సంక్రాంతి 2025కి పెరుగుతున్న పోటీ.. ఎవరెవరు బరిలో ఉన్నారో తెలుసా?.. ఆ ఇద్దరి మధ్య పోటీనే అసలు మజా!

First Published Apr 10, 2024, 3:51 PM IST

వచ్చే సంక్రాంతికి పోటీ ఇప్పట్నుంచే నెలకొంది. ఈ సారి సీనియర్లంతా బరిలోకి దిగుతున్నారు. పండగని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. కానీ ఆ ఇద్దరి మధ్య పోటీ నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. 
 

  పండగలకు సినిమాల పోటీ ఉంటుంది. రెండు మూడు సినిమాలుంటేనే అసలు మజా. అన్ని సినిమాలు ఆడేందుకు స్కోప్ ఉంటుంది. ఆడియెన్స్ ఆ మూడ్ లో ఉంటారు. బాగున్న సినిమాలను కచ్చితంగా చూస్తారు. పండగల అన్నింటిలో సంక్రాంతి చాలా స్పెషల్‌. ఆ సమయంలో అంతా రిలాక్స్ అయ్యే టైమ్‌. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే ప్రజలంతా ఫ్రీ అవుతారు. పంటలు చేతికొచ్చి ఆనందంతో ఉంటారు. సినిమాలకు ప్రయారిటీ ఇస్తారు. అందుకే సంక్రాంతికి అయ్యే సినిమా బిజినెస్ ఎప్పుడూ కాదు. అందుకే ఈ పండక్కి సినిమాల పోటీ ఎక్కువగా ఉంటుంది. 

ఈ ఏడాది ఎంతగా పోటీ పడ్డారో తెలిసిందే. పెద్ద గొడవలు అయ్యే పరిస్థితి వచ్చింది. వాటిలో బాగున్న సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. దీంతో ఇప్పుడు వచ్చే సంక్రాంతికి పోటీ షురూ అయ్యింది. 2025 సంక్రాంతికి ఇప్పట్నుంచే కట్చీఫ్‌ వేసి పెడుతున్నారు మేకర్స్. దీంతో క్రమంగా పోటీ పెరుగుతుంది.ఈ సంక్రాంతిని మించిన పోటీ ఇప్పుడే నెలకొంది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతుంది. 
 

వచ్చే సంక్రాంతి పోటీలో మెగాస్టార్‌ ఉన్నారు. ఆయన సినిమాని ప్రారంభించిన సమయంలోనే వచ్చే సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో ఐదుగురు హీరోయిన్లు చిరుకి చెల్లిగా నటిస్తున్నారు. ఇలా భారీ కాస్టింగ్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది.యూవీ క్రియేసన్స్ నిర్మిస్తుంది. ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న ప్రాపర్‌ పాన్‌ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం.
 

చిరంజీవితోపాటు సీనియర్లు అందరూ సంక్రాంతిలో బరిలో నిలవడం మస్త్ మజా అనిపిస్తుంది. బాలయ్య కూడా ఈ పోటీలోనే ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. `వీరమాస్‌` అనే టైటిల్‌ వినిపిస్తుంది. ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో వస్తుందని భావించారు. కానీ ప్రస్తుతం టీమ్‌ ఆలోచన మాత్రం వచ్చే సంక్రాంతికి బరిలో దించాలనుకుంటున్నారట. సినిమా షూటింగ్‌ డిలే అవుతున్న నేపథ్యంలో సంక్రాంతిని టార్గెట్‌ చేశారట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇందులో బాబీ డియోల్‌, దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. 
 

మరోవైపు నాగార్జున కూడా సంక్రాంతి బరిలో ఉన్నారు. ఈ సంక్రాంతికి `నా సామిరంగ` చిత్రంతో హిట్‌ కొట్టాడు నాగ్‌. ఆ సక్సెస్ మీట్‌లోనే వచ్చే సంక్రాంతికి కలుద్దామని తెలిపారు. ఆయన `బంగార్రాజు 3`తో రాబోతున్నారట. దీంతోపాటు ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయాలనుకుంటున్నారు. మరి అది `బంగార్రాజు3`నేనా, లేక వేరే సినిమానా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా దీనిపై క్లారిటీ లేదు. కానీ ఈ మూవీని వచ్చే సంక్రాంతికే విడుదల చేయాలనుకుంటున్నారు నాగ్‌. 
 

ఇంకోవైపు మరో సీనియర్‌ హీరో వెంకీ కూడా సంక్రాంతికే వస్తానని ప్రకటించారు. ఈ సంక్రాంతికి ఉగాది సందర్భంగా వెంకటేష్‌ కొత్త మూవీని ప్రకటించారు. అనిల్‌ రావిపూడితో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు. `ఎఫ్‌2`, `ఎఫ్‌3` చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చి విజయాలు సాధించాయి. అందులో వరుణ్‌ తేజ్‌ మరో హీరో. కానీ ఇప్పుడు వెంకీ సింగిల్‌ హీరోగా అనిల్‌ రావిపూడి ఈ ఎంటర్‌టైనింగ్‌ మూవీని చేస్తున్నారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 
 

అంతేకాదు మాస్‌ మహారాజా రవితేజ కూడా సంక్రాంతిని టార్గెట్‌ చేశాడు. ఈ సంక్రాంతికి ఆయన `ఈగల్‌` చిత్రంతో రావాలనుకున్నారు. కానీ ఎక్కువ సినిమాల పోటీ కారణంగా తన మూవీని వాయిదా వేసుకుని ఫిబ్రవరిలో వచ్చాడు రవితేజ. కానీ ఇప్పుడు మాత్రం తగ్గేదెలే అంటున్నారు. సంక్రాంతికి దావత్‌ కి రెడీ అవ్వండి అంటూ ఉగాది సందర్భంగానే కొత్త దర్శకుడితో సినిమాని ప్రకటించారు. భాను అనే కుర్రాడిని దర్శకుడిని చేస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతుంది. రవితేజ పాత్ర తీరుతెన్నులను కూడా వెల్లడించారు. 
 

మరోవైపు `శతమానం భవతి`సినిమాకి సీక్వెల్‌ని ప్రకటించారు దిల్‌ రాజు. వచ్చే సంక్రాంతికే ఈ మూవీ రాబోతుందని తెలిపారు. ఈ మూవీలో ఆశిష్‌ హీరోగా నటిస్తారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని కూడా పొంగల్‌కే రిలీజ్‌ చేస్తానని దిల్‌ రాజు ప్రకటించడం విశేషం. ఇలా ఏకంగా ఆరు సినిమాలు వచ్చే సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. ఇందులో ఎన్ని ఉంటాయి, ఎన్ని తప్పుకుంటాయనేది చూడాలి. కానీ వరుసగా రిలీజ్‌ డేట్ ప్రకటిస్తూ షాకిస్తున్నారు మేకర్స్. 
 

సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా.. అసలు పోటీ మాత్రం ఆ ఇద్దరు సీనియర్ల మధ్యే అని చెప్పొచ్చు. అదే చిరంజీవి, బాలయ్య. ఈ ఇద్దరి మధ్య పోటీనే రసవత్తరంగా ఉంటుంది. ఎంత మంది హీరోల సినిమాలున్నా, ఈ ఇద్దరు పోటీ పడితే ఉండే రంజు వేరే లెవల్‌. వచ్చే గత సంక్రాంతికి అలాంటి పోటీనే నెలకొంది. `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` పోటీ పడ్డాయి. రెండూ ఆడాయి. అంతకు ముందు `ఖైదీ నెంబర్‌ 150`, `గౌతమిపుత్ర శాతకర్ణి` పోటీ పడ్డాయి, రెండూ బాగానే ఆడాయి. పాత రోజుల్లోనూ ఈ ఇద్దరి మధ్య ఇలాంటి పోటీనే ఉండేది. ఆడియెన్స్ కి,ఫ్యాన్స్ కి మస్త్ మజా ఉండేది. ఇప్పుడు మరోసారి ఆ మజాని తీసుకురాబోతున్నారు. మరి వీరిలో విజయం ఎవరిదో చూడాలి. 

click me!