
రామ్ చరణ్ ఇటీవల `పెద్ది` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. వెంకట్ సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదలై బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లని రాబట్టింది. దీంతో మంగళవారం పెద్ది మూవీ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు జనాలు అంతా తనని పెద్ది అనే పిలుస్తున్నారని, రామ్ చరణ్ అనే పేరుని మర్చిపోయారని తెలిపారు. తన ఇంట్లోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని, తన కూతురు క్లీంకార కూడా తనని పెద్ది అనే పిలుస్తుందని చెప్పారు. `బయటే కాదు ఇంట్లో కూడా నా పేరుని మర్చిపోయారు. మా బుడ్డది క్లీంకార.. `పెద్ది`కి ముందు నాన్న నాన్న అని పిలిచేది. కానీ పెద్ది చూశాక.. `ఏయ్ పెద్ది` అని పిలుస్తోంది. తప్పు అమ్మ.. నాన్నని అలా పిలవొద్దు అని చెప్పినా వినడం లేదు. అంతగా తన పాత్రని అందరు హోన్ చేసుకున్నారు` అని తెలిపారు రామ్ చరణ్.
ఆయన ఇంకా మాట్లాడుతూ, `కొన్ని విజయాలు మనల్ని ఆనందపరుస్తాయి. కొన్ని విజయాల గురించి ఆలోచిస్తే మనసుకు చాలా తృప్తిని ఇస్తాయి. `పెద్ది` విజయం మాత్రం నా జీవితాన్నే మార్చేసింది. పెద్ది లాంటి అనుభూతి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అలాంటి గొప్ప అనుభూతిని ప్రేక్షకులు నాకు అందించారు. ఈ సినిమా ద్వారా నా గుండెల్లో జీవితాంతం దాచుకునే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అందుకే ముందుగా మీ అందరికీ థాంక్యూ. నేను సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే చాలా కొత్త ఆడియన్స్ థియేటర్లకు వచ్చినట్లు అనిపించింది. చిన్న పిల్లలు ‘మస్సా మస్సా’ పాటకు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పేరెంట్స్ ఎంత నమ్మకం పెడితే తమ పిల్లలను కూడా థియేటర్లకు తీసుకొస్తారో అది ఈ సినిమా ద్వారా తెలిసింది. అది బుచ్చిబాబు చేసిన ప్రయత్నానికి దక్కిన గొప్ప గౌరవం. చిన్నవాళ్లతో పాటు పెద్దవాళ్లు కూడా లుంగీలు కట్టుకుని, తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేస్తూ కనిపించడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. మళ్లీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో తెలియదు. ఈ సినిమాను మీరు ఎంతగా ఆదరించారంటే, రామ్ చరణ్‌ను మర్చిపోయి పెద్దినే గుర్తుపెట్టుకుంటారేమో అనిపిస్తోంది. ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చిన బుచ్చిబాబుకు చాలా థాంక్స్.
సుకుమార్ గారు నా ఫేవరెట్ పర్సన్. నా జీవితంలో ఎప్పుడైనా చిన్న డౌన్ మూమెంట్ వచ్చినా, నాన్నగారి తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారే. ఆయన లెక్చరర్‌గా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. నన్ను కూడా ఒక స్టూడెంట్‌లా చూసి గైడ్ చేయాలని నేను ఎప్పుడూ అడుగుతుంటాను. నిర్మాత సతీష్ గారు పెద్ది సినిమాకు ఒక బలమైన పిల్లర్‌లా నిలబడ్డారు. తొలి సినిమాకే నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి, ఎక్కడా రాజీ పడకుండా నిలిచిన ఆయనకు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. రత్నవేలు గారు ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆయన సినిమాటోగ్రఫీ నిజంగా మాస్టర్‌పీస్. రెహమాన్ గారు తన సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. అలాగే మా టీమ్‌లోని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు అన్ని విభాగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తోంది. ‘తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా ఎవరినీ ఇష్టపడరు. ఒకసారి ఇష్టపడితే చనిపోయే వరకు ప్రేమిస్తూనే ఉంటారు.’ అదే ప్రేమను మీరు పెద్దిపై చూపించారు. ప్రేక్షకులు ఈ సినిమాను తమ సినిమాగా భావించి తమ భుజాలపై మోసుకుని ఘన విజయాన్ని ఇచ్చారు. ఈ సినిమాలోని మంచిని గుర్తించి ఆదరించిన ప్రతి ప్రేక్షక దేవుడికి నా సెల్యూట్. ఈ సినిమాకు రివ్యూలు ఇచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జాన్వీ కపూర్‌కు, అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాట చేసిన శ్రుతి హాసన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు` అని తెలిపారు రామ్ చరణ్. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సినిమాటోగ్రఫీ మంత్రులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.