RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత జక్కన్న, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'వారణాసి' (Varanasi) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మెగా ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించనున్నారట. తాజాగా ఈ సినిమా కథ లీక్ అయిందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే ఓ పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్లో కనిపించనున్నారట. ఈ కుంభ.. రామాయణంలో రావణుడి తమ్ముడైన అత్యంత బలశాలి కుంభకర్ణుడి పునర్జన్మ అని తెలుస్తోంది. రామ-రావణ యుద్ధ సమయంలో ప్రపంచంలోని వేర్వేరు ఖండాల్లో చెల్లాచెదురైన ‘నవరత్న నాల’ అనే తొమ్మిది మాయా రత్నాలను వెతికి పట్టుకోవడమే ఈ కుంభ మెయిన్ టార్గెట్.
ఈ కుంభ ఆదేశాల మేరకే హీరో మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా ఆ తొమ్మిది నిగూఢ రత్నాలను వెతికే పనిలో పడతాడు. అయితే స్టార్టింగ్‌లో దీని వెనకున్న అసలు రహస్యం హీరోకి తెలియదు. ఆ తొమ్మిది రత్నాలు గనక ఒక్కచోట చేరితే, కుంభను ఎవరూ ఎదిరించలేనంత అజేయమైన శక్తి వస్తుందని, దాంతో ప్రపంచానికే ముప్పు వాటిల్లుతుందని ఆ తర్వాత హీరోకి మెల్లగా అర్థమవుతుందట.
ఈ సినిమా కేవలం మైథలాజికల్ స్టోరీ మాత్రమే కాదు, ఓ రేంజ్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. కథ ప్రకారం.. ఆ రత్నాలను వెతికే క్రమంలో మహేష్ బాబు అంతరిక్షంలోని ఓ కాస్మిక్ వార్మ్ హోల్ (Cosmic Wormhole)ను గుర్తిస్తాడు. దాని ద్వారా హీరో టైమ్ ట్రావెల్ చేసి, రామ-రావణ మహాయుద్ధం జరిగే రామాయణ కాలానికి చేరుకుంటాడు. భవిష్యత్తులో ఆ శక్తివంతమైన రత్నాలు దుర్వినియోగం కాకుండా, వాటిని ఆయుధాలుగా వాడకుండా ఆపడానికి హీరో చరిత్రనే మార్చేస్తాడని నెట్టింట ఒక ఇంట్రెస్టింగ్ థియరీ చక్కర్లు కొడుతోంది.