సౌందర్య తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి. అద్భుతమైన నటనతో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో భాగమయ్యారు. ఆమెతో కలిసి సినిమాలు చేసిన అనుభవం తనకు ప్రత్యేకమని నటుడు సురేష్ గుర్తుచేసుకున్నారు. తాను అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్న సమయంలోనే సౌందర్య స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు.
ఇద్దరి వయసులో పెద్దగా తేడా లేకపోవడంతో పరిచయం త్వరగానే స్నేహంగా మారిందని వివరించారు.సౌందర్య ఎప్పుడూ సురేష్ ను అన్నయ్య అని పిలిచేవారట. ఇద్దరి మధ్య చనువు పెరిగిన తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారట. వ్యక్తిగత విషయాలు, సందేహాలు కూడా ఒకరితో ఒకరు షేర్ చేసుకునేవారట. తమ బంధం కేవలం సినిమా షూటింగులకే పరిమితం కాలేదని, కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని సురేష్ గుర్తుచేసుకున్నారు.
సౌందర్య కుటుంబంతో ప్రత్యేక అనుబంధం
సౌందర్య సోదరుడు అమర్నాథ్తో తనకు ముందుగానే పరిచయం ఉందని సురేష్ వెల్లడించారు. ఆయనతో మంచి స్నేహం ఉండటంతో సౌందర్య కుటుంబానికి మరింత దగ్గరయ్యానని అన్నారు. ముఖ్యంగా తమిళ సినిమా షూటింగుల కోసం వెళ్లినప్పుడు వారి ఇంట్లోనే సురేష్ ఉండేవారట.
సౌందర్య స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ఆమెతో తనకున్న స్నేహంలో ఎలాంటి దూరం ఉండేది కాదట. సురేష్ పెళ్లికి కూడా సౌందర్య తన్ ఫ్యామిలీతో సహా వెళ్లారట. ఇక ఆయన భార్యతో కూడా సౌందర్య ఎంతో ఆప్యాయంగా ఉండేవారని సురేష్ చెప్పారు. సినిమా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకునేవారని వివరించారు. తన వివాహానికి సౌందర్య స్వయంగా హాజరుకావడం ఇప్పటికీ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని అన్నారు.