లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఇటీవల మంచి ఆదరణ సాధిస్తున్నాయి. బలమైన కథ ఉంటే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మంచి ఆదరణ సాధిస్తున్నాయి. ఇటీవల సినిమాలు తగ్గి ఫేడౌట్‌గా మారిపోతున్న రెజీనా, నివేథా థామస్ కలిసి లేడీ ఓరియెంటెడ్ చిత్రం `శాకిని దాకిని` చిత్రంలో నటించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్‌బాబు, సునీత తాటి నిర్మించారు. సక్సెస్ అయిన కొరియన్ మూవీ `మిడ్ నైట్ రన్నర్` చిత్రానికి రీమేక్. నేడు శుక్రవారం(సెప్టెంబర్ 16) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ(Saakini Daakini Review)లో తెలుసుకుందాం.
కథః
షాలిని(నివేథా థామస్), దామిని(రెజీనా) పోలీసు ట్రైనింగ్ కోసం అకాడమీలో జాయిన్ అవుతారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. అహంకారంతో గొడవలు పెట్టుకుంటారు. టామ్ అండ్ జెర్రీలా ఉండే వీరిద్దరు ఓ రోజు అర్థరాత్రి అనుకోకుండా ఓ అమ్మాయిని కిడ్నాప్ ని చూస్తారు. వాళ్లిద్దరు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా విఫలమవుతారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వాళ్లంతా మరో ఓ పెద్ద కేసులో బిజీగా ఉంటారు. దీంతో ఈ కేసుని లైట్ తీసుకుంటారు. ఇక లాభం లేదని భావించిన షాలిని, దామిని ఇద్దరు కలిసి అనధికారికంగా ఎంక్వైరీ చేస్తుంటారు. అందులో కేసు వెనకాల పెద్ద క్రైమ్ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుంటారు. మరి ఆ కేసుని ఎలా ఛేదించారు? ఆ కేసు వెనకాల ఉన్న క్రైమేంటి? ఎప్పుడూ గొడవలు పడే షాలిని, దామిని ఎలా కలిశారు? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
క్రైమ్,ఇన్వెస్టిగేషన్ బేస్డ్ చిత్రాలు చాలా వచ్చాయి. థ్రిల్లర్స్ లో ప్రధానంగా ఇలాంటి కథలే ఉంటాయి. కాకపోతే అవి వేగంగా, ట్విస్ట్ లు, టర్న్‌లు, అదిరిపోయే బీజీఎంతో సాగితేనే సినిమా ఆకట్టుకుంటుంది. లేదంటే టార్చర్‌గా ఉంటుంది. బోర్ తెప్పిస్తుంది. థియేటర్లో కూర్చొన్న ఆడియెన్స్ కి విసుగు పుట్టిస్తుంటుంది. `శాకిని డాకిని` సినిమా విషయంలో ఇదే జరిగింది. అయితే జనరల్‌గా హీరోలు ఇలాంటి కథలు చేయడం రొటీన్, హీరోయిన్లు చేయడం ఈ సినిమాలో కొత్త పాయింట్. అదే సమయంలో ఇదొక కొరియన్ సినిమా రీమేక్. కానీ రీమేక్ అనే ఫీలింగ్ లేకుండా తెలుగుకి తగ్గట్టుగా మార్పులు చేసి, పూర్తి తెలుగు సినిమాగా మార్చడంలో సక్సెస్ అయ్యారు సుధీర్ వర్మ. దీంతోపాటు ఇద్దరు హీరోయిన్ల మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ సన్నివేశాలు కాస్త కామెడీని పండిస్తుంటాయి. ఇవే ఈ చిత్రానికి ప్లస్.
కానీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రానికి కావాల్సిన అంశాలు మిస్ కావడం సినిమాకి మైనస్. సినిమా అసలు కథ స్టార్ట్ కావడానికి టైమ్ తీసుకోవడం బోర్‌ని తెప్పిస్తుంది. అమ్మాయి కిడ్నాప్ జరిగేంత వరకు స్లోగా సాగుతుంది. కిడ్నాప్ తో సినిమా పరుగులు పెడుతుందని అంతా భావించారు. కానీ కథ మళ్లీ మొదటికి వస్తుంది. హీరోయిన్లు విక్టిమ్‌ని కనిపెట్టే క్రమంలో ఏదో ఆసక్తికర అంశాలు వస్తాయని భావించినా అలాంటిదేమీ జరగదు, ఆ ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్‌గా బోరింగ్‌గా సాగుతుంటుంది. ఈ క్రైమ్‌లో బాధితులు చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. వారి తాలుకూ ఎమోషన్స్ ని సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో ఆడియెన్స్ కథకి కనెక్ట్ కాలేక పోతుంటారు.
ఓ సీన్ తర్వాత మరో సీన్ వస్తుంటుంది తప్పితే, ఎమోషన్స్ కనెక్ట్ కావు. దీంతో బోర్ ఫీలింగ్ తెప్పిస్తుంది. చాలా సన్నివేశాల్లో లాజిక్కులకు స్కోపే లేదు. ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థం కాదు. దీంతో ఇదొక కిచిడి సినిమాగా మారిపోయింది. రొటీన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీగా మిగిలిపోయింది. దీంతో నివేథా థామస్, రెజీనాలు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది.
నటీనటులుః
నివేథా థామస్, రెజీనా సినిమా కోసం బాగానే కష్టపడ్డారు. కామెడీ సన్నివేశాలు బాగా చేశారు. ఇద్దరు పోటీ పడ్డారు. నివేథా థామస్ బబ్లీ లుక్ బాగుంది. సుధాకర్‌రెడ్డి, రఘుబాబు, పృథ్వీల కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగిలిన పాత్రలు పరధి మేరకు ఫర్వాలేదనిపించారు.
సాంకేతికం వర్గంః
దర్శకుడు సుధీర్ వర్మ కొరియన్ సినిమాని తెలుగుకి తగ్గట్టు మార్పులు చేయడంలో సక్సెస్ అయ్యాడు. సీరియస్‌గా సాగే కథని వినోదాత్మకంగా మల్చడంలో సక్సెస్ అయ్యాడు. కానీ అంతకు మించి ఆయన ఇంకేం చేయలేకపోయాడు. దీంతో కథనం ఫ్లాట్‌గా మారిపోతుంది. సంగీతానికి స్కోప్ లేదు. బీజీఎం సైతం పరుగులు పెట్టించలేకపోయింది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిర్మాణం బాగానే ఉంది. సినిమా ఓవరాల్‌గా విఫలప్రయత్నంగా చెప్పొచ్చు.