రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మురళీ మోహన్ శోభన్ బాబు పెట్టుబడి వ్యూహాలను, తన జీవితంలో వాటి ప్రభావాల గురించి వివరించారు. మురళీ మోహన్ కెరీర్ బిగినింగ్ డేస్ గురించి గుర్తు చేసుకుంటూ, తాను ఒక సినిమాకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్న సమయంలోనే చెన్నైలోని టి.నగర్లో 50,000తో 11,000 చదరపు అడుగుల ఇంటిని కొనుగోలు చేశానని చెప్పారు. ఆ ఇల్లు ప్రస్తుతం 50 కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తుందని తెలిపారు. అప్పటి నుంచే తాను “డబ్బును డబ్బు సంపాదించే విధంగా చేయాలి తప్ప, ఖర్చు పెట్టకూడదు” అనే సూత్రాన్ని నమ్మానని, ఇదే ఐడియాలజీ శోభన్ బాబుదని పేర్కొన్నారు.
శోభన్ బాబు ఎప్పుడూ లగ్జరీలకు పోకుండా, అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టేవారని మురళీ మోహన్ అన్నారు. ఆయన సాధారణంగా తెల్ల బట్టలనే ధరించేవారని, డబ్బును బీరువలో దాచుకకోకుండా భూముల మీద పెట్టుబడిగా పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నైకి దగ్గరలో ఎకరం 500 రూపాయలకు కొని వదిలేసేవారని, 20 సంవత్సరాల తర్వాత ఆ భూమి విలువ ఎకరాకు 5 కోట్లలకు పెరిగిందని మురళీ మోహన్ చెప్పారు.
సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేయకుండా, భవిష్యత్తు కోసం ఎలా పొదుపు చేయాలో శోభన్ బాబు అందరికంటే ముందే గ్రహించారు. "సంపాదన ఎంత అన్నది ముఖ్యం కాదు, దానిని ఎలా మదుపు చేస్తున్నామన్నదే ముఖ్యం" అనే సూత్రాన్ని శోభన్ బాబు కచ్చితంగా పాటించారు. మనుషులు ఎంతగా పెరిగినా ఈ భూమి మాత్రం పెరగదని, అందుకే భూముల్లో చేసే పెట్టుబడులు ఎప్పటికీ నష్టపోవని శోభన్ బాబు గట్టిగా నమ్మేవారు. హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఆయన చేసిన వ్యూహాత్మక భూముల కొనుగోళ్లు ఆయనను అపారమైన సంపన్నుడిని చేశాయి.