చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోంది అంటూ చాలా కాలంగా టాలీవుడ్ లో చర్చ జరుగుతూనే ఉంది. కానీ చిన్న చిత్రాలు అయినప్పటికీ మంచి కంటెంట్ తో వస్తే ఆదరణ ఉంటుంది అని చాలా మంది ఫిలిం మేకర్స్ చెబుతుంటారు. ఆ విధంగా చిన్న చిత్రాలుగా విడుదలై సంచలనం సృష్టించిన మూవీస్ చాలా ఉన్నాయి. పెద్ద హీరోల చిత్రాలు విడుదలైనప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమే.
కానీ కంటెంట్ బావుండి, మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే సాలిడ్ లాంగ్ రన్ ఉంటుంది. అందుకు చక్కటి ఉదాహరణ హనుమాన్ మూవీ. చిన్న చిత్రం గా విడుదలైన హను మాన్ పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. గతంలో ఒక చిన్న చిత్రం ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మూవీకి పోటీగా విడుదలై ఆరు నంది అవార్డులు కొల్లగొట్టింది. ఆ మూవీ మరేదో కాదు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనంద్ మూవీ.
ఆ చిత్రం విడుదలయ్యే సమయానికి శేఖర్ కమ్ములకి, హీరో రాజా, హీరోయిన్ కమలినీ ముఖర్జీకి ఏమాత్రం క్రేజ్ లేదు. అసలు వాళ్లెవరో కూడా ఆడియన్స్ కి తెలియదు. 2004లో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రం అక్టోబర్ 15న విడుదలయింది. అదే రోజున ఆనంద్ మూవీని కూడా పరిమిత థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఒక వైపు చిరంజీవి మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
అయినప్పటికీ ఆనంద్ చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. రోజు రోజుకి ఆనంద్ మూవీ టాక్ పెరుగుతూ సూపర్ హిట్ గా నిలిచింది. శేఖర్ కమ్ముల ఫ్యామిలిలో ఆడియన్స్ కి, యువతకి నచ్చేలా ఇచ్చిన కొత్త స్టైల్ ఫిలిం మేకింగ్ కి ప్రశంసలు దక్కాయి. శేఖర్ కమ్ముల ఈ కథని పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నారట. కానీ ఆయన్ని కలవడం కుదరకపోవడంతో రాజా, కమలినీ ముఖర్జీలతో ఫినిష్ చేశారు. ఈ చిత్రం ఏకంగా ఆరు నంది అవార్డులు సొంతం చేసుకుంది. అప్పట్లో ఇది సంచలనం అనే చెప్పాలి.
బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, ఉత్తమ నటి కమలిని ముఖర్జీ, ఉత్తమ సహాయ నటి -సత్య కృష్ణన్ , ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - సునీత ఇలా మొత్తం 6 విభాగాల్లో ఆనంద్ చిత్రం నంది అవార్డులు అందుకుంది.