SSMB29 ప్రకటన కోసం హాలీవుడ్‌ దిగ్గజాలు, ఇంటర్నేషనల్‌ మీడియా.. రాజమౌళి స్కెచ్‌ నెక్ట్స్ లెవల్‌?

First Published | Feb 25, 2024, 5:07 PM IST

మహేష్‌ బాబుతో రూపొందించబోతున్న సినిమా విషయంలో రాజమౌళి ప్రారంభం నుంచి భారీ ప్లానింగ్‌తో వెళ్తున్నారట. అందులో భాగంగా అధికారిక ప్రకటనకు భారీ మాస్టర్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్నారట. 
 

మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ఇప్పటి వరకు ఇండియన్‌ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించబోతున్నారు. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం సినిమా కోసం మహేష్‌ బాబు వర్కౌట్స్ చేస్తున్నాడు. పర్‌ఫెక్ట్ షేప్‌ కోసం కష్టపడుతున్నాడు. గత కొంత కాలంగా దీనిపైనే వర్క్ చేస్తున్నారు మహేష్‌. మరోవైపు రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ ఫైనల్‌ చేస్తున్నారు. అదే సమయంలో సినిమా లాంఛింగ్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

రాజమౌళి ఈ మూవీకి ప్రకటన చాలా భారీగా ప్లాన్‌ చేస్తున్నారట. జనరల్‌గా ఆయన తన సినిమాలను మీడియా వేదికగా ప్రకటిస్తారు. అందుకోసం ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తారు. ఇందులో ఎలాంటి సినిమా చేయబోతున్నారో వివరిస్తాడు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారట. అయితే ఈ సారి మాత్రం అంతర్జాతీయ వేదికగా ఈ మూవీని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 


మహేష్‌బాబు(ఎస్‌ఎస్‌ఎంబీ29) మూవీ ప్రకటనకు అంతర్జాతీయ మీడియాని కూడా ఆహ్వానించబోతున్నారట. వాళ్లని కూడా ఈ మూవీ ప్రకటనలో భాగం చేస్తే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నారట. అంతేకాదు దీనికి మరో స్కెచ్‌ వేశారట రాజమౌళి.. అంతర్జాతీయ మీడియా అటెన్షన్ తమవైపు ఉండేలా చూస్తున్నారట. అందుకోసం ఓ హాలీవుడ్‌ దిగ్గజాన్ని దించాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. 
 

ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ఆస్కార్‌ కోసం పోటీ పడుతున్న సమయంలో హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్ దర్శకులు `ఆర్‌ఆర్‌ఆర్‌` గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. సినిమాని కీర్తించారు. తమ అభినందనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఒకరు మహేష్‌బాబు సినిమా ప్రకటనలో పాల్గొనేలా ప్లాన్‌ చేస్తున్నారట. అందుకోసం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. 

దీనిపై రాజమౌళి గట్టిగానే ఉన్నారట. ఎందుకంటే జేమ్స్ కామెరాన్‌, స్టీవెన్ స్పీల్‌బర్గ్ లో ఎవరు ఒక్కరైనా తమ సినిమా ప్రకటనలో పాల్గొంటే ఆటోమెటిక్‌గా అంతర్జాతీయ మీడియా అటెన్షన్‌ ఈ మూవీపై ఉంటుంది. దీంతో సినిమా అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఈజీగా మార్కెట్‌ అవుతుంది. ప్రారంభం నుంచే ఈ మూవీ అంతర్జాతీయ ఆడియెన్స్ కి రీచ్‌ అవుతుంది.ఆ తర్వాత ప్రమోషన్స్ పరంగా ఈజీ అవుతుంది. సినిమా పూర్తయ్యే వరకు ఆడియెన్స్ మైండ్‌లోకి వెళ్లిపోతుంది. సినిమా అంతర్జాతీయ ప్రమోషన్‌కి ఇది ఈజీ అవుతుందని జక్కన్న స్కెచ్‌ వేస్తున్నట్టు సమాచారం. ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. 
 

Latest Videos

click me!