Silk Smitha: మద్రాసు పట్టణంలో ఆమె అడుగు అలా పడింది... దేశాన్ని ఓ ఊపు ఊపింది!

First Published | Dec 2, 2021, 3:00 PM IST


నమ్మలేని విషయం ఎవరైనా చెప్పినప్పుడు... బాబు ఇదేమైనా సినిమానా నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అని ప్రశ్నిస్తాము. కాని సినిమాలకు స్ఫూర్తి నిజ జీవితాలే. దర్శకుల ఊహకు అందని అనేక మలుపులు జీవితాలలో చోటు చేసుకుంటాయి. ఓ సినిమాకు మించిన నాటకీయత సిల్క్ స్మిత జీవితంలో చోటు చేసుకుంది. 
 

ఏలూరు జిల్లాలోని కొవ్వాలి అనే మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో సిల్క్ స్మిత (Silksmitha)జన్మించారు. పేరెంట్స్ కి చదివించే స్థోమత లేదు. నాలుగో తరగతితో చదువు ముగిసింది. కూతురు భారం అని భావించిన తల్లితండ్రులు బాల్యం ముగియక ముందే వివాహం చేశారు. 

స్కూల్ కి వెళ్లాల్సిన వయసులో సంసారం, బాధ్యతలు. భర్తతో పాటు అత్తింటి వాళ్ళ వేధింపులు. చిన్న వయసులోనే అంతులేని కష్టాలు. జీవితం అంటే విసుగు, విరక్తి వచ్చేసింది. కనికరం లేని మనుషుల మధ్య ఉండలేక మొండిగా ముందుకు వెళ్ళింది. ఎవరికీ కనబడకుండా... మద్రాసు ట్రైన్ ఎక్కి పారిపోయింది. 

Latest Videos



మద్రాసు నగరంలో ఒంటరిగా అడుగుపెట్టింది. ఏదో విధంగా బ్రతకాలి అన్న ఆశలు తప్ప చేతిలో చిల్లి గవ్వలేదు. బాష రాదు, అక్కున చేర్చుకునే, ఆదరించే మనిషి ఒక్కరు లేరు. చావో బ్రతుకే ఇక్కడే జరిగిపోవాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఎలాగోలా తన తెలివితేటలతో ఓ ఆర్టిస్ట్ వద్ద టచప్ అసిస్టెంట్ గా చేరింది. 


మెల్లగా పరిశ్రమలో పరిచయాలు పెరిగాయి. నటిగా వెండితెరపై కనిపించే అవకాశం దక్కింది. మొదట్లో గుర్తింపు లేని చిన్న చిన్న పాత్రలు చేసింది. 1980లో విడుదలైన మలయాళ చిత్రం సరస్వతీయామం మూవీతో ఆమెకు బ్రేక్ దక్కింది. 

డాన్స్, నటనలో శిక్షణ తీసుకుంది. మత్తు కళ్ళ అందాలతో శృంగార తార ఇమేజ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ...ఇలా భాషలు, ప్రాంతాలలో సంబంధం లేకుండా ఏడాదికి 20 నుండి ముప్పై సినిమాలో నటించేవారు. 

అనుకోకుండా సినిమా అవకాశం దక్కించుకొని, సినిమాలకు అవసరమైన డాన్స్,నటన, భాష, చదువు నేర్చుకుంది. ఇంతటి నాటకీయ పరిణామాలు సిల్క్ జీవితంలో ఉన్నాయి.

లోక జ్ఞానం కూడా తెలియని పల్లెటూరి విజయలక్ష్మి సిల్క్ స్మితగా ఇండియాను తన అందచందాలతో ఊపేసింది. దాదాపు 15ఏళ్ల పాటు సిల్క్ స్మిత నట ప్రస్థానం కొనసాగింది. ఒక్క శృంగార పాత్రలే కాకుండా హీరోయిన్, విలన్, కామెడీ, క్యారెక్టర్ రోల్స్  చేశారు. ఒకప్పుడు కనీసం తినడానికి తిండి కూడా లేని విజయలక్ష్మి లక్షలు సంపాదించింది. చెన్నైలో సొంత ఇల్లు, కారు వంటి విలాసాలు దక్కాయి. 

సిల్క్ స్మిత చాలా తక్కువ మందితో స్నేహం చేసేవారు. చేతినిండా సినిమాలతో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా.. సిల్క్ స్మితకు వచ్చిన బాధేమిటో ఎవరికీ తెలియదు. ఆమె 1996 సెప్టెంబర్ 23న బలవన్మరణానికి పాల్పడ్డారు. మానసిక ఒత్తిడికి గురైన సిల్క్ స్మిత ఉరివేసుకుని తన నివాసంలో మరణించారు. 

1960 డిసెంబర్ 2న జన్మించిన సిల్క్ స్మిత 61వ జయంతి నేడు. ఓ సామాన్య యువతి చెన్నై నగరానికి పారిపోయి... ఎవరి సప్పోర్ట్ లేకుండా అంత పెద్ద స్టార్ కావడం అనేది, మనం సినిమాల్లో మాత్రమే చూడగలం. అంతకు మించిన నాటకీయత సిల్క్ జీవితంలో చోటుచేసుకుంది. కమల్ హాసన్, రజినీకాంత్ (Rajinikanth), చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), మోహన్ లాల్ వంటి స్టార్స్ తో సిల్క్ స్మిత ఆడిపాడారు. 

Also read బాలయ్య ‘అఖండ’రివ్యూ

click me!