
సీనియర్ నటి రోజా తన సినీ ప్రయాణంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. షూటింగ్ గ్యాప్‌లో తను నిద్రపోతున్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన అల్లరి పనిని గుర్తుచేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో రోజూ ఏదో ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వస్తూనే ఉంటుంది. పాత తరం నటీనటులు చెప్పే తెరవెనుక కథలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి వచ్చే వార్తలు, షూటింగ్‌లో సంఘటనలు, జోక్స్ తెలుసుకోవాలని అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా 90వ దశకంలో కుర్రకారుకు కలల రాణి. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలందరి సరసన ఆమె నటించారు. తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లో కూడా రోజా తన సత్తా చాటారు. తెలుగు, కన్నడ భాషల్లోనే కాకుండా తమిళంలో కూడా రోజా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ గురించి ఆమె చెప్పిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రజనీకాంత్‌తో కలిసి పనిచేసినప్పటి అనుభవాలను రోజా ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రజనీతో కలిసి ఆమె రెండు సినిమాల్లో నటించారు. ఆ షూటింగ్ సెట్స్‌లో జరిగిన ముచ్చట్లను ఆమె గుర్తుచేసుకున్నారు. బయటకు చూడ్డానికి రజనీకాంత్ చాలా సీరియస్‌గా కనిపిస్తారు. కానీ రోజా చెప్పేది వేరు. రజనీ చాలా సరదాగా ఉంటారని, తనతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా జోకులు వేస్తూ మాట్లాడేవారని ఆమె చెప్పారు.
మీతోనే రజనీ ఎందుకు అలా ఉంటారు? రోజాను అడిగిన మీనా
ఒకసారి నటి మీనాకు, రోజాకు మధ్య రజనీకాంత్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. 'రజనీకాంత్ నాతో ఎప్పుడూ చాలా సీరియస్‌గా ఉంటారు. కానీ మీతో మాత్రం చాలా సరదాగా ఉంటారు, ఎందుకు?' అని మీనా ఒకసారి రోజాను అడిగారట. దానికి రోజా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. 'నువ్వు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటావు. అందుకే నీతో ఏం మాట్లాడాలో తెలియక ఆయన కూడా సీరియస్‌గా ఉంటారు' అని రోజా చెప్పారు. తాను మాత్రం అందరితో ఎప్పుడూ ఫ్రెండ్లీగా, నవ్వుతూ ఉంటానని, అందుకే రజనీకాంత్ కూడా తనతో చాలా ఫ్రీగా జోకులు వేసేవారని రోజా చెప్పుకొచ్చారు.
షూటింగ్ సమయంలో జరిగిన మరో ఫన్నీ ఇన్సిడెంట్‌ను కూడా రోజా గుర్తుచేసుకున్నారు. 'భోజనం చేశాక నేను ఈజీ చైర్‌లో పడుకునేదాన్ని. ముఖ్యంగా పాటలు, క్లోజప్ షాట్స్ తీసే ముందు కాస్త టైమ్ దొరికితే అలా రెస్ట్ తీసుకునేదాన్ని. అలా ఒకసారి నేను నిద్రపోతున్నప్పుడు రజనీకాంత్ నాతో ఆటపట్టించడం మొదలుపెట్టారు. ఆయన ఒక గొడుగు పట్టుకుని నా పక్కనే నిలబడ్డారు. నేను మంచి నిద్రలో ఉన్నాను. అప్పుడే నా ఫోటోలు తీశారు. మెలకువ వచ్చి చూసేసరికి నా చుట్టూ చాలా మంది నిలబడి ఉన్నారు. అప్పుడు చూశాను, రజనీకాంత్ గొడుగు పట్టుకుని అక్కడే నిలబడి ఉన్నారు' అని రోజా నవ్వుతూ చెప్పారు. అందరి ముందు ఇలా సరదాగా ఆటపట్టించడం రజనీకాంత్ నైజం అని ఆమె అన్నారు.
అలాగే సీనియర్ నటుడు శివాజీ గణేశన్ గురించి కూడా రోజా మాట్లాడారు. అంత పెద్ద స్టార్ హీరో అయినా సరే, ఆయన షూటింగ్ సెట్‌లోనే ఎక్కువ సమయం గడిపేవారట. లంచ్ బ్రేక్ వచ్చే వరకు ఆయన సెట్ నుంచి బయటకు వెళ్లేవారు కాదని చెప్పారు. ఇలాంటి సీనియర్ నటుల అంకితభావం, వృత్తి పట్ల వాళ్లకున్న గౌరవం చూసి ఇప్పటి తరం నేర్చుకోవాల్సింది చాలా ఉందని రోజా అన్నారు.