద్భుతమైన గాత్రంతో యావత్ భారత శ్రోతలను అలరించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి అనేక భాషల్లోనూ పాటలు పాడి మెప్పించారు.
దాదాపు మూడు, నాలుగు తరాలను ఆయన తన గాత్రంతో అలరించారు. ఇప్పటికీ ఆయన పాటలు ఇప్పటి తరం, రాబోయే తరాన్ని కూడా అలరిస్తూనే ఉన్నాయి.
దాదాపు ఐదున్నదశాబ్దాల పాటలు తన గొంతుతో మాయ చేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం 79వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. హీరోగా ఛాన్స్ ని మిస్ చేసుకున్న విషయం ఏంటో చూద్దాం.
* ఎస్పీబాలు.. సంపమూర్తి - శకుంతల దంపతులకు 1946 జూన్ 4న జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులు. ఆయన చెల్లెలు శైలజ కూడా ఐదు వేలకు పైగా పాటలు పాడారు.
* చిన్నప్పటి నుంచే గాయకుడు కావాలని బాలు కోరిక. కానీ, ఆయన తల్లిదండ్రులు ఇంజనీర్ కావాలని అనుకున్నారు. చివరికి సంగీతమే గెలిచింది. బాలు చేసిన పనికి వాళ్లు ఒప్పుకోక తప్పలేదు.
* ఎస్పీ బాలు తొలినాళ్లలో ఒక సంగీత బృందం నడిపారు. ఆ బృందంలో ఇళయరాజా, గంగా అమరన్ కూడా ఉన్నారు.
* 1979లో వచ్చిన `శంకరాభరణం` సినిమాలోని పాటలన్నీ కర్ణాటక సంగీతాన్ని పోలి ఉన్నాయి. ఎస్పీ బాలు కర్ణాటక సంగీతం నేర్చుకోకపోయినా, `శంకరాభరణం` పాటలు అద్భుతంగా పాడారు. ఈ సినిమాకు ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది.
* రజనీకాంత్, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా సీనియర్లనుంచి, ఆ తర్వాత తరం, మూడో తరం, నాల్గో తరం హీరోలకు కూడా ఆయన పాటలు పాడారు. ఎస్పీబీ పాడిన పాటలు చాలావరకు విజయవంతమయ్యాయి.
* గాయని జానకి ద్వారా ఎస్పీబీకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఓ రకంగా సంగీత ప్రపంచాన్ని ఆయన శాసించారు.
* 1983లో వచ్చిన `సాగరసంగమం` సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా, ఎస్పీబీ పాటలు పాడారు. ఈ సినిమాకు ఇద్దరికీ జాతీయ అవార్డులు వచ్చాయి.
* 1988లో వచ్చిన `రుద్రవీణ` సినిమాకు కూడా వీరిద్దరికీ జాతీయ అవార్డులు వచ్చాయి.
* 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీబీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు.
* ఆరు సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు ఎస్పీ బాలు.
* భారతీరాజా దర్శకత్వం వహించిన `ముతల్ మర్యాదల్` సినిమాలో మొదట హీరోగా ఎస్పీబీని అనుకున్నారు. కానీ, ఆ పాత్ర తనకు సరిపోదని చెప్పి తిరస్కరించారు బాలు. ఆ తర్వాత శివాజీ గణేషన్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రల్లో, కీలక పాత్రల్లో నటించినా, హీరోగా మాత్రం మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు బాలు. ఒకవేళ ఆ మూవీ చేసి ఉంటే హీరోగా బిజీ అయ్యేవారేమో. మనం బాలులోని మరో కోణాన్ని చూసేవాళ్లం.