దర్శకధీరుడు రాజమౌళి సినిమా మొదలు పెడితే ప్రారంభం నుంచే పక్కా ప్లాన్ తో వెళతారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్, పబ్లిసిటీ ఇలా ప్రతి విషయంలో రాజమౌళికి ఒక ప్లాన్ ఉంటుంది. రాజమౌళి మగధీర లాంటి భారీ చిత్రం తర్వాత మర్యాదరామన్న చేశారు. చాలా సింపుల్ గా ఆ చిత్రాన్ని ముగించి హిట్ కొట్టారు.
అయితే రాజమౌళి ప్రణాళికలు కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. మర్యాదరామన్న తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఈగ. ఈ చిత్రం విషయంలో రాజమౌళి అనుకున్నది వేరు.. కానీ జరిగింది వేరు. రాజమౌళి ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు.
ఈగ చిత్రాన్ని రాజమౌళి మర్యాదరామన్న కంటే అతి చిన్న చిత్రంగా చేయాలనుకున్నారట. ఈగతో సినిమా చేస్తే ఎవరు చూస్తారు ? అనే అనుమానం రాజమౌళికి కూడా ఉండేది. ఇన్ని హిట్స్ కొట్టాం కదా.. తక్కువ బడ్జెట్ లో ప్రయోగం చేసి చూద్దాం.. డబ్బు పోతే పోయింది అని అనుకున్నట్లు రాజమౌళి తెలిపారు.
కనీసం మీడియాకి, జనాలకు ఎవరికీ తెలియకుండా తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేసి సర్ప్రైజింగ్ గా సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారట. కానీ మీడియాలో ఈగ చిత్రం గురించి మ్యాటర్ లీక్ అయిపోయింది. ఈ చిత్రం గురించి కొన్ని నిజాలు, కొన్ని పుకార్లు వైరల్ కావడం మొదలయ్యాయి.
ನಂದಿ
రాజమౌళి ఒక యానిమేషన్ చిత్రం చేస్తున్నారని.. ఇందులో హీరోయిన్లు హీరోలు ఉండరు అంటూ ప్రచారం మొదలయింది. తాను సీక్రెట్ గ సినిమా పూర్తి చేద్దాం అనుకుంటే అసలుకే మోసం వచ్చేలా పరిస్థితి మారింది.
దీనితో రాజమౌళి రంగంలోకి దిగి ఈగ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. స్టోరీ లైన్ ని వివరించారు. చిన్న చిత్రం గా రిలీజ్ చేద్దాం అనుకుంటే ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయి ఈగ భారీ చిత్రంగానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.