Soundarya
అలనాటి అందాల తార సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందని అందరికీ తెలిసిందే. అయితే ఆమె మరణం వెనకాల పెద్ద మిస్టరీ దాగి ఉందని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం.. 20 ఏళ్ళ క్రితం చనిపోయిన హీరోయిన్ సౌందర్య మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉందంటూ ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామం ఏదులాపురం గ్రామపంచాయతీకి చెందిన ఎదురుగట్ల చిట్టిమళ్లు అనే వ్యక్తి తాజాగా ఖమ్మం కలెక్టర్‌కు, ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే. దీంతో ఇన్నేళ్ల తర్వాత మరోసారి సౌందర్య మరణానికి సంబంధించి అంశం తెరపైకి వచ్చింది.
Soundarya
సౌందర్య భర్త ఏమన్నారంటే.?
సౌందర్య మరణం వెనక నటుడు మోహన్ బాబు హస్తం ఉందని వస్తున్న ఆరోపణలకు.. ఆమె భర్త రఘు స్పందించారు. మోహన్‌బాబుతో తమకెలాంటి ఆస్తిగొడవలు లేవని, సౌందర్య మరణం ప్రమాదవశాత్తూ జరిగింది కాదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ విషయమై సౌందర్య భర్త రఘు బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘‘హైదరాబాద్‌లోని సౌందర్య ఆస్తికి సంబంధించి కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది.
ఆమె ఆస్తిని నటుడు మోహన్‌బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. ఆయనతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు. వారి కుటుంబంతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. నేను మోహన్‌బాబును ఎంతో గౌరవిస్తా. మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాం. మాకెలాంటి ఆస్తి గొడవలు లేవు' అంటూ పేర్కొన్నారు.
సౌందర్య మరణించిన రోజు ఏం జరిగింది.?
సౌందర్య వివాహం రఘు అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో 2003లో జరిగింది. అయితే సౌందర్య రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ బీజేపీకి మద్ధతురాలిగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే పలువురు బీజేపీ నాయకుల ఆహ్వానం మేరకు ప్రచారాలకు హాజరయ్యేవారు. ఇందులో భాగంగానే 2004లో విద్యాసాగర్‌రావు ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుంచి కరీంనగర్‌కు సౌందర్య హెలికాప్టర్‌లో బయలుదేరారు.
2004 ఏప్రిల్ 17వ తేదీన మధ్యాహ్నం 1.1 గంటలకు బెంగళూరురు నుంచి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ హెలికాఫ్టర్‌ను కొద్దిగా ఎడమ వైపు తిప్పాడు. అంతే..ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాఫ్టర్‌లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలి పోయింది.
మంటలు వ్యాపించడంతో హెలికాప్టర్‌లో సౌందర్యతో పాటు మిగతా వారంతా సజీవ దహనం అయ్యారు. ఆ సమయంలో సౌందర్య గర్భంతో ఉండడం అత్యంత విషాదకరైన విషయం. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎవరి శరీర భాగాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీనిబట్టే ప్రమాద తీవ్ర ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సౌందర్య మరణానికి సంబంధించి మరోసారి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే సౌందర్య మరణం వెనక ఎలాంటి కుట్ర కోణం లేదనే అభప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.