
సూపర్ స్టార్ రజనీకాంత్ `రోబో` తర్వాత మళ్లీ ఆ రేంజ్ విజయాన్ని `జైలర్`తో అందుకున్నారు. మధ్యలో `లింగా`, `కబాలి`, `కాలా`, `పేటా`, `దర్బార్`, `2.0` లాంటి చాలా సినిమాలు చేశారు. వీటిలో కొన్ని యావరేజ్‌గా ఆడాయి, మరికొన్ని డిజాస్టర్‌గా నిలిచాయి.
కానీ రజనీకాంత్ స్టామినా ఏంటో చూపించింది మాత్రం `జైలర్` అనే చెప్పాలి. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా వచ్చింది ఏకంగా రూ.650కోట్లు వసూలు చేసి కోలీవుడ్ వర్గాలను షాక్‌కి గురి చేసింది. ఆ తర్వాత నటించిన `వేట్టయాన్` కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఈ క్రమంలో ఇప్పుడు మరో భారీ సినిమాతో రాబోతున్నారు రజనీకాంత్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఆల్మోస్ట్ పూర్తయినట్టు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. లోకేష్ గత చిత్రాలు కూడా భారీ విజయాలు సాధించడంతో ఆ అంచనాలు మరింత పెరగడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు.
లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న `కూలీ` చిత్రంలో రజనీకాంత్‌తోపాటు తెలుగు నుంచి స్టార్ హీరో నాగార్జున నటిస్తున్నారు. తమిళం నుంచి రజనీతోపాటు శృతి హాసన్ నటిస్తోంది. కన్నడ నుంచి ఉపేంద్ర ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక హిందీ నుంచి బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్నారు.
ఈ మూవీలో నాగార్జున నెగటివ్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఓ రకంగా ఆయనది విలన్ పాత్ర అని చెప్పొచ్చు. నాగార్జున యాక్షన్ సీన్ చేస్తున్న ఒకవీడియో గతంలో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఇందులో ఆయన ఎవరినో కొడుతున్నట్టు కనిపించారు.
దీంతో ఈ లీక్ వీడియో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. నాగ్ గతంలో ఎప్పుడూ చేయని పాత్రని ఇందులో పోషిస్తున్నారట. అది సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. మరోవైపు ఊపేంద్ర పాత్ర సైతం కొత్తగా ఉంటుందని, అదే సమయంలో చాలా పవర్ఫుల్‌గానూ ఉంటుందని టాక్.
`కూలీ`లో అమీర్ ఖాన్ రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉండనుందట. క్లైమాక్స్ లో ఆయన పాత్ర వస్తుందని టాక్. కమల్ హాసన్ నటించిన`విక్రమ్` సినిమాలో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర క్లైమాక్స్ లో వచ్చి ఎలా అయితే హైలైట్ అయ్యిందో, ఇందులోనూ అమీర్ ఖాన్ పాత్రని అలానే డిజైన్ చేశారట లోకేష్ కనగరాజ్.
అందుకే ఆయన పాత్ర గురించి పెద్దగా డిటెయిల్స్ బయటకు రావడం లేదు. ఇంకోవైపు ఇందులో పూజా హెగ్డే ఒక ఐటెమ్ సాంగ్ చేసింది. ఈ పాట కూడా ఊపేసేలా ఉంటుందని సమాచారం.
కానీ రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందుతుండటంతో సినిమాపై భారీ అంచనాలే కాదు, బిజినెస్ కూడా భారీగానే జరుగుతోందట. తాజాగా ఓవర్సీస్ బిజినెస్‌కి సంబంధించిన అసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
రజనీకాంత్ నటించిన `కూలీ` ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడు పోయాయట. ఇప్పటి వరకు తమిళంలో మరే సినిమాకి సాధ్యం కాని రేట్‌కి డీల్ సెట్ అయ్యిందని, గత రికార్డులు అన్నింటిని `కూలీ` మూవీ బ్రేక్ చేస్తుందని తెలుస్తోంది.
ఈ మూవీకి ఓవర్సీస్ రైట్స్ ఏకంగా రూ.80 కోట్లకుపైగానే అమ్ముడుపోయినట్టు టాక్. ఈ విషయాన్ని తమిళ సినీ విశ్లేషకుడు రమేష్ బాల వెల్లడించారు. ఇంత భారీ మొత్తానికి గతంలో మరే తమిళ చిత్రం సేల్ కాలేదని ఆయన ట్వీట్‌ని బట్టి అర్థమవుతుంది.
ఇదే నిజమైతే ఓవర్సీస్‌లో కోలీవుడ్ నుంచి రజనీకాంత్ బిగ్గెస్ట్ హీరోగా నిలిచారని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఆయన అభిమానులు ప్రస్తావిస్తూ ఓవర్సీస్ రారాజు రజనీకాంత్ అంటూ అభివర్ణిస్తున్నారు. వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ఓవర్సీస్ డీల్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
`కూలీ` మూవీకి సంబంధించిన కథేంటనేది చూస్తే, ఇది గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. రజనీకాంత్ గోల్డ్ వాచ్‌ల కోసం ప్రత్యర్థులను మట్టుపెట్టడం చూపించారు. అంటే వాచ్‌లకు, గోల్డ్ కి ఉన్న సంబంధాన్ని ఇందులో చూపించబోతున్నారని తెలుస్తోంది.
బేసిక్‌గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక స్మగ్లింగ్ గురించి ప్రస్తావిస్తున్నాడు. మెడికల్ మాఫియాని, మాదక ద్రవ్యాల మాఫియాని చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్‌ని చూపించనున్నట్టు సమాచారం.
అయితే వీటన్నింటికి లింక్ చేస్తూ ఆయన తన సినిమాలను రూపొందించడం విశేషం. మరి తన గత చిత్రాలకు ఈ మూవీకి ఎలా లింక్ చేయబోతున్నాడు, దీన్ని తన `లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్`(ఎల్‌సీయూ)లో ఎలా భాగం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నట్టు టీమ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన `వార్ 2` కూడా విడుదల కానుంది.