Chiranjeevi Vs Rajasekhar
టాలీవుడ్ లో పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరోల్లో రాజశేఖర్ ఒకరు. సీరియస్ పాత్రల్లో నటించాలి అంటే రాజశేఖర్ ది బెస్ట్ అన్నట్లుగా గుర్తింపు పొందారు. టాలీవుడ్ నంబర్ 1 హీరోగా ఎదిగే అవకాశం రాజశేఖర్ కి ఒక దశలో వచ్చింది. అప్పటికి మెగాస్టార్ చిరంజీవి టాప్ లో ఉన్నారు. చిరుతో బాలయ్య పోటీ పడుతున్నారు. అప్పటికి వెంకటేష్, నాగార్జునకి మాస్ లో ఇంకా క్రేజ్ రాలేదు.
rajasekhar
చిరంజీవి, బాలయ్య ఇద్దరితో రాజశేఖర్ పోటీ పడేవారు. ముఖ్యంగా అంకుశం చిత్ర సమయంలో రాజశేఖర్ క్రేజ్ పీక్ స్టేజికి వెళ్ళింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ యాంగ్రీ పోలీస్ పాత్రలో ఒక చిత్రం చేయాలని కథ సిద్ధం చేసుకున్నారు. అంతకు ముందే రాజశేఖర్ తో ఆహుతి అనే హిట్ చిత్రాన్ని కోడి రామకృష్ణ తెరకెక్కించారు. దీనితో అంకుశం చిత్రానికి కూడా హీరోగా రాజశేఖర్ నే తీసుకోవాలని అనుకున్నారు.
రాజశేఖర్, కోడిరామకృష్ణ, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కాంబినేషన్ లో అంకుశం చిత్రం ప్రారంభం అయింది. హీరోయిన్ గా జీవితని తీసుకున్నారు. ఈ చిత్రంతోనే రామిరెడ్డి విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. 50లక్షల బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 4 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రాజశేఖర్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. ఈ చిత్రంతోనే రాజశేఖర్ కి యాంగ్రీ మ్యాన్ బిరుదు వచ్చింది.
ఈ చిత్రంతో రాజశేఖర్ కి ఒక్కసారిగా అభిమానులు పెరిగారు. చిరంజీవి, బాలయ్య తర్వాత రాజశేఖర్ కి దర్శక నిర్మాతలు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. అదే జోరులో ఇంకొన్ని హిట్ చిత్రాలు పడితే రాజశేఖర్ చిరంజీవిని మించిపోయినా ఆశ్చర్యం లేదు అనే చర్చ అప్పట్లో టాలీవుడ్ లో జరిగింది. 1989లో అంకుశం చిత్రం తెరకెక్కింది. రాజశేఖర్ టాప్ హీరోగా ఎదగడానికి ఇదే సరైన అవకాశం అని అంతా భావించారు.
కానీ అదే సమయంలో చిరంజీవి మరింత జోరు పెంచారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రెండేళ్ల వ్యవధిలోనే చిరంజీవికి పడ్డాయి. దీనితో చిరు టాలీవుడ్ లో ఎవరికీ అందనంత ఎత్తు వెళ్లిపోయారు. అదే టైం లో రాజశేఖర్ కథల ఎంపిక ట్రాక్ తప్పింది. అంకుశం తర్వాత అల్లరి ప్రియుడు వరకు సాలిడ్ హిట్ అంటూ పడలేదు. దీనితో రాజశేఖర్ నంబర్ 1 రేసులో వెనుకబడిపోయారు.