
మహానటి సావిత్రి మనకు దూరమై 44ఏళ్లు అవుతుంది. కానీ సావిత్రి ఇప్పటికీ మనల్ని తన సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఆమెకి సంబంధించిన చర్చ ఏదో రూపంలో జరుగుతూనే ఉంది. ఎవర్ గ్రీన్ నటిగా ఓ వెలుగు వెలిగింది సావిత్రి. హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కానీ కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంది. అప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ధీటుగా నటించి మెప్పించింది. సావిత్రితో సీన్ అంటే ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు కూడా సీన్ పేపర్ ముందుగానే చూసుకునేవారట. ఆమెతో పోటీ పడటం కోసం ఆరాటపడేవారట. అదే సమయంలో భయపడేవారట.
అంతటి గొప్ప నటిగా రాణించి వెలిగిన సావిత్రి జీవితం విషాదంగా ముగిసిన విషయం తెలిసింది. మందుకు బానిసై కోమాలోకి వెళ్లి చాలా దారుణమైన స్థితిలో ఆమె కన్నుమూశారు. అద్దాల మేడలో బంగారు అభరణాలతో, వెండి వైడుర్యాలతో వెలిగిన ఆమె రేకుల షెడ్డులో చివరి రోజులను గడిపే పరిస్థితి వచ్చింది. వేల కోట్లు సంపాదించిన సావిత్రి చివరికి ఏమీ లేకుండా పోయింది. కానీ ఆమె ఆస్తులను ఇప్పుడు ఆమె వారసులు అనుభవిస్తున్నారు. వాటి విలువ వందల, వేల కోట్లు ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే సావిత్రి లైఫ్ నాశనం కావడానికి అంతా అనుకునేది భర్త జెమినీ గణేషన్ మోసం చేయడమే అనుకుంటారు. ఆయన తనని కాదని మరో అమ్మాయితో తిరగడాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని చెబుతుంటారు. దీని కారణంగానే మందుకు బానిసైందని టాక్ నడుస్తోంది. దీనికితోడు సావిత్రి కొన్ని సినిమాల దర్శకత్వం వహించింది. నిర్మించింది. వాటి ద్వారా చాలా నష్టంపోయింది. కొందరు మోసం చేశారు. డబ్బులు తీసుకున్న వారు మోసం చేశారు. సినిమాల్లో సంపాదించినది తన బంధువుల పేరుతో భూములు కొట్టే వాళ్లు మోసం చేశారు. ఇలా ప్రతి దశలో మోసానికి గురయ్యంది సావిత్రి. ఆమె మంచితనం, ఆమాయకత్వమే ఈ మోసానికి కారణమంటుంటారు.
ఇదిలా ఉంటే భర్త జెమినీ గణేషన్‌తో గొడవల సమయంలోనే తమిళనాడులోని ఓ రాజకీయ నాయకుడు ఆమెపై మోజుపడ్డాడని సావిత్రి వద్ద పనిచేసిన ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన సంచలన నిజాలను వెల్లడించారు. జెమినీ గణేషన్.. సావిత్రిని మూడో భార్యగా చేసుకున్నాడట. అప్పటికే ఆయనకు అలిమేలు, పుష్పవల్లి ఉన్నారని, మొదట ఆ విషయం సావిత్రికి తెలియదని, ఆ తర్వాత తెలిసినా ఏం చేయలేకపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా సావిత్రి లైఫ్ డిస్టర్బ్ కావడానికి జెమినీ గణేషన్ మాత్రమే కాదు, మరో రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడని తెలిపారు. జెమినీ గణేషన్‌తో గొడవ అనంతరం ఒంటరిగానే ఒంటరిగానే ఉంది. ఆ సమయంలోనే ఓ పొలిటీషియన్ ఆమెపై కన్నేశాడట. తనని లోబరుచుకోవాలని చూశాడట. అందుకు సావిత్రి నో చెప్పిందట. దీంతో ఆమెపై కక్ష్య కట్టాడని, అందువల్లే ఐటీ రైడ్స్ చేయించాడని తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ రామారావు.
ఓ వైపు భర్త మోసం, మరోవైపు ఈ ఐటీ రైడ్స్ తో ఉక్కిరిబిక్కిరయ్యింది సావిత్రి. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడింది. ఆ డిప్రెషన్‌లోనే మందుకి బానిసైందని ఆయన తెలిపారు. అయితే వీరిద్దరే కాదు, మరో అజ్ఞాత వ్యక్తి కూడా సావిత్రి జీవితంలో ఉన్నాడట. మలయాళ కెమెరామెన్ శేఖర్ అనే వ్యక్తి కూడా సావిత్రి జీవితం తలక్రిందులు కావడానికి కారణమట. ఈ విషయాన్ని వింజమూరి వెంకట అప్పారావు అనే వ్యక్తి తన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చారు.
``సావిత్రి దుస్థితికి కారణం జెమినీ గణేశన్ అని చాల మందికి ఒక అపోహ, అది కాకుండా ఆవిడా చనిపోయేటప్పుడు జెమిని పక్కనే ఉన్నాడు. పెద్ద కూతురు కూడా ఉంది. సావిత్రి తాగుడు కు బానిస కావడం వల్ల ఆమె ఆ స్థితికి దిగజారిపోయింది. ఆర్థికంగా దెబ్బతినడం అన్నది కూడా నిజం. సినిమాలు సొంతంగా దర్శకత్వంతోపాటు దానికి కారణం ఇంకో వ్యక్తి(శేఖర్ కెమరామెన్ ..మలయాళీ )అన్న సంగతి అప్పటి విలేకరులకు తెలుసు`` అని వెల్లడించారు. మరి ఆ శేఖర్ అనే వ్యక్తి ఏం చేశాడు? ఎలా మోసం చేశాడనేది తెలియాల్సి ఉంది. నేడు శనివారం(డిసెంబర్ 6) సావిత్రి 90వ జయంతి. ఈ సందర్భంగా ఈ అరుదైన విషయం బయటకు వచ్చింది. అయితే సావిత్రమ్మ 90వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో వేడుకలను నిర్వహిస్తున్నారు ఆమె కూతురు విజయ చాముండేశ్వరి. ఈ సందర్భంగా `మహానటి` సినిమాని తీసిన దర్శక, నిర్మాతలను ఆమె సత్కరించబోతున్నారు.