Sammathame Review: `సమ్మతమే` మూవీ రివ్యూ.. రేటింగ్‌..

First Published | Jun 24, 2022, 1:04 PM IST

కిరణ్‌ అబ్బవరం, చాందిని చౌదరి కలిసి నటించిన `సమ్మతమే` చిత్రం శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

sammathame movie review,

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇప్పుడు రైజింగ్‌ హీరో. ‘రాజ వారు రాణి వారు’, ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’తో సక్సెస్ ను అందుకున్నాడు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా ముద్ర వేసుకున్నాడు. చివరిగా ‘సెబాస్టియన్ పీసీ 524’తో  నిరాశ పరిచిన ఆయన ఇప్పుడు `సమ్మతమే` చిత్రంతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని (Chandini) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర అద్భుతమైన ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కే ప్రవీణ నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. శుక్రవారం ఏడుసినిమాల మధ్యలో విడుదలైన `సమ్మతమే` ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

sammathame movie review,

కథః 
కృష్ణ(కిరణ్‌ అబ్బవరం)తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. తల్లిలోటు లేని లోటు ఇంట్లో స్పష్టంగా కనిపించడంతో తనకు పెళ్లిచేయమంటాడు. అది విని షాకైన నాన్న.. నువ్వు జాబ్‌ చేసి, డబ్బు సంపాదించి ప్రయోజకుడివి అయ్యాక పెళ్లి చేస్తానంటాడు. తండ్రి మాట మేరకు కష్టపడి ఓ సాఫ్ట్ వేర్‌గా సెట్‌ అవుతాడు. హైదరాబాద్‌లో ఇళ్లు కూడా కట్టుకుంటుంటాడు. ఇక మిగిలింది పెళ్లి. తాను ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాకుండా పెళ్లి చేసుకొని ప్రేమించాలనుకుంటాడు. పద్ధతైన అమ్మాయి, అబద్దాలు చెప్పని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకోసం పెళ్లి చూపులకు వెళ్తాడు. అంతకు ముందే ఓ ఫంక్షన్‌లో ఊహించని విధంగా శాన్వి(చాందిని చౌదరి)అనే అమ్మాయి తనని పరిచయం చేసుకుని బాయ్‌ ఫ్రెండ్‌ అని చెప్పి షాకిస్తుంది. ఆ షాక్‌లో ఉన్న అతను నెక్ట్స్‌ డే పెళ్లి చూపులకు ఆ అమ్మాయి ఇంటికే వెళ్తాడు. దీంతో తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడతాడు. కానీ ఆమె కి అప్పటికే లవ్‌ బ్రేకప్‌ అయ్యిందని తెలిసి రిజెక్ట్ చేస్తాడు. ఇలా 20 పెళ్ళి చూపులకు వెళ్లినా ఇలాంటి అనుభవాలే ఎదురవుతుంటాయి. కానీ ఏ అమ్మాయిని చూసినా శాన్వినే చూసినట్టు అనిపిస్తుంది. దీంతో శాన్వి ప్రేమలో పడినట్టు నిర్ణయించుకున్న కృష్ణ ఆమెని ప్రేమిస్తూ దగ్గరవుతాడు. ఇద్దరు కలిసి తిరుగుతారు. కానీ శాన్వి సిటీ కల్చర్‌ కృష్ణకి నచ్చదు, ఆమెకి చెప్పేందుకు ప్రయత్నించినా ఆమె పట్టించుకోదు. మరి తన భావాలను ఆమెకి ఎలా చెప్పాడు, ఆమె అతని లవ్‌ని అంగీకరించిందా? అతని కోసం మారిందా? ఆమె కోసం అతను మారాడా? వీరి ప్రేమ కథ ఏ తీరం చేరింది, ఇంతకి ఎవరికి `సమ్మతమే` అనేది మిగిలిన సినిమా. 
 


sammathame movie review,

విశ్లేషణః
మోడ్రన్‌ కల్చర్‌, నేటి సమాజంలో యువత ఎలా ఉంది, అమ్మాయి ఎలా ఉన్నారనే చిన్న పాయింట్‌ మీద సాగే చిత్రమిది. దాన్ని రెండు గంటలు లాగడమే ఈ సినిమాలో చేసిన సాహసం. నిజానికి ఇదొక ఓటీటీ ఫిల్మ్. ఓటీటీలో సింగిల్‌ పాయింట్‌కి కథనం అల్లి సినిమాలుగా తీస్తుంటారు. `సమ్మతమే` కూడా అలాంటి కంటెంట్‌ చిత్రమే. అమ్మాయిలు ఎలా ఉంటున్నారనేది, వారికి తగ్గట్టుగా అబ్బాయిలు మారాలనేది, ఒకరినొకరు ఆలోచనలు, ఇష్టాలను గౌరవిస్తూ ముందుకు సాగాలనే చెప్పే ప్రయత్నం చేశారు హీరో కిరణ్‌ అబ్బవరం, దర్శకుడు గోపీనాథ్‌. కానీ సింగిల్‌ పాయింట్‌ని రెండుగంటల పది నిమిషాలు చెప్పడంతో ఆడియెన్స్‌ కి బోర్‌ ఫీలింగ్‌నిస్తుంది. ఇలాంటి చిత్రాలను చాలా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పొచ్చు. కానీ అదే మిస్‌ అయ్యింది. ఫస్టాఫ్‌ అక్కడక్కడ కాస్త నవ్వించినా ఆసాంతం బోరింగ్‌గా సాగుతుంది. ఆడియెన్స్ సాహనానికి పరీక్ష పెడుతుంది. బలమైన కథ లేకపోవడం, బలమైన కాన్‌ఫ్లిక్ట్స్ లేకపోవడం సినిమాకి మైనస్‌.

sammathame movie review,

హీరో లోలోపలు గునుగునే డైలాగులు విసుగు పుట్టిస్తుంటాయి. హీరో ఆ అమ్మాయి కోసం తప్పించే సన్నివేశాలు, ఆమెకి ఏదో చెప్పే సన్నివేశాలు సినిమాలో హీరోయిన్‌కి చిరాకు తెప్పించినట్టుగానే, థియేటర్‌లో ఆడియెన్స్ కి విసుగు పుట్టిస్తాయి. కథ కొత్తగా లేకపోవడం, స్లో నరేష్‌, బోర్‌ ఫీల్‌ అయ్యేలా చేస్తాయి. ఇలాంటివి చాలానే చూశామనే ఫీలింగ్‌ ఆడియెన్స్ కి కలుగుతుంది. మధ్య మధ్యలో అడపాదడపా వచ్చే కామెడీ సీన్లు కాస్త ఊరటనిచ్చే అంశాలుగా చెప్పొచ్చు. ఫస్టాఫ్‌ సరదాగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ ఎంటర్‌టైన్‌ పండలేదు. సెకండాఫ్‌ని ఎమోషనల్‌గా చెప్పాలనుకున్నారు, కానీ ఇలాంటి లవ్‌ స్టోరీస్‌కి పండాల్సిన ఎమోషన్స్ పండలేదు. దీంతో బోర్‌ తెప్పిస్తుంటాయి. చివరికి అమ్మాయిలు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలని చెప్పడం, వారి ఇష్టాలను, ఆలోచనలను గౌరవించాలని చెప్పడం అందరికి ఆమోదయోగ్యం కాదనేది నిజం. రూరల్‌స్థాయిలో కనెక్ట్ అవదు.
 

sammathame movie review,


ఆర్టిస్టులుః

కృష్ణ పాత్రలో కిరణ్‌ అబ్బవరం బాగా నటించారు. సినిమాని తన భుజాలపై నడిపించాడు. నటుడిగా పరిణతి కనిపిస్తుంది. అయితే సినిమాల్లో ఆయన లోలోపల గునుగునే విధానం కాస్త ఇబ్బంది పెట్టే అంశం. నటుడిగా ఇంకాస్త ఫ్రీ అవ్వాలి. కానీ సైలెంట్‌గా హ్యూమర్‌ పండించాడు. శాన్విగా చాందిని చౌదరి చాలా బాగా నటించింది. సినిమా ఫలితానికి అతీతంగా నటిగా ఆమెని మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుంది. కిరణ్‌కి తండ్రిగా గోపరాజు రమణ మరోసారి మెప్పించారు. తల్లిగా నటి సితార మెరిసింది. మిగిలిన ఆర్టిస్టులు ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. 
 

sammathame movie review,

టెక్నీకల్‌గాః
దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్‌ మంచిదే, కాకపోతే అది చిన్నదైపోయింది. ఓటీటీలో వచ్చే చిత్రాలకు ఇలాంటి పాయింట్‌తో సినిమాలు వర్కౌట్‌ అవుతాయి. కానీ పెద్దతెరపై చూసినప్పుడు ఆడియెన్స్ ఇంకాస్త కావాలనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. హీరోహీరోయిన్ల మధ్య సంఘర్షణ, అమ్మాయిలు, అబ్బాయిల లైఫ్‌ స్టయిల్‌లోని తప్పొప్పులను ఇంకాస్త బలంగా చూపించాల్సింది. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ బాగుంది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకి బలం. పాటలు చాలా బాగున్నాయి. 

చివరగా ఇది ఆశించిన స్థాయిలో `సమ్మతమే` అనిపించలేకపోయింది.


రేటింగ్‌ః 2.5

Latest Videos

click me!